ఒక్క దెబ్బకి మందుబాబుల కిక్కుదిగింది!

By KTV Telugu On 1 January, 2023
image

 

ఫైన్లు పడుతున్నాయి. అప్పుడప్పుడూ కొందరికి జైలుశిక్షలు కూడా పడుతున్నాయి. అయినా రోడ్లమీద వాహనాలు తూలుతూనే ఉన్నాయి. జరిమానా మొత్తాలు పెంచినా తేడావస్తే శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నా మందుబాబులు బైక్‌ తోలుతూనే ఉన్నారు స్టీరింగ్‌ తిప్పుతూనే ఉన్నారు. మామూలు రోజుల్లోనే డ్రంకెన్‌ డ్రైవ్‌ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఇక న్యూఇయర్‌ వస్తే పట్టపగ్గాలుంటాయా ఫుల్లు కొట్టేసినోడు కూడా బండి ఎక్కి రచ్చరచ్చ. ఇక లాభంలేదని న్యూఇయర్‌లో సంచలన నిర్ణయం తీసుకుంది తెలంగాణ రవాణాశాఖ.

మందుబాబులు మళ్లీ వాహనం నడిపే అవకాశం లేకుండా సంచలన నిర్ణయం తీసుకుంది తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌. 2022 జనవరి నుంచి డిసెంబరుదాకా డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ 5,819మంది డ్రైవింగ్‌ లైసెన్సులను రద్దుచేసింది. వీరిలో కొందరి డ్రైవింగ్‌ లైసెన్సులు తాత్కాలికంగా రద్దయితే మరికొందరు మరెప్పటికీ వాహనం నడపకుండా చేశారు. డ్రంకెన్ డ్రైవ్ యాక్సిడెంట్ వంటి కేసుల్లో ఆ లైసెన్స్‌లను రద్దు చేసింది రవాణాశాఖ. హైదరాబాద్ పరిధిలో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్ జోన్‌లు ఉండగా ఈస్ట్ జోన్ మినహా మిగతా అన్ని జోన్లలో భారీగా లైసెన్సులు రద్దయ్యాయి. నార్త్ జోన్‌లో 1103, సౌత్‌లో 1151, ఈస్ట్‌లో 510, వెస్ట్ జోన్‌లో 1345 డ్రైవింగ్ లైసెన్స్‌లను క్యాన్సిల్ అయ్యాయి.
మద్యంమత్తులో వాహనాలు నడిపి కొంతమంది ప్రమాదాలకు గురవుతున్నారు. మరికొందరు ఎదుటివారి ప్రాణాలు తీస్తున్నారు. అందుకే ఫైన్లతో భయంరాదని రవాణాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయంతో అనాలోచితంగా డ్రంకెన్‌ డ్రైవ్‌ చేసినివారికి వాహనయోగం లేనట్లే. పైగా ఉద్యోగ అవకాశాల సమయంలో విద్యార్థులు యువకులకు డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు అవరోధంగా మారే అవకాశం ఉంది. డ్రంకెన్‌ డ్రైవ్‌లో దొరికేవారి డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేయాలని కొన్నేళ్లుగా ట్రాఫిక్‌ పోలీసులు కోర్టుల్ని అభ్యర్థిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపేవారు సూసైడ్‌ బాంబర్ల కంటే ప్రమాదమని ఢిల్లీ కోర్టు కొన్నేళ్ల క్రితం వ్యాఖ్యానించడంతో పాటు మందుబాబుల డ్రైవింగ్‌ లైసెన్సు రద్దు చేయాలని సూచించింది. తెల్లారేసరికి దిగిపోయే కిక్కుకోసం డ్రైవింగ్‌ లైసెన్సులు పోగొట్టుకోడానికి డ్రంకర్స్‌ సిద్ధమా? వాళ్లే నిర్ణయించుకోవాలి.