కుప్పంలో హై టెన్షన్ నెలకొంది. సొంత నియోజకవర్గంలో చంద్రబాబును ముఖ్యమంత్రి జగన్ నడిరోడ్డుపై నిలబెట్టారు. 14సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదేళ్లు ప్రతిపక్ష నేతగా చేసిన లీడర్‌ను అని మరోసారి చంద్రబాబు చెప్పుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చోట తనను ఇంటికి పోకుండా జగన్ అడ్డుకుంటున్నాడంటూ ఒకింత ఆవేదన ఆగ్రహం వెలిబుచ్చారు బాబు. తన ప్రజలతో మాట్లాడేందుకు జగన్ పర్మీషన్ తీసుకోవాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుకు కదలనివ్వని పోలీసులపై శివాలెత్తారు. నోటీసులపై సంతకం పెట్టాలంటూ కోరడంపై మండిపడ్డారు. సభలకు మైక్ ఎందుకు ఇవ్వరు ఎందుకు అడ్డుకుంటున్నారంటూ పెద్ద పెట్టున అరిచారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం వచ్చా పంపండి అని మొత్తుకున్నా పోలీసులు పట్టించుకోలేదు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా తలపెట్టిన ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా బాబు ఉద్రిక్తతల నడుమ కుప్పంలో అడుగుపెట్టారు. ప్రభుత్వ ఆంక్షలు పోలీసుల అడ్డుంకులను ఛేదించుకొని సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టిన చంద్రబాబుకు తమ్ముళ్లు ఘన స్వాగతం పలికారు. అయితే బాబు పర్యటనకు ముందే హైడ్రామా నడిచింది. కందుకూరు గుంటూరుల్లో నిర్వహించిన రోడ్ షో బహిరంగ సభల్లో 11 మంది దుర్మరణం పాలైన నేపథ్యంలో వాటిపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 1ను జారీ చేసింది. ఈ ఉత్తర్వులు జారీ అయినప్పటికీ చంద్రబాబు కుప్పం చేరుకున్నారు. దాంతో సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. చంద్రబాబు రోడ్ షోగా తరలి వెళ్లాల్సిన వాహనాన్ని సీజ్ చేసి డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
వచ్చే ఎన్నికల్లో కుప్పం గడ్డపై వైసీపీ జెండా ఎగరేస్తామని ఆ పార్టీ చెబుతోంది. దాంట్లో భాగంగా బాబును అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల బాబు పర్యటనల్లో చోటుచేసుకున్న దుర్ఘటనలను దృష్టిలో ఉంచుకొని ఆంక్షలు విధించింది. టీడీపీ సభల్లో చోటుచేసుకున్న మరణాల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికే బాబు కుప్పం టూర్ పెట్టుకున్నాడని వైసీపీ ప్రచారం చేస్తోంది. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉంటూ చంద్రబాబు వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నాడని వైసీపీ కుప్పం ఇంఛార్జ్ భరత్ ఆరోపించారు. రోడ్డు షోలు రోడ్లపై మీటింగులకు అనుమతి లేదని పోలీసులు చెప్పినప్పటికీ వినిపించుకోవట్లేదని పోలీసులపైనే దాడి చేశారని విమర్శించారు. ఇంకెంత మందిని చంపాలని కుప్పానికి ఆయన వస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు.
తమ మీటింగ్‌లకు వచ్చే జనాన్ని చూసి జగన్‌కు వణుకు పుడుతోందంటూ టీడీపీ నేతలు అటాక్ చేస్తున్నారు. రోడ్లపై కాకుండా మీటింగ్‌లు ఆకాశంలో పెట్టాలా అంటూ బాబు ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. తాను అనుకుంటే జగన్ పాదయాత్ర చేసేవాడా అంటూ నిప్పులు చెరిగారు. తన ప్రజలతో మాట్లాడే హక్కును కాలరాస్తున్నారంటూ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చీకటి జీవోలతో ఎమర్జెన్సీ తీసుకొస్తున్నారంటూ బాబు పెద్ద పెద్ద పదాలు వాడారు. ముఖ్యమంత్రి నియంతలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పారిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. సైకో పాలన పోవాలి సైకిల్ పాలన రావాలంటూ బాబుతో పాటు తమ్ముళ్లు నినాదాలు చేశారు.