2023 ఏడాదంతా ఎన్నికల సందడే

By KTV Telugu On 4 January, 2023
image

పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికింది ప్రపంచం.కొత్త సంవత్సరంలో మన దేశంలో ఎన్నికలే ఎన్నికలు. ఫిబ్రవరి నుండి డిసెంబరు వరకు మొత్తం మీద 9 రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరిలో త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు ముగిసిన రెండు నెలల గ్యాప్ తర్వాత మేలో దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకలో ఎన్నికలు నిర్వహిస్తారు. కర్నాటక ఎన్నికల అనంతరం 5 నెలల గ్యాప్ తర్వాత నవంబరు నెలలో మూడు రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. నవంబరులో ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ మరుసటి నెల అయిన డిసెంబరులో అత్యంత కీలకమైన రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. వీటికి కొంచెం అటూ ఇటూగా జమ్మూ కశ్మీరు ఎన్నికలకు ముహూర్తం పెడతారు. అవి కూడా ఈ ఏడాదిలోనే జరిగిపోతే దీన్ని ఎన్నికల నామ సంవత్సరం అని పిలుచుకోవచ్చు.

జమ్మూ కశ్మీరు ను పక్కన పెట్టేస్తే మిగతా 9 రాష్ట్రాలు ప్రధాన రాజకీయ పార్టీలకు అత్యంత కీలకం. ప్రత్యేకించి పెద్ద రాష్ట్రాలైన కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణాలు కాంగ్రెస్ – బిజెపిలకు ప్రతిష్ఠాత్మక ఎన్నికలనడంలో అతిశయోక్తి లేదు.ఈ నాలుగింటిలోనూ చూసుకుంటే కర్ణాటక, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో ఉంది. ఈ రెండు రాష్ట్రాలనూ తిరిగి గెలుచుకోవాలని బిజెపి పంతంగా ఉంది. అయితే కర్నాటకలో బిజెపికి ఎదరుగాలి వీస్తోంది. ఈ సారి ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని హస్తం పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక మద్య ప్రదేశ్ లో గత ఎన్నికల్లో బిజెపికి ముచ్చెమటలు పట్టించి కాంగ్రెస్ చచ్చీ చెడీ గెలిచి అధికారంలోకి వచ్చింది. అయితే ఎన్నికల్లో పార్టీ విజయానికి కారకుడైన జ్యోతిరాదిత్య సింధియాను ముఖ్యమంత్రిని చేయకుండా పక్కన పెట్టిన కాంగ్రెస్ హై కమాండ్ సీనియర్ పేరిట కమలనాథ్ కు ఆ పదవిని కట్టబెట్టింది. డిసెంబరులో ఎన్నికలు జరగనున్న రాజస్థాన్ లో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. గత ఎన్నికల్లో సచిన్ పైలట్ దూకుడుతో రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.

విజయానికి కారకుడైన సచిన్ పైలట్ ను మధ్య ప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా తరహాలో పక్కన పెట్టిన కాంగ్రెస్ అధిష్ఠానం  సీనియర్ ముసుగులో గాంధీ కుటుంబానికి విధేయుడైన అశోక్ గెహ్లాట్ ను తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసింది. ముఖ్యమంత్రి అయిన క్షణం నుంచే అశోక్ గెహ్లాట్ ఒక అజెండాతో నడుచుకుపోతున్నారు సచిన్ పైలట్ వర్గాన్ని పక్కన పెట్టేసి తన మనుషులకు పెద్దపీట వేసుకున్నారు. ఈ వైఖరిపై సచిన్ పైలట్ గాంధీలకు చెప్పుకున్నా లాభం లేకపోయింది. జ్యోతిరాదిత్య సింధియా తరహాలోనే సచిన్ పైలట్ కూడా బిజెపితో  అవగాహన కుదుర్చుకున్నాడు కానీ ఆ ప్రక్రియ చాలా ఆలస్యం కావడంతో రాజస్థాన్ లో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా కాంగ్రెస్ అడ్డుకోగలిగింది. గెహ్లాట్ పై సచిన్ పైలట్ వర్గం గుర్రుగా ఉంది. అది మూడేళ్లుగా అలా కొనసాగుతూనే ఉంది. ఈ మధ్యనే ఏ.ఐ.సి.సి. అధ్యక్ష పదవికి అశోక్ గెహ్లాట్ పేరును ప్రతిపాదించారు సోనియా గాంధీ. పార్టీ అధ్యక్ష పదవితో పాటు ముఖ్యమంత్రి పదవినీ తనదగ్గరే అట్టేపెట్టుకుందామని గెహ్లాట్ అనుకున్నారు. అయితే జోడు పదవులు ఉండకూడదని నిబంధన ఉండడంతో అది కుదరదని రాహుల్ గాంధీ తెగేసి చెప్పారు. దాంతో తాను ఏఐసిసి అధ్యక్షుణ్ని అయితే సచిన్ పైలట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రిని చేయడానికి వీల్లేదని గెహ్లాట్ మంకు పట్టు పట్టారు.

