తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు పంతం నెగ్గించుకున్నారు. కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిగం ఠాగూర్ అస్త్ససన్యాసం చేసే దాకా వదిలి పెట్టలేదు. తాను తట్టుకోలేను బాబోయ్ అని ఆయన రాహుల్ కు మొరపెట్టుకున్నారు. ముందు ఆయనను సాగనంపాలని సీనియర్ నేతలు కూడా డిమాండ్ చేశారు. హైకమాండ్ ఇద్దరి కోరికల్ని తీర్చింది. కానీ సమస్య ఇంతటితో పరిష్కారమవుతుందా ? సీనియర్లు రేవంత్ నాయకత్వంలో పని చేస్తారా ? ఏకతాటిపైకి వస్తుందా ? అంటే అలాంటి ఆశలు పెట్టుకుంటే అంత కంటే రాజకీయ తెలివి తక్కువ తనం కాంగ్రెస్ హైకమాండ్‌కు ఉండదు. ఎందుకంటే కాంగ్రెస్ లో అసమ్మతి బలం ఇస్తే పేనుకు పెత్తనం ఇచ్చినట్లే. ఆ విషయం ఇక ముందు తెలంగాణ కాంగ్రెస్‌లో నిరూపితం కానుంది.
మాణిగం ఠాగూర్ స్థానంలో ఇంచార్జుగా మహారాష్ట్ర సీనియర్ నేతను నియమించారు. ఇప్పుడు సీనియర్లు ఏం చేయబోతున్నారు ? టీ.పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పట్ల అసమ్మతి పెరిగిపోయి తాడో పేడో తేల్చుకునేందుకు సీనియర్లు సిద్ధమవుతున్న తరుణంలోనే దిగ్విజయ్ సింగ్ నిర్ణియంచారు. సీనియర్లతో మాట్లాడారు. ఢిల్లీ వెళ్లి కేంద్రానికి నివేదిక ఇచ్చారు. కాంగ్రెస్ వ్యవహారాలు చూసుకుంటున్న ప్రియాంకా గాంధీ కూడా ఒకరిద్దరు సీనియర్లతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికల శిక్షణా శిబిరానికి హాజరు కావాలని స్వయంగా అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే పార్టీ సీనియర్లకు ఫోన్ చేసి అడిగారు. అయినా సీనియర్లు మాత్రం డుమ్మాకొట్టారు. అయినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకునే ఆలోచన చేయకుండా సీనియర్లను సంతృప్తి పరిచేందుకు ఠాగూర్ ను బలి చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. దీంతో అసమ్మతి నేతలకు మరింత బలం పెరిగినట్లయింది.
సీనియర్ల సమస్య అసలు ఇంచార్జ్ కానే కాదు. ఎందుకంటే సీనియర్లు గతంలో వచ్చిన ఏ కాంగ్రెస్ ఇంచార్జుతోనూ సఖ్యతగా లేరు. తాము అనుకున్న పదవులు ఇస్తే సరే లేకుంటే మాత్రం ఇంచార్జులపై దారుణమైన ఆరోపణలు చేస్తారు. మాణిక్కం ఠాగూర్ కంటే ముందు రామచంద్ర కుంతియా ఇంచార్జ్ గా ఉన్నారు. ఆయనను టీ కాంగ్రెస్ సీనియర్ నేతలు పెట్టిన తిప్పలు అన్నీ ఇన్నీ కావు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయనపై ప్రతీ సారి దారుణంగా ఆరోపణలు చేసేవారు. విచిత్రంగా అప్పుడు వీరి టార్గెట్ రేవంత్ రెడ్డి కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంతకు ముందు పీసీసీ గా ఉన్న పొన్నాల లక్ష్మయ్య. కోమటిరెడ్డి సోదరులు పీసీసీ చీఫ్ పదవి తమకు ఇవ్వలేదని ఇంచార్జులు ప్రతీ ఒక్కరినీ టార్గెట్ చేసుకున్నారు. చివరికి