రాజ్యసభ ఎన్నికల వేడి తెలంగాణ బీజేపీ నేతల్లో కొత్త ఆశలు రేపుతోంది. ఏడుగురు నామినేటెడ్ సభ్యులు సహా 72మంది పదవీకాలం ముగియనుంది. ఈ ఏడాది మార్చి- జూలై మధ్య కాలంలో అంటే రాబోయే వర్షాకాల సమావేశాల్లోపు వారు పదవీ విరమణ చేయనున్నారు. తెలంగాణ అసెంబ్లీలో బీజేపీకి ముగ్గురే సభ్యులే ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికల దృష్ట్యా రాష్ట్రానికి ప్రాతినిథ్యం కల్పించాలన్న ఆలోచనలు బీజేపీ హైకమాండ్ మదిలో ఉన్నట్టు సంకేతాలు వస్తున్నాయి. రాజ్యసభలో తెలంగాణ వాయిస్ వినిపించేందుకు అవకాశం ఇస్తే అది రాజకీయంగా కలిసొస్తుందన్న లెక్కలు వేస్తోంది. 57 రాజ్యసభ స్థానాలకు జూన్ 10న ఎన్నికలు జరగబోతున్నాయి. నామినేషన్ల సందడి కూడా మొదలైంది.
వచ్చే ఎన్నికలే అజెండా
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలని కంకణం కట్టుకుంది బీజేపీ. గులాబీ పార్టీని ఓడించేందుకు వీలున్న అని అస్త్రాలు బయటకు తీస్తోంది. పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. బండిసంజయ్ నాయకత్వంలో టీఆర్ఎస్ ను ఎదుర్కోనేందుకు వ్యూహాలు రచిస్తోంది. అయితే పెద్దల సభలో తెలంగాణ వాయిస్ పార్టీ తరపున వినిపించేందుకు ఒకరు ఉంటే బాగుంటుందన్న ఆలోచన రాష్ట్ర నేతల్లో ఉంది. అనుభవజ్ఞుల వేదిక రాజ్యసభలో బీజేపీకి చెప్పుకో దగ్గ సంఖ్యలో ఎంపీలు ఉన్నారు. కాని తెలంగాణ నుంచి మాత్రం ఎవరూ లేరు. సభలో టీఆర్ఎస్ ఎంపీలకు కళ్లెం వేయాలంటే రాష్ట్రం తరపున బీజేపీ నుంచి ఒకరికి అవకాశం కల్పిస్తే బాగుంటుందని నేతలు అభిప్రాయంతో ఉన్నారు.
రేసులో ఇద్దరా..ముగ్గురా…
ఈసారి జరిగే రాజ్యసభ ఎన్నికల్లో రాష్ట్రానికి చెందిన ఒక బలమైన నేతను ఎంపిక చేయాలని అమిత్ షా ఆలోచిస్తున్నారు. ఎవర్ని ఎంపిక చేస్తే పార్టీకి కలిసొస్తుందనే కోణంలో లెక్కలు వేస్తున్నారు. అర్హులైన వారి జాబితాను తయారు చేస్తున్నారు. రేసులో విజయశాంతి, గరికపాటి రామ్మోహన్ రావు పేర్లు కూడా ఉన్నట్టు సమాచారం. గరికపాటి గతంలో టీడీపీ తరపున సభలోకి అడుగుపెట్టి బీజేపీలో విలీనం తర్వాత ఆపార్టీ ఎంపీగా ఉన్నారు. మంచి అనుభవం ఉన్న నేత కూడా. పార్టీ కార్యక్రమాల్లోను చురుగ్గా పాల్గొంటారు. తుక్కుగూడలో అమిత్ సభ ఏర్పాట్లను కూడా స్వయంగా చూసుకున్నారు
విజయశాంతికి అవకాశం ఇస్తే..
ఇక ఫైర్ బ్రాండ్ విజయశాంతి కేసీఆర్ పై ఘాటైన విమర్శలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. పార్టీ వాయిస్ ను బలంగానే వినిపిస్తుంటారు. లోక్ సభ ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా స్పందిస్తుంటారు. తెలంగాణ ఉద్యమంలోను చురుకైన పాత్రను పోషించారు. ప్రజా సమస్యలపై పోరాటంలోనే తనదైన శైలిలో పాల్గొంటూ ఉంటారు..ఇటీవల రాష్ట్రానికి వచ్చిన అమిత్ షా పలువురు నేతలతో సమావేశమయ్యారు. వారికి ఆయన ఇదే విషయాన్ని చెప్పినట్టు టాక్. ఉద్యమ నేపథ్యం, ప్రజల్లోకి దూసుకెళ్లగలిగే తత్వం ఉన్న నేతలకు పదవులు ఇవ్వాలనుకుంటోంది.
బీజేపీ బంపర్ ఆఫర్
ఉత్తరాది కోటాలో తెలంగాణకి చెందిన ఒకరికి పదవి ఇవ్వాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. రాజకీయంగా, సామాజికంగా ఇలా అన్నీ రకాలు సమీకరణాలు, లెక్కలు వేసిన తర్వాత అభ్యర్ధి ఎంపిక ఉంటుంది. ఏ లెక్క వేసినా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలవడానికి దారి కావాలన్నది అసలు లక్ష్యం. జూలై 25న రాష్ట్రపతి రాంనాద్ కోవింద్ పదవి కాలం ముగియనుంది. ఈలోపల జరిగే రాజ్యసభ ఎన్నికలు బీజేపీకీ ఎంతో కీలకం. రేపుమాపో అభ్యర్ధిని ప్రకటించాలని నాయకత్వం భావిస్తోంది. ఇంతకీ తెలంగాణ బీజేపీ నేతల్లో ఎవరికి ఈ ఛాన్సు దక్కుతుందనే పార్టీ ఆశావహుల్లో ఉత్కంఠ రేపుతోంది. ఒక్కోసారి ఊహించని పేర్లు కూడా చివరి నిమిషంలో తెరపైకి వచ్చినా ఆశ్చర్య పడక్కర్లేదు.!