జూన్ చల్లని నెల… వేసవి నుంచి సమాజానికి ఉపశమనం లభించే నెల. తొలకరి పలుకరించి.. ప్రకృతి మేను పులకరించి… క్రమంగా ముసురు పట్టుకుని…. రైతు కంట ఆనందభాష్పాలు రాల్చే నెల. భూగర్భ జలాలు పెరిగే నెల. చెరువులు నిండే నెల. ప్రాజెక్టుల్లో జల కళ సంతరించుకునే నెల. వానకు తడిసినా జనం సంతోషించే నెల. జూన్ నెలకు ఇన్ని విశిష్టతలున్నా… తెలంగాణ సర్కారుకు మాత్రం టెన్షన్ పట్టుకుంటోంది. ఈ నెల గడిచేదెలా.. ఈ గండం గట్టెక్కేదెలా.. అంటూ సీఎం కేసీఆర్ నుంచి ఆర్థిక శాఖ అధికారుల వరకు అందరూ తలలు పట్టుకు కూర్చున్నారు. ఈ పరిస్థితికి కారణం ఏమిటి..
హామీలు బారెడు.. ఆర్థిక పరిస్థితి మూరెడు అన్నట్లుగా తయారైందీ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి. ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చలేకపోయినా.. కొత్త వాటిని తెరపైకి తెచ్చి ఓటరు దేవుడ్ని ప్రసన్నం చేసుకునేందుకు నానాతంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాలకు ఆర్థిక కష్టాలు వచ్చి పడుతున్నాయి. ఖజానా ఖాళీ కావడం, కొత్త అప్పు పుట్టకపోవడంతో పథకాల రూపంలో జనానికి ఇచ్చే డబ్బులకు నిధులు లేక మీనమేషాలు లెక్కిస్తున్నారు. తెలంగాణ సర్కారు పరిస్థితి అంతే…. జూన్ లో పంపిణీ చేయాల్సిన నిధుల కోసం ఢిల్లీ వైపు ఆశగా చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అప్పులివ్వండి మహాప్రభో అంటూ తెలంగాణ ఆర్థిక శాఖ అధికారులు ఢిల్లీలో మకాం వేసి మరీ కేంద్రాన్ని వేడుకుంటున్నారు….
దళితబంధు కష్టమేనా….!
సర్కార్ కు జూన్ మాసం మరింత భారం కానుంది. ఇప్పటికే అమలులో ఉన్న పథకాలకు నిధులు లేక కొత్త అప్పులకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వనికి వినతులు వెళ్తున్నాయి. కొత్త పథకాలను జూన్ నుండి ప్రారంభిస్తామని కేసీఆర్ ప్రకటించారు. దేశంలో ఎక్కడా లేనంతగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ప్రకటిస్తున్న తెలంగాణ సర్కారుకు.. అదే స్థాయిలో అప్పులు పెరిగిపోతున్నాయి. దేశంలోనే తొట్టతొలి పథకం అంటూ ప్రారంభించిన దళితబంధుకు నిధుల కొరత మొదలైంది. రెండో విడత కింద ప్రతి నియోజకవర్గంలో దాదాపు 15 వందల మందికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇప్పటివరకు కేవలం వంద కుటుంబాలకు మాత్రమే దళితబంధు అందినట్లు సంబంధిత అధికారులు చెప్తున్నారు. ఈ ఏడాదిలో దళిత బంధు కోసం 17 వేల కోట్లు కేటాయించింది సర్కార్. అయితే ప్రభుత్వం వద్ద డబ్బులు లేకపోవడంతో ఈ నిధులను ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కావడం లేదంటున్నారు అధికారులు. కేంద్ర ప్రభుత్వం కొత్త అప్పులకు అనుమతి ఇవ్వడం లేదు. తక్షణ సహాయం కింద కనీసం రెండు వేల కోట్లు అయిన మంజూరు చేయాలని కోరుతూ ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రామకృష్ణ రావు ఢిల్లీలో మకాం వేశారు…
రైతుబంధు అంతంతమాత్రమేనా !
రైతుబంధు నిధులకు కూడా కటకటగానే ఉంది. జూన్ మొదటి వారంలో వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతుబంధు సాయాన్ని పంపిణీ చేయాలని సర్కార్ భావిస్తోంది. రాష్ట్రంలోని 66.61 లక్షల మంది రైతులకు సంబంధించిన సమగ్ర సమాచారం వ్యవసాయ శాఖ వద్ద ఇప్పటికే ఉంది. సీజన్ మొదలుకాగానే మొదటి వారంలోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమచేయాలని సర్కార్ భావిస్తోంది. 2018లో రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టినపుడు మే నెలలోనే చెక్కులు పంపిణీ చేశారు. ఆ తర్వాత కొన్ని సీజన్లలో ఆలస్యంగా ఇచ్చారు. వానాకాలమైతే జూన్, జులైలో యాసంగి అయితే జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఇస్తూ వస్తున్నారు. ఈసారి మాత్రం జూన్ మొదటి వారంలోనే రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమచేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గడచిన యాసంగి సీజన్ నాటికే రాష్ట్రంలో 66.61 లక్షల మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలున్నాయి. 152.91 లక్షల ఎకరాలకు రైతులకు యాజమాన్య హక్కులు లభించాయి. యాసంగిలో 62.99 లక్షల మంది రైతులకు రూ. 7,411.52 కోట్లు పంపిణీ చేశారు. కోటీ 48 లక్షల 23 వేల ఎకరాలకు పెట్టుబడి సాయం అందించారు. రాబోయే వానాకాలం సీజన్లో పట్టాదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఈసారికీ 8 వేల కోట్లు అసవరం కానున్నాయి. రైతులకు ఇచ్చేందుకు ప్రభుత్వం దగ్గర పైసా లేదు..
ఇతర పథకాలు గుదిబండలేనా…!
సొంత స్థలం ఉన్న వాళ్లకు ఇళ్ళు కట్టుకోవడానికి మూడు లక్షల ఆర్థిక సహాయం చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం 12 వేల కోట్లు కేటాయించింది. కానీ ఇప్పటివరకు అర్హులను గుర్తించడానికి ఎలాంటి మార్గదర్శకాలు విడుదల కాలేదు. ఇక కొత్తగా ఆసరా పెన్షన్ల కోసం 14లక్షల మంది ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఏప్రిల్ నుండి కొత్త పెన్షన్లను అమలు చేస్తామని అసెంబ్లీ లో సీఎం ప్రకటన చేశారు. దానిపై కూడా ఏలాంటి నిర్ణయం తీసుకోలేదు.. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కోసం మరో ఐదు వందల కోట్లు అవసరం కాగా వాటి ఊసే లేదు.. ఇలా అనేక పథకాలకు సంబంధించి ప్రభుత్వనికి జూన్ టెన్షన్ పట్టుకుంది.