ఈడీ సీబీఐ మౌనం దేనికి సంకేతం. బీఆర్ఎస్ బీజేపీ అవగాహనకు వచ్చాయా లేక తుపాను ముందు ప్రశాంతతా

By KTV Telugu On 3 January, 2023
image

ఇదిగో ఎమ్మెల్యేలకు ఎర కేసు హైకోర్టు సీబీఐకి ఇచ్చేసింది ఇక దబిడి దబిడే అని సోషల్ మీడియా హోరెత్తిపోయింది. ఇక కవిత అరెస్టే తరువాయి అని ఢిల్లీ లిక్కర్ స్కాంలో హ్యాష్ ట్యాగ్‌లు కూడా ట్రెండ్ చేశారు. రోజులు గడిచిపోతున్నాయి కానీ ఈ కేసులో ఎలాంటి అప్ డేట్ ముందుకు రావడం లేదు. హై పొలిటికల్ టెన్షన్ క్రియేట్ చేసిన ఈ కేసుల్లో ఎందుకు హఠాత్తుగా మౌనరాగం వినిపిస్తోంది. రాజకీయాల్లో అంతర్గతంగా సాగిపోయే అండర్ స్టాండింగ్ బీఆర్ఎస్ బీజేపీల మధ్య వచ్చేసిందా లేకపోతే బీజేపీ పంజా విసరడానికి రెండు అడుగులు వెనక్కి వేస్తుందా. తెలంగాణ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది.

ఢిల్లీ లిక్కర్ స్కాం బయటకు వచ్చిన తర్వాత అందరూ ఆమ్ ఆద్మీ పార్టీని టార్గెట్ చేసుకున్నారని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఢిల్లీ బీజేపీ నేతలు కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తెను టార్గెట్ చేసుకున్నారు. తీవ్రమైన ఆరోపణలు ప్రారంభించారు. ఇప్పటికి ఐదు నెలలు గడిచిపోయింది. కానీ కేసు ఇంకా కవితపై ఆరోపణల దగ్గరే ఉంది. ఎఫ్ఐఆర్‌లో ఆమె పేరు లేదు. ఇతరులపై దాఖలు చేసిన చార్జిషీట్లలో మాత్రం కవిత పేరు ప్రస్తావించారు. ఓ సారి సాక్షిగా సీబీఐ విచారించింది. మరోసారి నోటీసు జారీ చేసింది. ఈ నోటీసు జారీ చేసి విచారణ చేస్తామని చెప్పింది కానీ మరోసారి అలాంటి ప్రయత్నమే జరగలేదు. అసలు ఆరు నెలలు సాధన చేసి మూలనున్న ముసలమ్మను కొట్టినట్లుగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ, ఈడీ అధికారులు వ్యవహరిస్తున్నారు. మొదట నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను నిందితుడిగా చూపించారు. కానీ తర్వాత నిందితులపై దాఖలు చేస్తున్న చార్జిషీట్లలో ఆ ప్రస్తావన లేదు. చిత్రవిచిత్రంగా కేసులో చార్జిషీటుల దాఖలు చేస్తూ సీబీఐ, ఈడీ అందర్నీ గందరగోళ పరుస్తోది.

