ఇక చాలు బాబూ.. ఇదేం ఖర్మ!

By KTV Telugu On 2 January, 2023
image

చంద్రబాబు సభల్లో పలువురు ప్రాణాలు కోల్పోయిన విషాదంపై అధికార వైసీపీ టీడీపీ అధినేతను టార్గెట్ చేస్తుంది. ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. అధికారంలో ఉండగా గుర్తురాని పేదలు ఎన్నికల ముందు మాత్రమే గుర్తొస్తారా? మీ ప్రచార ఆర్భాటాల కోసం కానుకల పేరుతో ఇంకా ఎంతమందిని బలితీసుకుంటారు అంటూ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. ప్ర‌జ‌ల‌ ప్రాణాలంటే విలువలేని బాబుకు జనంలో తిరిగే హక్కు లేదని అంటున్నారు. అయితే మొన్న కందుకూరులో ప్రాణాలు కోల్పోయిన వారిని చంద్రబాబు యజ్ఞంలో సమిదలయ్యారని చెప్పడాన్ని వైసీపీ తీవ్రంగా తప్పుబట్టింది. నీ అధికార దాహం కోసం ప్రజలను బలిగొని యజ్ఞంలో సమిధలన్నావ్. మరి గుంటూరులో ప్రాణాలు కోల్పోయిన వారిని ఏమంటావు? నీకు అధికారం కట్టబెట్టడానికి అమాయక ప్రజలు ప్రాణత్యాగం చేయాలా? అంటూ బాబుపై నిప్పులు చెరుగుతున్నారు.

కందుకూరులో ఎనిమిది మంది చనిపోయిన తర్వాత ప్రజల భవిష్యత్తు కోసం తాను పర్యటించక తప్పట్లేదంటూ మళ్లీ సభలతో ముందుకెళ్తున్నారు బాబు. ఆ తర్వాత కొవ్వూరు లాంటి కొన్ని చోట్ల జాగ్రత్తలు తీసుకొని ముందుకు సాగారు. కానీ గుంటూరుకు వచ్చే సరికి మరో విషాదాన్ని నింపారు. సంక్రాంతి పండుగ కోసం చంద్రన్న కానుకల పేరుతో పెద్ద ఎత్తున జనాన్ని క్రోడీకరించారు. 30వేల మందికి కానుకలంటూ ఊదరగొట్టారు. దాంతో జనం పోటెత్తారు. బాబు సభ జరిగేవరకు కంట్రోల్‌లోనే ఉంది. ఆ తర్వాత టీడీపీ నేతలు నిర్వాహకులు చేతులెత్తేశారు. దాంతో తొక్కిసలాట జరిగి ఘోరం జరిగిపోయింది. ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. నిర్వహణ సరిగా చేతకానప్పుడు సభలు నిర్వహించడం దేనికి? అమాయకుల ప్రాణాలు తీయడం ఎందుకు? అంటూ వైసీపీతో పాటు కామన్ పీపుల్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాబు పబ్లిసిటీ పిచ్చి కోసం నాలుగురోజుల వ్యవధిలో రెండు చోట్ల 11 మంది అమాయకులు బలయ్యారంటూ టీడీపీ అధినేతను నరరూప రాక్షసుడితో పోల్చుతూ వైసీపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతోంది. గతంలో పుష్కరాల్లో జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ బాబు ప్రచార యావ కోసం మూడు సందర్భాల్లో 40 నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని గుర్తు చేస్తున్నారు.

ఇక చంద్రబాబు సభల్లో ప్రజల ప్రాణాలు పోతుంటే పవన్ ఎక్కడున్నారు. ప్రశ్నించరేం అని ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తున్న వేళ జనసేనాని కీలక ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు గుంటూరు సభలో చోటు చేసుకున్న తొక్కిసలాట పట్ల పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వహించిన ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట చోటు చేసుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కందుకూరు ఘటన మరువకముందే గుంటూరులో తొక్కిసలాట చేసుకొని ముగ్గురు పేద మహిళలు మృత్యువాత పడటం ఆందోళనకు గురిచేసిందని పవన్ అన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసిప్పుడు నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగం తగిన భద్రత చర్యలను చేపట్టాలని సూచించారు. అయితే ఎక్కడా చంద్రబాబు పేరెత్తకపోవడంతో వైసీపీ ఫాలోవర్స్ పవన్‌ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. జగన్‌ను ప్రశ్నించడానికే జనసేన ఉందని బాబు పట్ల పవన్ ప్రభు భక్తి చాటుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.