బీఆర్ఎస్ లక్ష్యమేంటి? అసలు కేసీఆర్ వ్యూహమేంటో ఎవరికీ అర్థం కావడం లేదు. దేశమంతా పార్టీని విస్తరించే పనిలో ఉన్న కేసీఆర్ పక్కనే ఉన్న పొరుగు రాష్ట్రమైన ఏపీలో కొత్త ఏడాది రోజు సరికొత్త రాజకీయం షురూ చేశారు. ఎట్టకేలకు ఆంధ్రా నుంచి కొందరిని చేర్చుకొని వారిలో ఒకరికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. మాజీ ఐఏఎస్ జనసేన నేత తోట చంద్రశేఖర్‌కు ఏపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఇక మాజీ మంత్రి రావెలతో పాటు మరికొందరికి కండువా కప్పారు. బీఆర్ఎస్ విస్తరణ కోసం చేస్తున్న ప్రయత్నాల్లో తొలి అడుగు పడిందని గులాబీ శ్రేణులు సంబరపడిపోతున్నారు. కానీ తొలి అడుగులోనే తడబడినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఏపీలో కేసీఆర్ కు భారీ స్దాయిలో అభిమానులు ఉన్నారని చెప్పుకునే బీఆర్ఎస్ నేతలు వరుసగా మూడుసార్లు ఓటమిపాలైన వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పగించారు. ఇంతకు మించి బీఆర్ఎస్ ఏపీలో చేయడానికి ఏమీ లేదనే సంకేతాలు కనిపించాయి.
కొత్త పార్టీలో ఎంత బలమైన నేతలు చేరితే పార్టీకి అంత మైలేజ్ పెరుగుతుంది. దేశవ్యాప్తంగా సత్తా చాటాలంటే కీలక నేతల్ని, సీనియర్లను ఎంచుకుని వారికి పగ్గాలు అప్పగించాల్సి ఉంది. కానీ కేసీఆర్ మాత్రం ఏపీలో ప్రస్తుతం నామమాత్రంగా కూడా పేరు వినిపించని నేతల్ని బీఆర్ఎస్ లో చేర్చుకుని మమా అనిపించేశారు. తోట చంద్రశేఖర్‌తో పాటు చేరిన నేతలను బట్టి చూస్తే ఏపీలో బీఆర్ఎస్ ఎంత బలోపేతం అవుతుందనేది ఇట్టే తెలిసిపోతుంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాం కాబట్టి ఎవరో ఒకరిని ఏపీకి అధ్యక్షుడిని చేసి అక్కడ పార్టీ ఉందని చెప్పుకునే ప్రయత్నం చేసినట్టుగా కనిపించింది. చేరికల సందర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఏపీలోని సిట్టింగ్లతో పాటు మహామహులైన నేతలంతా బీఆర్ఎస్ లో చేరబోతున్నరాని చెప్పారు. ఏపీలో బలమైన వైసీపీని కాదని సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును కాదని తోట చంద్రశేఖర్‌ను నమ్ముకొని ఏపీలో చేరికలుంటాయంటే అది హాస్యాస్పదమే.
పోటీ చేసిన ప్రతీ సారి ఓటమిపాలైన చంద్రశేఖర్ రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర్నుంచి పలు పార్టీలు మారుతూ వచ్చారు. ఇదిగో ఇప్పుడు ఏపీ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన కాపు సామాజికవర్గానికి చెందిన నేతే కావొచ్చు. ఆర్థికంగా పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉండొచ్చు. కానీ, రాజకీయంగా మాత్రం ఆయన పెద్దగా ప్రభావం చూపించే వ్యక్తి కాదు. ఏవిధంగా చూసుకున్నా ఆయన సారథ్యంలో బీఆర్ఎస్ ముందడుగు పడడం కష్టమేననేది కేసీఆర్‌కు కూడా తెలుసు. ప్రస్తుతానికి ఎవరో ఒకరితో నడిపించాలి కాబట్టి కేసీఆర్ ఆ విధమైన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిన కేసీఆర్ ఆయా రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. తొలుత ఢిల్లీ రాజధానితో మొదలుపెట్టి ఆ తర్వాత రాష్ట్రాలపై దృష్టిసారించారు. ప్రస్తుతం ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన గులాబీ నేతలు త్వరలోనే అక్కడ పర్యటించబోతున్నారు.
అసలు బీఆర్ఎస్ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ఎవరికీ తెలియదు. బీజేపీకి వ్యతిరేకంగా దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే విషయంలో కేసీఆర్ కొన్ని పాయింట్స్ రెయిజ్ చేస్తున్నారు. కానీ రాజకీయంగా మాత్రం పార్టీ పునాదులు ఎలా నిర్మిస్తారు, అందుకోసం ఆయనతో ఎంతమంది కలిసొస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. తెలంగాణ మంత్రుల ప్రకటనలు మినహాయిస్తే ఏపీలో ఇప్పటివరకు ఆ పార్టీ వైపు చూసిన బడా నేతలే లేరు. వాస్తవానికి ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సహా చాలా మంది నేతల కోసం కేసీఆర్ ప్రయత్నించారు. వీరితోపాటు టీడీపీ కాంగ్రెస్‌కు చెందిన పలువురు మాజీలు సీనియర్లు మాజీ మంత్రులు ఇలా ఎంతో మందిని ట్రై చేశారు. కానీ ఎవరూ బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపలేదు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో కేసీఆర్ తోట చంద్రశేఖర్‌ను ఏపీ అధ్యక్షుడిగా నియమించారనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటివరకు తెలియని వారికి కూడా కేసీఆర్ పుణ్యమాని తోట హైలెట్ అయ్యారు తప్పితే ఆయనతో బీఆర్ఎస్కు ఒరిగేదేమీ లేదనేది ప్రతీ ఒక్కరూ చెబుతున్న మాట.
ఏపీలో ప్రస్తుతం అన్ని పార్టీలు బీజేపీ జపం చేస్తున్నాయి. వైసీపీ టీడీపీ జనసేన వంటి పార్టీలన్నీ ఎవరికి వారు వాదులాడుకుంటున్నా కమలనాథులపై ప్రేమ చూపుతున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లే కేసీఆర్ వైపు ఎవరూ అడుగులు వేయడం లేదు. అదే సమయంలో కేసీఆర్ గత తెలంగాణ వాద నేపథ్యం భవిష్యత్తులో బీఆర్ఎస్ పై ప్రభావం చూపితే తమకు డిపాజిట్లు కూడా దక్కవన్న భయం ఇక్కడి నేతల్లో ఉంది. దీంతో ద్వితీయ శ్రేణి నేతలు మినహా బీఆర్ఎస్ వైపు వెళ్లేందుకు ఎవరూ సాహసించడం లేదని తెలుస్తోంది. ఎన్నికల నాటికి టికెట్లు రాని నేతలు క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న వారు ఎవరైనా బీఆర్ఎస్ వైపు చూడొచ్చేమో గానీ ఇప్పట్లో అటువైపు వెళ్లే సూచనలు కనిపించడం లేదు.