2023 మొత్తం క్రీడా సంబరమే. ఫ్యాన్స్‌కు ఈ సంవత్సరమంతా కన్నులపండుగే అని చెప్పాలి. ఓ వైపు ఆసియా క్రీడలు మరోవైపు క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లుండడంతో ఈఏడాది అంతా సందడే సందడి. గత పరాభవాలను మరిపిస్తూ నూతన సంవత్సరంలో సత్తాచాటేందుకు భారత క్రీడాకారులు సన్నద్ధమవుతున్నారు. ఏడాది ఆరంభంలోనే హాకీ సంబరం మొదలు కానుంది. భారత్ వేదికగా పురుషుల హాకీ ప్రపంచకప్ సమరానికి జనవరి 13న మొదలవుతుంది. 29 వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు తలపడనున్నాయి. ఒడిషాలోని భువనేశ్వర్, రూర్కెలాలో మ్యాచ్‌లు జరుగుతాయి. సొంతగడ్డపై ప్రపంచకప్‌లో భారత్ సత్తాచాటాలని చూస్తోంది. 1975లో విశ్వ విజేతగా నిలిచిన భారత్ అంతకంటే ముందు 1973లో రన్నరప్ ట్రోఫీ దక్కించుకుంది. ఆ తర్వాత చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలనే కసితో ఉంది.
2011లో ధోనీ సారథ్యంలో చివరగా భారత్ వన్డే వరల్డ్ కప్ గెలుచుకుంది. ఆ తర్వాత నుంచి కప్ అందని ద్రాక్షగానే మిగిలింది. ఏ ఫార్మాట్లోనూ విశ్వవిజేతగా నిలవలేకపోయింది. రెండు వన్డే, అయిదు టీ20 ప్రపంచకప్‌ల్లోనూ నిరాశ తప్పలేదు. దశాబ్ద కాలానికి పైగా సాగుతున్న ఈ నిరీక్షణకు ముగింపు పలికేందుకు టీమ్‌ఇండియాకు మరో ఛాన్స్ వచ్చింది. 2023లో భారత్‌లో వన్డే ప్రపంచకప్ జరుగుతుంది. సొంతగడ్డపై మనవాళ్లు మరోసారి చెలరేగి కప్ సాధిస్తారనే ఆశతో అభిమానులున్నారు. అక్టోబర్‌లో ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. స్వదేశంలో శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ జనవరి 3 నుంచి భారత్ ప్రారంభిస్తుంది. ఆ తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లతో సొంతగడ్డపై తలపడుతుంది. అనంతరం ఐపీఎల్ కిక్కు జూన్‌లో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఉండనే ఉన్నాయి. ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటన అనంతరం ఆసియా కప్ జరుగుతుంది. వన్డే ప్రపంచకప్ తర్వాత ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పర్యటనలతో భారత్ ఏడాదిని ముగిస్తుంది. మరోవైపు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య ఇంగ్లాండ్ వేదికగా జూన్ 16న యాషెస్ ఈ సిరీస్ ఆరంభమవుతుంది.
ఇప్పటివరకూ ఒక్కసారి కూడా ప్రపంచకప్ ముద్దాడని భారత మహిళల క్రికెట్ జట్టు మరోసారి వేటకు సిద్ధమైంది. దక్షిణాఫ్రికాలో జరిగే టీ20 ప్రపంచకప్‌లో విజయమే లక్ష్యంగా బరిలో దిగనుంది. ఫిబ్రవరి 10 నుంచి 26 వరకు జరగనున్న ఈ టోర్నీ కోసం హర్మన్ ప్రీత్‌కౌర్ నేతృత్వంలోని అమ్మాయిల జట్టును బీసీసీఐ ప్రకటించింది. 2020లో భారత మహిళల జట్టు ఫైనల్ చేరినప్పటికీ ఆస్ట్రేలియాపై ఓటమితో కప్ చేజార్చుకుంది. ఈ సారి మాత్రం విశ్వవిజేతగా నిలవాలనే పట్టుదలతో ఉంది. అంతకంటే ముందు జనవరి 14 నుంచి 29 వరకు దక్షిణాఫ్రికాలోనే జరిగే మొట్టమొదటి అండర్-19 అమ్మాయిల టీ20 ప్రపంచకప్‌లో భారత్ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మరోవైపు తొలిసారి మహిళల ఐపీఎల్‌కు ఈ ఏడాదే తెరలేవనుంది.
