నోట్లరద్దు తప్పేంకాదు – కానీ ప్రజలు పడిన కష్టానికి.. గురయిన నష్టానికి బాధ్యులెవరు.

By KTV Telugu On 4 January, 2023
image

నోట్లు రద్దు చేయడం కరక్టేనని సుప్రీంకోర్టు తెల్చి చెప్పింది. ఐదుగురు న్యాయమూర్తుల ధర్మానసంలో ఒక్కరు మాత్రమే భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ విచారణ జరిగింది నిర్ణయం చట్టపరమా కాదా అనే అంశంపైనే జరిగింది. ఇలాంటి నిర్ణయాలు ఆర్బీఐ తీసుకోవాలి. కానీ కేంద్రం తీసుకుంది. ప్రధాని ప్రకటించారు. అమలు చేశారు. అయితే విచారణ జరిపిన సుప్రీంకోర్టు నోట్ల రద్దు చట్ట పరంగానే జరిగిందని తేల్చింది. దీనిపై ఎవరికీ అభ్యంతరాల్లేవు. కానీ అసలు ఎందుకు నోట్ల రద్దు చేశారో కేంద్రం ఇప్పటికైనా స్పష్టత ఇవ్వలగలదా? ప్రజలు పడిన కష్టాలకు కారణం ఏమిటో చెప్పగలరా ?

పెద్దనోట్ల రద్దుకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ నివేదిక విడుదల చేసింది. 99.3 శాతం పెద్ద నోట్లు బ్యాంకుల్లో జమ అయ్యాయని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. పెద్ద నోట్ల రద్దు చేసినప్పుడు చెప్పిన విషయం ఏమిటంటే వెయ్యి. ఐదు వందల నోట్ల రూపంలో ఉన్న నల్లధనాన్ని పెద్దలు దాచుకున్నారని వాటన్నింటినీ వెలికి తీస్తామని మోదీ ప్రకటించారు . బ్యాంకుల్లో ఉన్న డబ్బుకు లెక్క చెప్పాల్సి ఉంటుంది. లెక్కలు చెప్పలేని సొమ్మును బ్లాక్ మనీగా అక్రమార్కులు ఇంట్లో దాచుకుంటూ ఉంటారు. అందుకే సడన్‌గా పెద్ద నోట్లను రద్దు చేశామని బ్లాక్ మనీపై మాస్టర్ స్ట్రోక్ అని ప్రచారం చేసుకున్నారు. పెద్ద నోట్లు రద్దయిన తర్వాత ప్రతి ఒక్కరూ తమ వద్ద ఉన్న నగదును బ్యాంకుల్లో జమ చేస్తారు. అలా లెక్కల్లో లేని నల్లధనం జమ అయితే ఎక్కడి నుంచి వచ్చిందో ప్రభుత్వం తెలుసుకుంటుంది. కానీ జరిగింది వేరు రద్దు చేసేటప్పటికీ దేశంలో ఉన్న పెద్ద నోట్ల విలువ రూ.15 లక్షల 41వేల కోట్లు. అందులో బ్యాంకుల్లోకి చేరిన మొత్తం రూ. 15 లక్షల 31వేల కోట్లు. అంటే 99.3 శాతం తిరిగి వచ్చాయి.

బ్లాక్‌మనీని వైట్‌గా మార్చుకోవడానికి ప్రభుత్వం కల్పించిన చట్టబద్దమైన అవకాశం నోట్ల రద్దుగా మారింది. దీన్నే మనీలాండరింగ్ అంటారు. రూ.15 లక్షల 41 వేల కోట్లలో 3 లక్షల కోట్లు బ్లాక్ మనీ ఉంటుందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. కానీ రూ.10వేల కోట్లు మాత్రమే వెనక్కి రాలేదు. అంటే మిగతా మొత్తాన్ని నోట్ల రద్దు వల్ల వైట్‌ మనీగా మార్చుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో బ్యాంకుల్లో నగదు జమ అయినా కేంద్రం ఎవరికైనా నోటీసులు జారీ చేసి బ్లాక్ మనీని వైట్ చేసుకున్నారని పట్టుకుందా అంటే అదీ లేదు.