ఈ క్రమంలోనే గెహ్లాట్ వర్గీయులు పార్టీ హైకమాండ్ ఆదేశాలు ధిక్కరిస్తూ తిరుగుబాటు జెండా ఎగరేశారు కూడా. గెహ్లాట్ వైఖరితో నొచ్చుకున్న సోనియా గాంధీ ఏఐసిసి అధ్యక్ష పదవి రేసు నుండి గెహ్లాట్ ను తప్పించి మల్లికార్జున ఖర్గే పేరు తెరపైకి తెచ్చారు. గెహ్లాట్-పైలట్ వర్గాల మధ్య పోరు వచ్చే ఎన్నికల్లో పార్టీని ఎటు తీసుకుపోతుందోనని సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కమలనాథ్ ముఖ్యమంత్రి అయ్యాక జ్యోతిరాదిత్య సింధియాతో పాటు ఆయన వర్గీయులకు కీలక పదవులు ఇవ్వకుండా అప్రధాన పదవులిచ్చి చేతులు దులుపుకున్నారు కమలనాథ్. దీనిపై జ్యోతిరాదిత్య సింధియా పార్టీ హైకమాండ్ ముందు మొరపెట్టుకున్నా లాభం లేకపోయింది. విసిగి వేసారిన జ్యోతిరాదిత్య సింధియాను బిజెపి  చేరదీసింది. అంతే రాత్రికి రాత్రే కాంగ్రెస్ మైనారిటీలో పడిపోయింది. జ్యోతిరాదిత్య సింధియా వర్గం మద్దతుతో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.  కమలనాథ్ ముఖ్యమంత్రి ఉద్యోగం ఊడింది. ఆయన స్థానంలో బిజెపి మాజీ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ను రాజ్యలక్ష్మి వరించింది. అలా గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా కూడా మధ్య ప్రదేశ్ లో బిజెపి ప్రభుత్వమే రాజ్యమేలగలిగింది.

వచ్చే ఎన్నికల్లో మధ్య ప్రదేశ్ ప్రజలు ఎలా ఆలోచిస్తారన్నది చూడాలి. తామె కాంగ్రెస్ కు అధికారం అప్పగిస్తే దాన్ని బిజెపి దొడ్డిదోవన కైవసం చేసుకోవడంపై ప్రజలు ఎలా స్పందిస్తారనేది వచ్చే ఎన్నికల్లో తేలుతుంది.ఇక కాంగ్రెస్ బిజెపిలు చాలా సీరియస్ గా తీసుకుంటోన్న రాష్ట్రం తెలంగాణ. 2014లో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్-బిజెపిలు తెలంగాణా ప్రజల మనసులు గెలుచుకునేందుకు పోటీ పడ్డాయి.అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీయే ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. విభజన బిల్లు ఆమోదం విషయంలో కాంగ్రెస్-బిజెపిలు పోటీ పడ్డాయి. పార్లమెంటు తలుపులు మూసి బిల్లును ఆమోదించేసారు. ఎలాంటి చర్చ జరక్కుండా చేశారు.లోక్ సభ ప్రసారాలు కూడా నిలిపివేసి బిల్లుపై ఆమోద ముద్ర వేశారు. అయితే విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఉద్యమ పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఇచ్చింది తామే కాబట్టి ప్రజలు తమకే అధికారం కట్టబెడతారన్న కాంగ్రెస్ హై కమాండ్ అంచనాలను తెలంగాణ ప్రజలు తల్లకిందులు చేశారు.నాలుగేళ్ల తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో టి.ఆర్.ఎస్. మరింత ఘన విజయం సాధించింది. టిడిపి, కమ్యూనిస్టు పార్టీలతో కలిసి జట్టుకట్టిన కాంగ్రెస్ పార్టీకి మరోసారి పరాభవం తప్పలేదు. ఇపుడు రాష్ట్రానికి ముచ్చటగా మూడో సారి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఈ ఎన్నికల్లో ఓప్రత్యేకత ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సమితి తన పేరు మార్చుకుంది. భారత రాష్ట్ర సమితిగా  పేరు మార్చుకుని జాతీయ పార్టీనని చెప్పుకుంటోంది. దేశ వ్యాప్తంగా విస్తరించాలన్న అజెండాతో ముందుకు పోతోంది. ఆంధ్ర ప్రదేశ్ లోనూ కార్యకలాపాలు ప్రారంభించడానికి నాంది పలికింది. ఏపీకి చెందిన తోట చంద్రశేఖర్ ను బి.ఆర్.ఎస్. ఏపీ శాఖ అధ్యక్షుడిగా ప్రకటించారు. 2014తో పోలిస్తే  తెలంగాణాలో ఇపుడు బిజెపి బలం పుంజుకుంటూ వస్తోంది. కొన్ని ఉప ఎన్నికల్లో అఖండ విజయాలు సాధించి పాలక పక్షానికి షాకిచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ మున్పిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ బిజెపి సత్తా చాటింది. ఇక బిజెపితో పోలిస్తే తెలంగాణాలో గ్రామ గ్రామాన క్యాడర్ ఉన్న పార్టీ కాంగ్రెస్సే. బి.ఆర్.ఎస్. పట్ల ఉన్న వ్యతిరేకత తమకు అధికారం కట్టబెడుతుందని తెలంగాణ కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పట్ల పార్టీలో సీనియర్లు తీవ్ర ఆగ్రహంతో ఉండడం ఇటీవల రేవంత్ రెద్ది నేతృత్వంలో  ప్రకటించిన తెలంగాణా కాంగ్రెస్ కమిటీల పట్ల పార్టీలో అసంతృప్తి రాజుకోవడం తెలంగాణ కాంగ్రెస్ ను ఆత్మరక్షణలో పడేసింది. తెలంగాణా కాంగ్రెస్ కు పరిస్థితులు అనుకూలిస్తోన్నా దాన్ని అందిపుచ్చుకోడానికి నాయకులు సిద్ధంగా లేరన్నట్లు ఉంది వ్యవహారం.

