భారత్ – శ్రీలంక టీ20 ఫైట్

By KTV Telugu On 3 January, 2023
image

కొత్త ఏడాదిలో స్వదేశంలో శ్రీలంకతో టీ 20 సిరీస్‌ను ఘనంగా ఆరంభించబోతోంది టీమిండియా. హార్థిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు లంకతో మూడు మ్యాచ్‌ల టీ 20ల సిరీస్ ఆడనుంది. దాంట్లో భాగంగా మరికొన్ని గంటల్లో ముంబైలోని వాంఖడే వేదికగా తొలి ఫైట్ జరగనుంది. ఈ సిరీస్‌కు సీనియర్లు రోహిత్, కోహ్లీ, రాహుల్, భువనేశ్వర్ కుమార్‌లను పక్కనబెట్టిన సెలెక్టర్లు యువఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేశారు. పాండ్యాకు టీ 20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించగా అతనికి డిప్యూటీగా సూర్యకుమార్ యాదవ్‌ను నియమించారు. తర్వాత వన్డే సిరీస్‌కు సీనియర్లు మళ్లీ అందుబాటులోకి రానున్నారు.

గతేడాది జరిగిన తప్పులు మళ్లీ జరగకుండా పకడ్బందీగా ఈసారి ఆటగాళ్లను ఎంపిక చేసింది బీసీసీఐ. వచ్చే వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని వన్డే, టీ 20 సిరీస్‌లకు జట్టు కూర్పు చేసింది. ఆసియా కప్‌లో శ్రీలంక చేతిలో ఓడిన భారత్‌ ఆ తర్వాత మరోసారి ఆ జట్టుతో తలపడనుంది. లంకపై గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. ప్రత్యర్థి జట్టును జడిపించడానికి కొత్తగా చేయాల్సిందేమీ లేదంటున్నాడు కెప్టెన్ పాండ్యా. భారత్‌లో తమను ఢీకొడుతున్నారన్న విషయాన్ని గుర్తుచేసేలా ఆడతామని చెప్పుకొచ్చారు. గత వైఫల్యాలను మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటానన్నారు హార్థిక్.

వైస్‌కెప్టెన్‌గా ప్రమోషన్ అందుకున్న సూర్యకుమార్ యాదవ్ నెట్ ప్రాక్టీస్‌లో చెమటలు చిందించాడు. అన్ని వైపులా షాట్లు బాది నెట్ బౌలర్లకు చుక్కలు చూపించాడు మిస్టర్ 360. ఈ వీడియోను బీసీసీఐ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రీలంకతో జరిగే తొలి టీ20లో మరోసారి సూర్య మెరుపులు ఖాయమని ఎదురుచూస్తున్నామని కామెంట్లు చేస్తున్నారు.