వివాదాల మల్లన్న ప్రభుత్వానికి భారమా..వరమా! మంత్రిగా ఎన్ని మార్కులు?

By KTV Telugu On 3 January, 2023
image

తెలంగాణలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఎన్నికల ఏడాదిలోకి వచ్చేసింది. ఏడాది చివరిలో జరుగుతాయా మధ్యలో జరుగుతాయా అన్న సంగతి పక్కన పెడితే ఈ ఏడాది ఎన్నికలు జరగడం ఖాయం. అందుకే ఇప్పుడు రెండో విడతలో తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై అందరూ సమీక్ష చేయడం ప్రారంభించారు. ప్రభుత్వం అంటే ఒక్క ముఖ్యమంత్రి మాత్రమే కాదు మంత్రులందరూ కలిపి ప్రభుత్వం. వారు కూడా తమ పనితీరుతో ప్రభుత్వానికి పేరు తెచ్చేలా మంచి పనులు చేసి ఉండాలి. లేకపోతే అది మంత్రులకు వ్యక్తిగతంగా నష్టం చేకూర్చడం మాత్రమే కాదు పార్టీకి డ్యామేజ్ చేస్తుంది. మరి ప్రస్తుతం ఉన్న తెలంగాణ మంత్రుల్లో చామకూర మల్లారెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి ఎంత మేర ప్రజల్లో పలుకుబడి తెచ్చిపెట్టారు. ప్రజలకు ఎంత మేర సేవ చేశారు.. అసలు మేలు చేశారా.. కీడు చేశారా.

చామకూర మల్లారెడ్డి ఈ పేరు వినగానే ముందుగానే ఏం గుర్తుకొస్తుంది. ఠక్కన గుర్తు చేసుకుంటే కనీసం ఆయన శాఖ కూడా గుర్తు రాలేదు. తెలంగాణ రాజకీయాలను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్లకు కూడా ఆయన నిర్వహిస్తున్న శాఖ ఏమిటో ఠక్కున చెప్పడం సాధ్యం కాదు. కార్మిక ఉపాధి శిక్షణ వంటి శాఖలు ఆయన నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి మంత్రి అంటే గుర్తు పడతారు కానీ ఆయన శాఖలకు మంత్రి అని గుర్తు చేసుకునేలా పని చేయలేదని దీని ద్వారా అర్థం అయిపోతుంది. అంటే మంత్రిగా ఆయన పదవిని మాత్రమే అనుభవిస్తున్నారు. బాధ్యతలను పూర్తిగా దూరం పెట్టారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలంగాణ రెండో మంత్రి వర్గంలో మల్లారెడ్డి చోటు దక్కించుకున్నారు. రెడ్డి వర్గానికి తెలంగాణ సీఎం కేసీఆర్ అమిత ప్రాధాన్యం ఇచ్చారు. కేబినెట్‌లో ఆరుగురికి చోటిచ్చారు. వారిలో మల్లారెడ్డి ఒకరు. కానీ ఆయన వల్ల కానీ ఆయనకు ఇచ్చిన శాఖ వల్ల కానీ ప్రభుత్వానికి వచ్చిన మేలు ఏం లేదని చెప్పవచ్చు.

గత నాలుగేళ్ల కాలంలో కార్మిక ఉపాధి శిక్షణ వంటి విషయాల్లో బెంచ్ మార్క్ అనదగ్గ విజయాన్ని మల్లారెడ్డి చూపించలేకపోయారు. తన శాఖలపై పట్టు సాధించారా అంటే అదీ లేదు. సొంతంగా సమీక్ష నిర్వహించగలిగే శక్తి సామర్థ్యాలు కూడా లేవు. వాస్తవానికి ఆయన బ్యాక్ గ్రౌండ్ చూస్తే పెద్ద ఎత్తున మెడికల్ ఇంజినీరింగ్ కాలేజీలు నిర్వహిస్తున్న విద్యావేత్త. కానీ అది వ్యాపారంగానే చేశారు కానీ ఆయన ఆ విద్య నుంచి నేర్చుకున్నదేమీ లేదు. అందుకే మంత్రిగా ప్రభుత్వానికి పనికి వచ్చే పనులు ప్రజలకు ఉపయోగపడే వ్యవహారాలు చివరికి తన శాఖతో సంబంధం ఉన్న కార్మికులకు మేలు చేసే కొత్త ఆలోచనలు ఏమీ చేయలేదు.