2022 పురుషుల ఫిఫా ప్రపంచకప్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు మంచి కిక్కునిచ్చింది. ఈ ఏడాది ఆ జోష్‌ను కొనసాగించేందుకు అమ్మాయిల ఫుట్‌బాల్ ప్రపంచకప్ వచ్చేస్తోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఉమ్మడిగా ఆతిథ్యమివ్వనున్న ఈ మెగా టోర్నీ జులై 20న ఆరంభమవుతుంది. 32 జట్లు కప్పు కోసం పోటీపడనున్నాయి. 2022లో ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచిన నిఖత్ ఈ ఏడాది కూడా టైటిల్ దక్కించుకోవాలనే లక్ష్యంతో ఉంది. నిరుడు ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం, డైమండ్ లీగ్ టైటిల్ సాధించిన నీరజ్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో అతను పసిడి సాధించాలనే లక్ష్యంతో ఉన్నాడు.
2019లో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించిన పీవీ సింధు మరోసారి ఆ ఘనత పునరావృతం చేస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. అంతకుముందు రెండేసి కాంస్యాలు (2013, 2014) రజతాలు (2017, 2018) గెలిచిన ఆమె 2022లో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌కు దూరమైంది. కామన్వెల్త్ క్రీడల సందర్భంగా ఆమె ఎడమ పాదానికి గాయమైంది. దీంతో ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ ప్రపంచ టూర్ ఫైనల్స్ నుంచి తప్పుకుంది. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న ఆమె ఈ ఏడాది మరోసారి ప్రపంచ వేదికపై సత్తాచాటాలనే లక్ష్యంతో ఉంది. ఇక నిరుడు ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ పురుషుల డబుల్స్‌లో కాంస్యంతో చరిత్ర సృష్టించిన సాత్విక్- చిరాగ్ పైనా మంచి అంచనాలే ఉన్నాయి. వీళ్లతో పాటు శ్రీకాంత్, లక్ష్యసేన్ ఎలాంటి ప్రదర్శన చేస్తారన్నది చూడాలి.
నిరుడు కామన్వెల్త్ క్రీడల్లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన చేసింది. ఇప్పుడదే జోరును ఆసియా క్రీడల్లోనూ కొనసాగించాల్సిన అవసరం ఉంది. 2022లోనే జరగాల్సిన ఆసియా క్రీడలు ఈ ఏడాదికి వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. చైనాలోని హంగ్‌జౌలో సెప్టెంబర్ 23న ఈ క్రీడలు ఆరంభమవుతాయి. 2024 పారిస్ ఒలింపిక్స్‌కు ముందు భారత అథ్లెట్లకు ఈ క్రీడలు మంచి సన్నాహకంగా ఉపయోగపడనున్నాయి. అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాక్సింగ్, చెస్, హాకీ, షూటింగ్, టీటీ, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్ తదితర క్రీడల్లో మనవాళ్లు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2018 జకార్తా క్రీడల్లో 70 పతకాల ప్రదర్శనను ఈ సారి మెరుగుపర్చుకోవాలన్నదే భారత లక్ష్యం.
అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల రేసులో నాదల్‌కు జకోవిచ్ నుంచి ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం 22 టైటిళ్లతో నాదల్ అగ్రస్థానంలో 21 విజయాలతో జకో రెండో స్థానంలో ఉన్నాడు. ఫెదరర్ గతేడాది ఆటకు వీడ్కోలు పలకడంతో ఇప్పుడు పురుషుల సింగిల్స్‌లో నాదల్, జకో మధ్యే ప్రధాన పోటీ. మరి ఈ ఏడాది నాదల్‌ను దాటి జకో ముందుకు వెళ్తాడా? లేదా నాదల్ ఆధిపత్యం కొనసాగిస్తాడా? అన్నది చూడాలి.