ఎమ్మెల్సీ కవిత మాత్రం ఈ కేసులో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అన్నీ తప్పుడు ఆరోపణలేనంటున్నారు. సీబీఐ కాదు ఈడీ విచారణకు పిలిచినా వెళ్తానంటున్నారు. కవితకు అంత నమ్మకం ఏమిటో కానీ ఈడీ, సీబీఐ మాత్రం ఇప్పటి వరకూ నేరుగా ఆమె పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కానీ చార్జిషీటు దాఖలు చేయడం వంటివి కానీ చేయలేదు. కానీ ఓ నిందితుడి చార్జిషీటులో మాత్రం ఢిల్లి లిక్కర్ పాలసీలో లాభం పొందిన సౌత్ లాబీలో కవిత అసలైన భాగస్వామి అని ఆరోపించారు. అంటే ఈ దిశగా ఈడీ, సీబీఐ వద్ద ఆధారాలు ఉన్నాయని అనుకోవచ్చు. కానీ మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు. ఈ కేసు విషయంలో తెర వెనుక ఏం జరుగుతోంది.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు మాత్రమే కాదు ఎమ్మెల్యేలకు ఎర కేసులోనూ సీబీఐ ఇంకా కదల్లేదు. నిజానికి బీజేపీని టార్గెట్ చేస్తూ తెలంగాణ సర్కార్ పెట్టిన ఈ కేసు సీబీఐ చేతుల్లోకివెళ్తే అసలు కుట్ర కోణాన్ని వెలికి తీస్తారని అనుకున్నారు. బీజేపీ నేతలు అదే ప్రకటన చేశారు. హైకోర్టు సీబీఐకి ఇవ్వాలని తీర్పు ఇచ్చింది కానీ సీబీఐ ఇంత వరకూ కేసు నమోదు చేయలేదు. విచిత్రంగా తెలంగాణ ప్రభుత్వం కూడా అటు హైకోర్టు డివిజన్ బెంచ్ కు అయినా లేదా సుప్రీంకోర్టుకు అయినా అప్పీల్‌కు వెళ్తుందన్న ప్రచారం జరిగింది. అయితే అదీ జరగలేదు. అటు సీబీఐ దూకుడు చూపించ లేదు, ఇటు బీఆర్ఎస్ కూడా ఈ అంశంపై న్యాయపోరాటానికి ఆసక్తి చూపించడం లేదు. దీంతో అసలు ఎమ్మెల్యేల ఎర కేసులో ఏం జరుగుతుందో ఆసక్తి తెలంగాణ రాజకీయాల్లో కనిపిస్తోంది.

ఈ మొత్తం వ్యవహారానికి రాజకీయవర్గాలు రెండు కారణాలు చెబుతున్నాయి. అందులో మొదటిది బీఆర్ఎస్, బీజేపీ ఓ అండర్ స్టాండింగ్ కు రావడం. ఇది ఎంత వరకూ నిజమవుతుందో చెప్పలేం కానీ రాజకీయాల్లో ఇలా పార్టీల అంతర్గతంగా కొన్ని అంశాలపై సర్దుకుపోవడం కామన్ గానే జరుగుతూ ఉంటుంది. పరస్పర డిమాండ్లు రహస్యంగా నెరవేర్చుకుని ఇలాంటి కేసుల విషయంలో లైట్ తీసుకుంటారు. రెండు కేసుల విషయంలో ఏమైనా రెండు పార్టీల పెద్దలు ఓ అవగాహనకు వచ్చి ఉంటారా అన్న చర్చ కూడా అందుకే నడుస్తోంది.

ఇక మరో కారణం టైమింగ్ చూసి ఎటాక్ చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు వేచి చూస్తూ ఉండటం. రెండు ఆయుధాలు బీజేపీ చేతికి అందిన తర్వాత ఇక రాజీకి ఎందుకు వస్తారన్నది బీజేపీ నేతల వాదన. చేతిలో ఆయుధాలున్నాయని వెంటనే దాడి చేయడం బీజేపీ స్టైల్ కాదని సమయం చూసి కొడతామని అంటున్నారు. కవితపై పక్కా ఆధారాలు ఉంటే ఎప్పుడైనా వాటిని బయట పెట్టి అరెస్ట్ చేయవచ్చు. ఇప్పుడు ఆ పని చేయడం కన్నా టైం చూసి కొడితేనే రాజకీయంగా ఇంపాక్ట్ ఉంటుందన్న ఆలోచన చేస్తూ ఉండవచ్చని చెబుతున్నారు. మొత్తంగా కేసుల వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశం అవుతోంది. ఇంతే సైలెంట్ అయిపోయి ఇతర అంశాలపై రాజకీయం నడిస్తే ఈ అంశంలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఓ అండర్ స్టాండింగ్ వచ్చిందనుకోవచ్చు.