అయితే రాజకీయాల్లో మంత్రుల పనితీరు అంటే కేవలం తనకు లభించిన శాఖలో అద్భుతంగా పని చేయడం మాత్రమే కాదు తన పార్టీకి చేసిన సేవలు కూడా కీలకమే. మంత్రి పదవి లభించినందుకు పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలి. ఈ విషయాల్లో మల్లారెడ్డి తనకు ఉన్న ఆర్థిక బలంతో మిశ్రమ ఫలితాలు సాధించారని అనుకోవచ్చు. బహుశా ప్రస్తుత రాజకీయాల్లో ఇతర లక్షణాల కన్నా ఆర్థిక బలం ముఖ్యమని మల్లారెడ్డికి ఉన్న ప్లస్ పాయింట్ అదేనని కేసీఆర్ అనుకున్నారేమో కానీ ఆయనకు మాత్రం పై స్థాయి నుంచి మంచి మద్దతు లభిస్తోంది. అయితే మద్దతుతో మల్లారెడ్డి పార్టీకైనా మేలు చేశారా అంటే అప్పుడప్పుడు అని అనుకోవాలి. కానీ ఎక్కువ సార్లు నష్టం చేశారు.

మంత్రిగా పదవి వచ్చినప్పటి నుండి కేసీఆర్ వద్దతనకు ఉన్న పలుకుబడితో మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ నేతలందర్నీ ఇబ్బంది పెట్టారన్న వాదన ఉంది. ఇటీవల ఆయనకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఆయన ఏకపక్ష తీరును పూర్తి స్థాయిలో ఎండగట్టారు. మేడ్చల్ టీఆర్ఎస్‌లో మల్లారెడ్డి ఒక్కరే ఒక వైపు మిగతా అందరూ ఒకవైపు ఉంటారు. అంటే ఏంత ఏకపక్షంగా ఆయన రాజకీయాలు చేశారో అర్థం చేసుకోవచ్చు. పార్టీని ఇలా విడగొట్టడమే కాదు అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోవడానికి నామినేటెడ్ పదవులన్నీ తన వర్గానికే ఇప్పించుకోవడానికి ఆయన పదవిని దుర్వినియోగం చేసారన్న విమర్శలు గుట్టిగానే ఉన్నాయి.

ఇక మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని వ్యాపార ప్రయోజనాలు పొందడమే కాదు పెద్ద ఎత్తున భూకబ్జాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. కోర్టు ఆయనపై కేసు కూడా నమోదు చేయాలని ఆదేశించింది. మేడ్చల్ ప్రాంతంలో జరిగిన అనేక భూదందాలకు ఆయన ప్రత్యక్ష పరోక్ష కారణం అన్న విమర్శలు ఉన్నాయి. పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా బినామీల పేర్లతో చేస్తారన్న విమర్శలు ఉన్నాయి. మేడ్చల్ జిల్లాలో ఏ నియోజకవర్గంలోకి వెళ్లి పది మందితో మల్లారెడ్డి గురించి ప్రస్తావన తీసుకు వస్తే కనీసం ఇద్దరు కూడా ఆయన గురించి పాజిటివ్ గా చెప్పారంటే ఆయన మంత్రి పదవి వల్ల తెచ్చుకున్న మంచి పేరు కంటే చెడ్డపేరే ఎక్కువ అని అర్థం చేసుకోవచ్చు.

అయితే మల్లారెడ్డికి నేరుగా రాజకీయాలు తెలియకపోవడం వల్ల ఆయన ఎక్కువగా బద్నాం అయ్యారని ఆయన అనుచర వర్గాలు చెబుతూ ఉంటాయి. ఆయన ధనవంతుడు కావడం ఆయన వ్యవహారశైలి వల్ల కూడా ఆయనపై నెగెటివ్ ప్రచారం జరుగుతోంది కానీ ఆయన మంత్రిగా అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి మేలు చేసే పనులే చేశారని ఆయన అనుచరులు వాదిస్తూంటారు. ఎవరేముకున్నా ఎన్నికల్లో తేల్చాల్సింది ప్రజలతే. ఇప్పటి వరకూ అయితే మంత్రిగా చామకూర మల్లారెడ్డి ప్రభుత్వానికి వరం కాదు. భారమే అనుకోవచ్చు.