ఆంధ్రప్రదేశ్ కుల రాజకీయాల్లో మరో చీకటి రోజు. జిల్లాకు పేరు మార్చవద్దంటూ ఆందోళనలు చినికి చినికి గాలివానలా మారి చివరికి ఇళ్లు తగలబెట్టే పరిస్థితికి వెళ్లింది. నేరుగా మంత్రి.. అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లను బుగ్గి చేయడం అంటే.. చిన్న విషయం కాదు. ప్లాన్డ్గా అసలు చేయలేరు. గూడుకట్టుకున్న అసంతృప్తి చాన్స్ వచ్చినప్పుడు బయటపడినట్లుగా పడింది. అందుకే ఇంత విధ్వంసం చోటు చేసుకుంది. టీడీపీ హయాంలో తునిలో ఇలాంటి విధ్వంసం జరిగింది. ఈ ప్రభుత్వంలో అమలాపురం అలాంటి వాటికి వేదికైంది. రెండింటికి కులం లింక్ ఉండటమే ఇక్కడ రాజకీయం !
తునిలో ఏం జరిగింది ?
కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత కాపు రిజర్వేషన్ల పోరాట సమితి పేరుతో ముద్రగడ పద్మనాభం ఉద్యమం ప్రారంభించారు. కొన్ని కార్యక్రమాల తర్వాత తుని సమీపంలోని ఓ తోటలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం తర్వాత కొంత మంది ఆందోళన కారులు రెచ్చిపోయారు. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను, పోలీస్ స్టేషన్‌ను, 25 ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలను తగలబెట్టారు. తుని విధ్వంసంలో మొత్తం రు. 130 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు పోలీసులు ప్రకటించారు. నిజానికి ఎలాంటి కవ్వింపు చర్యలు లేవు. ఎవరూ అడ్డగించలేదు. ఉద్దేశపూర్వకంగా ఆ విధ్వంసం జరిగింది. ఇదంతా రాజకీయ కుట్రలోనే జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో దాడులకు పాల్పడ్డవారిపై వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసులు ఎత్తి వేసింది.
అమలాపురంలో జరిగిందీ అలాంటిదే !
జిల్లాకు పేరు పెట్టాలని గతంలో ఉద్యమం జరిగింది. ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ హఠాత్తుగా పేరు మారుస్తూ జీవో జారీ చేసింది. వ్యవస్థీకృతంగా దాడులు జరిగాయి. ముందుగా కలెక్టరేట్ పై.. ఆ తర్వాత మంత్రులు.. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు జరిగాయి. ఇంత జరుగుతున్న విషయాన్ని పోలీసులు కనీసం గుర్తించలేకపోయారు. దాడులు తుని తరహాలోనే జరిగాయి. మొదట నిరసనలు.. తర్వాత ఒక్క సారిగా మూక విరుచుకుపడటం.. తర్వాత విధ్వంసం.. పోలీసులపై దాడులు అన్నీ జరిగాయి. పోలీస్ స్టేషన్‌పై కూడా దాడి జరిగేతే… కానీ పోలీసులు అప్పటికే అప్రమత్తం అయ్యారు. ఎస్పీనే గాయపడి పారిపోయారన్న ప్రచారం జరగడంతో విధ్వంసకారులు రెచ్చిపోయారు. పోలీసులు చేతులెత్తేశారు. ఇంటలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. మొత్తంగా తుని తరహాలోనే .. అమలాపురం ఘటన చోటుచేసుకుంది. కానీ ప్రభుత్వాలే వేర్వేరు.
కుల రాజకీయాల్లో భాగమేనా ?
ఆంధ్రప్రదేశ్‌లో కులమే రాజకీయం. రాజకీయమే కులం. ప్రధాన పార్టీలన్నీ కుల సమీకరణల్లో మునిగి తేలుతూంటాయి. ఈ క్రమంలో జరిగిన పోరులోనే తుని, అమలాపురం ఘటనలు జరిగాయని అంచనా వేస్తున్నారు. తుని ఘటనలో ఓ ప్రధాన వర్గాన్ని అధికార పార్టీకి దూరం చేయడానికి అప్పటి ప్రతిపక్షం ప్రయత్నం చేసిందన్న ప్రచారం జరిగింది. అయితే నిందితులు అందరూ వైసీపీకి చెందిన వారేనని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఫోటోలతో సహా వివరాలు పెడుతున్నారు.
మొత్తంగా అమలాపురం దాడుల విషయంలో… తెర వెనుక ఉన్నది కులమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ కులానికి రాజకీయం తోడు అయింది. అగ్నికి వాయువు తోడయినట్లుగా పరిస్థితి మారింది. ఇది.. ఏపీ రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తాయి.. ఏపీ ప్రజల మధ్యఎలా చిచ్చు పెడతాయన్నది వేచి చూడాల్సిందే !