తెలంగాణలో మందు సేల్స్ తగ్గాయా?.. నిజమేనా?…

By KTV Telugu On 27 May, 2022
image

ఎక్కడ చూసినా వైన్ షాపులే.. జనం తాగి తూటలమే.. రోడ్ల మీద పడిపోవడమే.. కుటుంబాలు విచ్ఛిన్నం కావడమే.. తిండి లేక పిల్లలు భోరున ఏడవడమే.. ఇవీ తెలంగాణలో విపక్షాలు నిత్యం చేసే ఆరోపణలు. వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. లిక్కర్ సేల్స్ డేటా చూస్తే అందుకు భిన్నమైన ఆలోచన వస్తుంది. ఇటీవలి కాలంలో మద్యం  అలవాటు తగ్గుతోందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. పట్టణ, గ్రామీణ రెండు ప్రాంతాల్లోనూ మద్యం సేవించే వారి సంఖ్య సగానికి తగ్గిందట. కొంత కాలం క్రితం వరకు తెలంగాణ పరుషుల్లో మద్యం ప్రియులు 61.2 శాతం ఉండేవారట. ఇప్పుడా సంఖ్య 51.5 శాతానికి తగ్గింది. ఇక మహిళల్లో మద్యం సేవించే వారి సంఖ్య 14 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గింది. అయినా ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుందని ఎవరైనా ప్రశ్నించొచ్చు. రేట్లు పెరగడం వల్ల  ఆదాయం పెరిగిందని అధికారులు చెబుతున్నారు….

రాష్ట్రంలో పరుగులు తీస్తున్న అభివృద్ధి

రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి తెలంగాణలో  అభివృద్ధి వేగం పుంజుకుందని పలు సంస్థలు నిర్వహించిన సర్వేలో తేలింది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే కూడా అదే విషయాన్ని ధృవీకరించింది.వైద్యం, విద్య, తాగునీరు,సాగునీరు.టాయ్ లెట్స్ ఏది చూసినా అభివృద్ధి కనిపిస్తోంది. గర్భస్త శిశు మరణాలు కూడా గణనీయంగా తగ్గాయి..

తెలంగాణలో రక్షిత మంచినీటి సౌకర్యం బాగానే పెరిగింది. 2015-15 నాటికి రాష్ట్రంలో 78.1 శాతం మందికి మాత్రమే తాగు నీరు అందుబాటులో ఉండేది. ఇప్పుడది 98.7 శాతానికి పెరిగింది.మిషన్ భగీరథ సక్సెస్ కావడమే ఇందుకు కారణంగా ప్రజా సంఘలు కూడా అంగీకరిస్తున్నాయి. మెరుగైన టాయ్ లెట్లు కూడా ఎక్కువ మందికి ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. 2015-1 6 సంవత్సరంలో 51.7 శాతం మందికి టాయ్ లెట్లు ఉండేవి. ఇప్పుడది 76.2 శాతానికి చేరింది. బహిరంగ మల విసర్జన పూర్తిగా తగ్గిపోయింది.

విద్యారంగం పూర్తిగా విస్తరించింది. నిర్బంధ ప్రాథమిక విద్య సత్ఫలితాలనిస్తోంది.  6 నుంచి 14 సంవత్సరాల వయసులో 97 శాతం మంది పిల్లలు బడికి వెళ్తున్నారు. అక్కడ వారికి అన్ని సౌకర్యాలు కల్పించారు. ప్రతీ జిల్లాలో తగినంత మంది ఉపాధ్యాయులు, సిబ్బంది ఉండటంతో పిల్లల చదువులకు ఎలాంటి ఆటంకం కలగడం లేదు. అయితే అక్షరాస్యత సంఖ్య పెరగకపోవడం మాత్రం ఆందోళన కలిగిస్తున్న అంశం. 15 నుంచి 49 సంవత్సరాల వయసులో 82 మంది పురుషులు అక్షరాస్యులని సర్వేలు నిగ్గు తేల్చాయి. మహిళల్లో 65 శాతం మంది మాత్రమే అక్షరాస్యులు.

వైద్య రంగంలో తెలంగాణ అద్భుతాలు సృష్టిస్తోంది. ప్రతీ జిల్లాలోనూ ఆస్పత్రుల పరిస్థితిని ప్రభుత్వం మెరుగుపరుస్తోంది. సీఎం కేసీఆర్ స్వయంగా ఎప్పటికప్పుడు వైద్య శాఖ పనితీరును సమీక్షిస్తున్నారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారు. హైదరాబాద్ లో తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.. టిమ్స్.. విస్తరణ పనులు వేగం పంజుకున్నాయి. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు ద్వారా భవిష్యత్తులో డాక్టర్లు, స్పెషలిస్టుల కొరత లేకుండా చూసుకునేందుకు చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలో శిశు మరణాలు కూడా తగ్గాయి. 2015 -16 సంవత్సరంలో ప్రతీ వెయ్యి జననాల్లో  30 శిశు మరణాలుండేవి. ఇప్పుడది 26కు తగ్గింది..