నోట్ల రద్దు తర్వాత నోట్ల అవసరం పెద్దగా ఉండదని డిజిటల్ లావాదేవీలు పెరిగిపోతాయని ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పుడు చూస్తే నోట్లు రెట్టింపయ్యాయి. అక్టోబర్‌ 21, 2022 నాటికి ఆర్థిక వ్యవస్థలో నగదు రూపంలో చలామణిలో ఉన్న నోట్ల విలువ రూ.30.88 లక్షల కోట్లు. నోట్ల రద్దుకు ముందు అంటే నవంబర్‌ 2016లో కేవలం రూ.17.7 లక్షల కోట్లు మాత్రమే జనం దగ్గర ఉన్నాయి. ఆరేళ్లలో నగదు చలామణి 72 శాతం పెరిగింది. ఇలా ఎలా పెరిగిందో ఇంత పెద్ద స్థాయిలో నోట్లు ఎలా ఇచ్చేశారో కేంద్రానికే తెలియాలి నగదు రూప లావాదేవీలపై కేంద్రం కఠిన ఆంక్షలు విధించింది. కేవలం రూ. రెండు లక్షలు లోపు మాత్రమే నగదు లావాదేవీలు జరగాలి. అంత కంటే ఎక్కువ అయితే ఖచ్చితంగా బ్యాంక్ ద్వారానే జరగాలి. కానీ ఆర్థిక వ్యవస్థలో నగదు వినియోగం అనూహ్యంగా పెరిగిపోయింది.

నోట్లను రద్దు చేయడం వల్ల కశ్మీర్‌లో అల్లరి మూకలు రాళ్లేయడం తగ్గిపోయిందన్న వాదన కూడా అప్పులు వినిపించారు. ఎందుకంటే దొంగ నోట్ల ముద్ర కూడా ఆగిపోయిందన్నారు. కానీ ఇప్పుడు కూడా ఆ దొంగనోట్లు విస్తృతంగా చెలామణి అవుతున్నాయి. నిన్నటికి నిన్న ఏపీలో ఓ వాలంటీర్ ప్రభుత్వ పెన్షన్ల కింద దొంగ నోట్లను పంపిణీ చేశారు. గుంటూరులో మరో ప్రాంతంలో అధికార పార్టీ చోటా నాయకులు దొంగ నోట్లతో పట్టుబడ్డారు. ఇలాంటివి లెక్కలేనన్ని చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అంటే దొంగ నోట్లకూ అడ్డుకట్ట పడలేదు.

రాత్రికి రాత్రి తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల దేశంలో ఇబ్బంది పడని ఒక్క వ్యక్తి కూడా లేరంటే అతిశయోక్తి కాదు. రోజు కూలీ నుంచి కుబేరుడు వరకూ అందరూ ఇబ్బందిపడ్డారు. కుబేరులు ఎంత ఇబ్బంది పడినా వారి స్థాయిలో వారు పరిష్కారాలను అధికారమే చూపిస్తుంది. కానీ సామాన్యుల పరిస్థితేమిటి. చెల్లుబాటయ్యే ఒక్క నోటు కోసం ఏటీఎంల దగ్గర పడిగాపులు కాస్తూ చనిపోయిన వారి సంగతేంటి. బ్యాంక్ క్యూ లైన్లలో చనిపోయిన వారి సంగతేంటి. బ్యాంకుల్లో డబ్బులు ఉన్నా చేతుల్లో డబ్బులు లేక కుటుంబసభ్యులకు వైద్యం చేయించుకోలేకపోయిన వారి మానసిక వేదనకు ఎవరు బాధ్యులు? బ్యాంకులో కావాల్సినంత డబ్బులు ఉన్నా బయట ఆకలి తీర్చుకోవడానికి చిల్లర దొరకక తిప్పలు పడిన వారి బాధ ఎవరికి పడుతుంది. ఈ బాధలు పడిన వారు శిక్ష అనుభవించినట్లే. వారు చేసిన తప్పేంటి ? దీనికి సమాధానం ఎవరు చెబుతారు ?