చంద్రబాబు టైం బాలేదు.. దెబ్బ మీద దెబ్బ!

By KTV Telugu On 2 January, 2023
image

నారామేథం.. సాక్షి టీవీ పెట్టిన టైటిల్‌ ఇది. అంటే నరమేథం అన్నమాట. వైసీపీ మీడియాకే కాదు సామాన్యుడికి కూడా తప్పు టీడీపీదేనని అనిపిస్తోంది. కందుకూరు దుర్ఘటన తర్వాత కూడా జాగ్రత్తపడకపోవడం టీడీపీ స్వయంకృతమేని చెప్పాలి. 30మంది పోలీసులనే ఇచ్చారు, 40మందినే ఇచ్చారన్న వాదన తేలిపోతోంది. ఓ పార్టీ చేపట్టిన కానుకల పంపిణీ కార్యక్రమానికి పోలీసు పటాలాన్నంతా దించడం సాధ్యంకాదు. ఉచిత కానుకలకోసం ఎగబడతారని ముందు అందుకునేందుకు ఆరాటపడతారని మోకాలిలో గుజ్జున్నవాడికి కూడా తెలిసుంటుంది. దానికి తగ్గట్లు కౌంటర్లు బ్యారికేడ్లు పెట్టి ఓ క్రమపద్దతిలో కార్యక్రమాన్ని నిర్వహించి ఉంటే గుంటూరులో మూడు ప్రాణాలు పోయేవి కావు.
చంద్రబాబుని దురదృష్టం వెంటాడుతున్నట్లుంది. ఆయన అడుగుబయటపెడితే ఏమవుతుందోనని ఆందోళనపడాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది. టీడీపీ సభల్లో ఏ అపశృతి జరిగినా ఆయన పాలనలో పుష్కరాల విషాదం అందరికీ గుర్తుకొస్తోంది. బోయపాటి శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో ఆ రోజు జరిగిన షూటింగ్‌ వ్యవహారం 29మంది ప్రాణాలు తీసిందన్న అపనింద ఇప్పటికీ చంద్రబాబుని వెంటాడుతూనే ఉంది. చంద్రబాబు పాలనలో వర్షాలు పడలేదని వైసీపీ దెప్పిపొడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు వరస ఘటనలతో ఆయనది ఐరన్‌లెగ్‌ అనీ ఎక్కడ అడుగుపెడితే అక్కడ అనర్ధమేనని ఫ్యాన్‌పార్టీ ప్రచారం చేసే అవకాశం దొరికింది. ఇప్పుడే ఇలా ఉంటే పొరపాటున అధికారంలోకొస్తే రాష్ట్రం సర్వనాశనమేనని ఇంకాస్త మసాలా దట్టించడానికి వైసీపీ నేతలు సిద్ధంగా ఉంటారు.

సంక్రాంతి పండుగ దగ్గరపడుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రన్న కానుకల పేరుతో చీరల పంపిణీకి టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం పెట్టుకున్న ప్రోగ్రాంలో ఈ విషాదం జరిగింది. ముఖ్య అతిధిగా హాజరైన చంద్రబాబు ప్రసంగించి వెళ్లిపోగానే కానుకలు పంపిణీ చేపట్టటంతో తోపులాట జరిగింది. పదిరోజులుగా ఈ ప్రోగ్రాం గురించి టీడీపీ నేతలు ఊదరగొట్టారు. దీంతో భారీ ఎత్తున మహిళలు అక్కడికి వచ్చారు. చీకటిపడటంతో కొందరికి ఇచ్చి మిగిలినవారికి టోకెన్లు ఇవ్వటంతో తొక్కిసలాట జరిగిందని చెబుతున్నారు. ఇది నిర్వహణాలోపమే. పార్టీ టికెట్‌ రేసులో ఉన్న ఉయ్యూరు శ్రీనివాస్‌ ఈ కార్యక్రమం పెట్టారు. ఇప్పుడాయన పోలీసులు పెట్టిన కేసులో ఏ1 అయ్యారు. ఆయనతో పాటు ఉయ్యూరు ఫౌండేషన్‌ నిర్వాహకుడిపైనా కేసు నమోదైంది. మహిళల మెప్పు పొందాలనుకుంటే చివరికి వారితో తిట్లు తినాల్సి వస్తోంది. ఇదేం ఖర్మో!