కొంతకాలంగా మౌనంగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ ఇప్పుడు మళ్లీ స్పీడ్ పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. గుంటూరు చంద్రబాబు సభలో తొక్కిసలాట వ్యవహరాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు. గుంటూరు సభలో చంద్రబాబు వెళ్లిపోయిన తర్వాత పేదలకు కానుకలు పంచుతున్నప్పుడు తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు చనిపోయారు. పేదలకు చీరెలు పంచిన స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడైన ఎన్ఆర్ఐ ఉయ్యూరు శ్రీనివాస్ ను వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేసింది. దీనిపై మైలవరం ఎమ్మెల్యే మండిపడ్డారు. ఎన్ఆర్ఐలను భయపెడితే వాళ్లు సేవా కార్యక్రమాలు చేయలేరని వసంత హెచ్చరించారు. ఎన్ఆర్ఐలు వాళ్ల పని వాళ్లని చేసుకోనివ్వాలన్నారు. రాజకీయ వేదికపైకి వచ్చారనే ఉద్దేశంతోనే ఉయ్యూరు శ్రీనివాస్ పై ఉన్నవి లేనివి ప్రచారం చేసి రాద్ధాంతం సృష్టిస్తున్నారని వసంత కృష్ణప్రసాద్ మండిపడ్డారు. పైగా ఉయ్యూరు శ్రీనివాస్ పై మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపణలు సంధించిన కొద్ది గంటల్లోనే వసంత కృష్ణప్రసాద్ కౌంటరివ్వడం వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
నిజానికి మైలవరం పంచాయతీ ఇటీవలే సద్దుమణిగింది. పెడన ఎమ్మెల్యే అయిన మంత్రి జోగి రమేష్ వచ్చి మైలవరంలో జోక్యం చేసుకుంటున్నారని కృష్ణప్రసాద్ ఆరోపించారు. బహిరంగ విమర్శలు చేశారు. దానితో తొలుత సజ్జల రామకృష్ణారెడ్డి, తర్వాత జగన్ పలిచి ఆయనతో మాట్లాడారు. మైలవరం పార్టీ కార్యకర్తలతో కూడా మాట్లాడిన సీఎం జగన్ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. జోగి రమేష్ పెడన నుంచే పోటీ చేస్తారని మైలవరంలో ఆయన జోక్యం ఉండబోదని జగన్ హామీ ఇవ్వడంతో వసంత కృష్ణప్రసాద్ శాంతించారు.
గుంటూరు తొక్కిసలాట వ్యవహారంలో వసంత మళ్లీ నోరు తెరిచారు. పార్టీ అధిష్టానానికి శూలాలు గుచ్చుకునే మాటలు మాట్లాడారు. ఎక్కువ మాట్లాడుతున్నారని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిని ఇన్ ఛార్జ్ పదవి నుంచి తొలగించిన మరసటి రోజే వసంత చేసిన అటాక్ వైసీపీ అధిష్టానానికి అసలు రుచించడం లేదు. ఇంతవరకు ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్యేగా ఉన్న పేచీ ఇప్పుడు ఎమ్మెల్యే వర్సెస్ అధిష్టానంగా మారుతుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రఘురామ కృష్ణరాజు, డీఎల్ రవీంద్రా రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి వ్యవహారాలతో తలబొప్పికట్టి ఉన్న వైసీపీకి ఇప్పుడు కృష్ణప్రసాద్ కొత్త సమస్యలు తెచ్చిపెడతారన్న భయం కలుగుతోంది.
కొన్ని రోజుల క్రితం కృష్ణప్రసాద్ తండ్రి అయిన వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యలు దుమారం రేపాయి. ప్రభుత్వంలో ఒక కమ్మ సామాజిక వర్గం మంత్రి కూడా లేరని వచ్చే పునర్ వ్యవస్థీకరణలో అయినా ఒకరికి అవకాశం ఇవ్వాలని ఆయన స్టేట్ మెంట్ ఇచ్చేశారు. దాన్ని సర్దుకోవడానికి కృష్ణప్రసాద్ నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఇప్పుడు కృష్ణప్రసాదే స్వయంగా ఒక మాట అనేశారు. ఎన్ఆర్ఐలను ఇబ్బంది పెట్టవద్దని ప్రభుత్వానికే సూచించాయి. ఇప్పుడు రేగిన దుమారానికి కృష్ణప్రసాద్ స్వయంగా వివరణ ఇస్తారో లేదో చూడాలి. పార్టీని తాను విమర్శించలేదని చెబుతారా లేక రెబల్ గా మారతారా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నే.