బిజెపి మాత్రం ఆకర్ష మంత్రతో దూసుకుపోతోంది. బి.ఆర్.ఎస్. తో పాటు కాంగ్రెస్ నేతలకూ గేలం వేస్తోంది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణాపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కష్టపడి పనిచేస్తే తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవడం ఖాయమని నడ్డా పార్టీ శ్రేణులకు నూరిపోస్తున్నారు. ఇక పాలక పక్షమైన బి.ఆర్.ఎస్. కు చాలా సవాళ్లు ఉన్నాయి. ఎనిమిదేళ్లకు పైగా పాలన పట్ల ప్రజల్లో కొంత వ్యతరేకత గూడుకట్టుకుంది. ఇపుడు పార్టీ పేరు మార్చడం ఓటర్లలో కొంత గందరగోళం సృష్టించే అవకాశం ఉందంటున్నారు రాజకీయ పండితులు. దక్షిణాది రాష్ట్రమైన కర్నాటక చేజారిపోతే  దాని స్థానంలో తెలంగాణాను భర్తీ చేయాలని కమలనాథులు పట్టుదలగా ఉన్నారు. 2023లో జరగనున్న 9 రాష్ట్రాల్లోనూ రెండు బిజెపి అధికారంలో ఉన్నవి కాగా రెండు కాంగ్రెస్ పాలనలో ఉన్నాయి. కాంగ్రెస్ పాలనలో ఉన్న ఛత్తీస్ ఘడ్ ను ఈసారి తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని  కమలనాథులు  ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. రాహుల్ గాంధీ నిర్వహిస్తోన్న భారత్ జోడో యాత్రకు అన్ని చోట్లా అద్భుతమైన స్పందన అయితే లభిస్తోంది.

వివిధ రంగాలకు చెందిన తటస్థ మేథావులు కళాకారులు కూడా రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొంటున్నారు.ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్  తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ వంటి వారు రాహుల్ తో కాలు కదిపి ముందుకు సాగారు. అటు బిజెపి అగ్రనేత నరేంద్ర మోదీ-అమిత్ షాలు ఈ ఏడాదంతా ఎన్నికల వ్యూహాలు రచించడం పార్టీని ముందుకు నడిపించడంపైనే దృష్టి సారిస్తారు. సెమీ ఫైనల్స్ లో సత్తాచాటితే అది ఫైనల్స్ లో పార్టీ శ్రేణుల్లో కదనోత్సాహాన్ని పెంచుతుందని రెండు జాతీయ పార్టీలూ భావిస్తున్నాయి. త్రిపుర, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్ రాష్ట్రాల్లో అక్కడి స్థానిక పార్టీలే కీలక పాత్రపోషిస్తాయి. ఈ పార్టీలకు జాతీయ పార్టీలు మద్దతు తెలపాల్సిన పరిస్థితులు ఉంటాయి. 2024లో కేంద్రంలో ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రావాలని బిజెపి ఆలోచన. రెండు వరుస ఎన్నికల్లో పరాజయాల పాలై ప్రతిపక్షానికే పరిమితమైన కాంగ్రెస్ ఈ సారి అయినా కేంద్రంలో అధికారంలోకి రావాలని భావిస్తోంది. అది నిజం చేసుకోవాలంటే ఈ రెండు పార్టీలకూ ఈ ఏడాది జరిగి ఎన్నికల్లో అద్భుత విజయాలు సాధించడం చాలా అవసరం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.