తెలంగాణలో రాజకీయ హడావుడి ఎక్కువగా ఉందని అనుకుంటున్నారు కానీ ఏపీలో పరిస్థితులు చూస్తే మాత్రం ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది ఎన్నికల ప్రచారంలో ఉన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబునాయుడు జిల్లాల పర్యటనలు ప్రారంభించారు. జగన్ తమ పాలనలో ఎలాంటి చార్జీలు పెంచకపోయినా చేసిన బాదుడే బాదుడు అనే ట్రేడ్ మార్క్ విమర్శనే టైటిల్‌గా పెట్టుకుని చంద్రబాబు యాత్ర చేస్తున్నారు. ఆర్గనైజ్ చేస్తున్నారో.. నిజంగానే అంత భారీగా తరలి వస్తున్నారో కానీ.. చంద్రబాబు పర్యటనకు స్పందన అనూహ్యంగా ఉంది. ఇక పోటీగా వైసీపీ కూడా యాత్రలు ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ముందుగా మంత్రుల్నిరంగంలోకి దించుతున్నారు.
చంద్రబాబు యాత్రలతో వైసీపీలో కలవరం !
బాదుడే బాదుడు పేరుతో మొదట ఉత్తరాంధ్రలో పర్యటించిన చంద్రబాబునాయుడికి అక్కడ వచ్చిన స్పందన రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయింది. ఎంత పార్టీ నేతలు ఎంగేజ్ చేసినా… ఎవరైనా టీడీపీ నేతల కార్యక్రమాల్లో పాల్గొంటే పథకాలు ఉండవని.. కేసులు పెడతారని భయం ఉన్నా భారీ స్థాయిలో జనసమీకరణ చేయగలగడం ఆ పార్టీ సాధించిన విజయం అని చెప్పుకోవచ్చు. అంతే కాదు విశాఖ గడ్డ మీదే అమరావతి రాజధాని అని క్లారిటీ ఇచ్చేశారు. ప్రజామోదం తీసుకునే ప్రయత్నం చేశారు. దీనిపై ఎక్కడా వ్యతిరేకత రాలేదు. ఇది కూడా చంద్రబాబుకు ప్లస్ పాయింట్ అవుతోంది. రాయలసీమలో వైసీపీ ఎంతో బలంగా ఉందని ఇప్పటికీ అనుకుంటూ ఉంటారు. కానీ ఆయన కడపలో అడుగు పెట్టగానే మాస్ హిస్టీరియా కనిపించింది. సీఎంగా ఉన్నప్పుడు కూడా అలాంటి జన స్పందన కనిపించలేదు. కడపలో ఆదినారాయణరెడ్డి, సీఎం రమేష్ వంటి వారు బీజేపీలో చేరిపోయినా తేడా కనిపించకపోగా మరింత ప్లస్ అయినట్లుగా మారింది. కడపలో చంద్రబాబు టూర్‌కు వచ్చిన జనం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత చాలా స్పష్టంగా కనిపిస్తోందన్న అభిప్రాయం అంతకంతకూ బలపడుతోంది. ఇది సహజంగానే వైసీపీలో కలకలకానికి కారణం అవుతోంది.
మంత్రుల్ని యాత్రలకు పంపుతున్న వైసీపీ హైకమాండ్ !
