ఆయనగారేమో రాబోయే కాలానికి కాబోయే సీఎం నేనేనంటున్నారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ కొత్తరాగం ఎత్తుకున్నారు. కాపులను దువ్వే పనిలో ఉన్నారు. ఆర్మీ ట్రక్కులాంటి వారాహితో ప్రచార దండయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ రేంజ్ బిల్డప్ చూసి నేతలు అర్జంటుగా పార్టీలోకొచ్చేయాలి. ఎప్పట్నించో టచ్‌లో ఉన్నవాళ్లు మరింత యాక్టివ్ కావాలి. కానీ గ్లాసుపార్టీలో రివర్స్ సీన్చూసి పవర్‌స్టార్‌కి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ప్రశ్నించే నాయకుడు ఎందుకిలా జరుగుతోందని తనను తాను ప్రశ్నించుకోవాల్సి వస్తోంది.
జనసేన పార్టీలో మొదట్నించీ కీలకంగా ఉన్న నాయకుడు సడెన్‌గా కేసీఆర్ పార్టీలో చేరిపోయారు. మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ హైదరాబాద్‌లో గులాబీకండువా కప్పుకున్నారు. ఇకనుంచి ఆయన బీఆర్ఎస్ లీడర్. జనసేనకు అన్నివిధాలా అండగా ఉంటూ వచ్చారు తోట చంద్రశేఖర్. రెండుసార్లు ఎంపీగా ఒకసారి ఎమ్మెల్యేగా పోటీచేసినా అదృష్టం కలిసిరాని చంద్రశేఖర్ రాజకీయ భవిష్యత్‌కోసం జనసేన కంటే బీఆర్ఎస్ బెటరనుకున్నారు. పవన్‌కళ్యాణ్ పార్టీకోసం 99టీవీని కొని నష్టాలతో కొన్నాళ్లు మెయింటెన్ చేసిన తోట చంద్రశేఖర్ జనసేనను వీడటం పవన్‌కళ్యాణ్‌కి ఇబ్బందికరమేనని చెప్పొచ్చు.
పవన్కళ్యాణ్లాంటి చరిష్మా ఉన్న హీరో పాలిటిక్స్‌లో ఎప్పటికైనా హిట్ కొడతారని తోట చంద్రశేఖర్ ఆశపడ్డారు. ఆ ఆశతోనే పార్టీకోసం కష్టపడ్డారు. ఎంతో ఖర్చుపెట్టారు. కానీ జనసైనికులంతా సీఎం సీఎం అని పవన్‌కళ్యాణ్‌ని ఆకాశానికి ఎత్తేస్తున్న సమయంలో చంద్రశేఖర్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో రెండుచోట్ల పోటీచేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ కంటే ఇప్పుడే రెక్కలు విప్పుకుంటున్న బీఆర్ఎస్ బెస్ట్ అని అనుకున్నారు. అందుకే గులాబీ కండువా కప్పుకున్నారు. ఆయనకు అనిపించినట్లుంది.అందుకే బిఆర్ఎస్ తీర్థం తీసుకున్నారు. తోట చంద్రశేఖర్ బాటలో ఇంకొందరు వెళ్తే జనసేనకు పెద్ద దెబ్బే. చంద్రశేఖర్‌తో పాటు బీఆర్ఎస్లో చేరిన మిగిలిన ఇద్దరు నేతలు కూడా గతంలో జనసేనతో సంబంధాలున్నవాళ్లే. రావెల కిషోర్‌బాబు, పార్థసారథిలతో పాటు బీఆర్ఎస్లో చేరిన మరికొందరిలో ఎక్కువమంది కాపునేతలే. కాపులంతా కన్సాలిడేట్ అవుతారనుకున్న సమయంలో ఈ పరిణామం పవన్‌కళ్యాణ్‌కి ఊహించని దెబ్బేనంటున్నారు.