మంత్రులందరూ గడపగడపకూ వెళ్లాల్సిందేనని మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్ తన సహచరులను ఆదేశించి మూడు, నాలుగు రోజులు కాలేదు. అప్పుడే మంత్రులందరూ గడప గడపకూ వెళ్లకుండా కొత్త యాత్రకు ప్లాన్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులందరూ బస్సు యాత్ర చేపట్టాలని వైసీపీ హైకమాండ్ నిర్ణయించింది. ఈ మేరకు రూట్ మ్యాప్ ఖరారు చేసుకున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి 29 వరకు బస్సు యాత్ర చేపట్టనున్నారు. శ్రీకాకుళం, రాజమండ్రి, నరసరావుపేట, అనంతపురం పట్టణాల్లో బహిరంగ సభలు నిర్వహించేలా రోడ్ మ్యాప్‌ను ఖరారు చేశారు. 26న శ్రీకాకుళం లేదా విజయనగరంలో బహిరంగసభ, 27న రాజమండ్రి, 28న నరసరావుపేటలో బహిరంగసభ, రాత్రికి నంద్యాలలో బస, 29న అనంతపురంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. యాత్ర కోసం ప్రత్యేకంగా 2 బస్సులను సిద్ధం చేశారు. విశాఖపట్నం నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్ర అనంతపురంలో ముగియనుంది. రాష్ట్రంలోని ముఖ్యమైన పట్టణాలు, నియోజకవర్గాలు, మండల కేంద్రాల మీదుగా బస్సు యాత్ర సాగనుంది. బిసి, ఎస్సి, ఎస్టి, మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఈ యాత్ర ద్వారా మంత్రులు ప్రజలకు వివరించనున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రతి ఇంటికీ వెళ్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు ఈ బస్సు యాత్ర ఉపయోగపడు తుందని అధికార పార్టీ అంచనా వేస్తోంది.
అసలు పాలనపై కాకుండా సామాజిక న్యాయం పేరుతో వైసీపీ హాడావుడి !
ఓ కార్యక్రమం నిర్వహిస్తూండాగనే… దానికి బ్రేక్ వేస్తూ మరో కార్యక్రమం నిర్వహించాలనుకోవడంపై వైసీపీలోనే విస్మయం వ్యక్తమవుతోంది. గడప గడపకూ వెళ్తే్ నిరసనలు వ్యక్తమవుతున్నాయన్న ఉద్దేశంతో ఇప్పుడు యాత్ర పేరుతో ప్రచారం చేసుకుంటే బెటరని ఆలోచిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. తమ పాలన కన్నా… కులాలకు పదవులు ఇచ్చామని చెప్పుకోవడానికే వైసీపీ ప్రాధాన్యం ఇస్తోంది. ఇలా చేయడం వల్ల ఎంత వరకూ ప్రయోజన ఉంటుందో కానీ ప్రస్తుతం ఏపీలో చర్చ మాత్రం సామాజిక న్యాయం అనే అంశంపై లేదు. పైగా సీఎం జగన్ ప్రాధాన్యత పదవుల్ని రెడ్లకు మాత్రమే ఇస్తూ.. పనులు.. విధుల్లేని పదవులు ఇతర వర్గాలకు ఇస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో అందులోన ఏపీ వారికి కాకుండా తెలంగాణ వారికి పెద్ద పీట వేస్తున్నారు. తమకు పదవులు ఇస్తున్నారని తెలంగాణ వాళ్లు జగన్‌ను పొగుడుతున్నారు కానీ.. ఏపీ ప్రజలు మాత్రం ఏదో తేడాగా ఉందే అన్నట్లుగా చూస్తున్నారు. అందుకే.. తమ పాలనలో సామాజిక న్యాయం అంటూ ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి కొనసాగింపుగా సీఎం జగన్ అసెంబ్లీ టిక్కెట్లను కూడా సగం బీసీలకు కేటాయిస్తారన్న ప్రచారం ప్రారంభమయింది.
ఏపీలో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చా ?
అటు టీడీపీ.. ఇటు వైసీపీ హడావుడి చూస్తూంటే ఏపీలో ముందస్తు ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. అన్నింటికీ ప్రిపేరైపోతున్న వైసీపీ … వ్యవహారశైలి చూసి ఇతర పార్టీల నేతలు కూడా రెడీ అయిపోతున్నారు. ఈ విషయంలో నిర్ణయాధికారం వైసీపీది కాబట్టే బలంగా ముందస్తు నమ్మకం ఏర్పడుతోంది. వైసీపీ ఇదే తరహాలో ముందుకు వెళ్తే రాజకీయంగా ఏపీలో తిరుగులేని మార్పులు కనిపించే అవకాశం ఉంది.