ఒకరు పార్టీని వదిలి వెళ్లారు. మరొకరు పార్టీలోనే ఉండి అసమ్మతికి ఆజ్యం పోస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే సీనియర్ల సమస్య ఇంచార్జ్ కాదని అనుకున్నపదవి రాకపోతే కొత్తగా వచ్చే ఇంచార్జిపైనా నిందలేస్తారని అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు ఈ బలంతో సీనియర్లు మరింత రెచ్చిపోతారని కలిసి పని చేసే చాన్సే ఉండదన్న వాదన వినిపిస్తోంది. తమ అసంతృప్తిని హైకమాండ్ సీరియస్ గా తీసుకుందని దీనిపై గట్టిగా పట్టుబడితే టీ పీసీసీ చీఫ్‌గా రేవంత్ నూ తప్పిస్తుందని వారు అనుకోకుండా ఉండరు. పార్టీ అధ్యక్షుడు ఫోన్ చేసి చెప్పినా శిక్షణా శిబిరానికి హాజరు కానీ సీనియర్ నేతలు అదే సమయంలో బీఆర్ఎస్కు చెందిన కొంత మంది ముఖ్యులతో మంతనాలు జరిపారన్న ప్రచారం గుప్పుమంది. ఎర్రబెల్లి, ఉత్తమ్ మధ్య తరచూ చర్చలు జరుగుతున్నాయంటున్నారు. కారణం ఏదైనా సీనియర్లు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలని పట్టుబడుతున్నారని అంటున్నారు. బీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తు అంటే పార్టీ రాజకీయంగా ఆత్మహత్య కు ప్రేరేపించడమేనని రేవంత్ వర్గీయులు అంటున్నారు. కానీ ఈ విషయంలో సీనియర్లు మాత్రం బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటే ఉంటాం లేకపోతే లేదన్నట్లుగా ఉన్నారు. చివరాఖరికి పొత్తులు పెట్టుకున్నా వారుంటారన్న గ్యారంటీ లేదు. అదే రాజకీయం. రేవంత్ రెడ్డి మాణిగం ఠాగూర్ కష్టమో నష్టమో ఒంటరిగా పోటీ చేద్దామన్నారు. కానీ ఇప్పుడు ఠాగూర్ తనకెందుకని సైడయ్యారు.
సీనియర్లను కట్టడి చేసి ఉంటే ఉండండి లేకపోతే లేదు అంటే సర్దుకుపోయేవారని ఇప్పుడు వారికి అసంతృప్తి బలం కల్పించడం వల్ల పార్టీకే నష్టమని రేవంత్ వర్గీయులు వాపోతున్నారు. అందుకే ఈ వ్యవహారంలపై రేవంత్ రెడ్డి కూడా అసహనానికి గురవుతున్నారు. కావాలంటే పదవి కి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తనను ఎక్కించుకుని పల్లకీ మోస్తున్నట్లుగా ఫీలవుతున్న సీనియర్ నేతలపై ఆయన పరోక్షంగా మండిపడ్డారు. తాను దిగిపోవడానికి సిద్ధమేనని పల్లకీ మోస్తానన్నారు. పది పనులు చేస్తున్నప్పుడు ఒకటి, రెండు తప్పులు దొర్లుతాయని వ్యాఖ్యానించారు. దీంతో రేవంత్ రెడ్డి కూడా ఇక కాంగ్రెస్ సీనియర్లతో వేగడం కష్టమన్న అభిప్రాయానికి వస్తున్నట్లుగా తెలుస్తోంది.
కారణం ఏదైనా ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో జరగబోయే పరిణామాలు కీలకమైనవిగా మారాయి. ఏ పార్టీలో అయినా అసమ్మతిని అణిచివేయాలి. లేకపోతే అది పార్టీని మింగేస్తుంది అంతర్గత ప్రజాస్వామ్యం ఎంత వరకూ ఉండాలో అంతే ఉండాలి. కానీ ఉద్దేశపూర్వకంగా పార్టీని డామేజ్ చేస్తున్నారని తెలిసీ ఉపేక్షిస్తే మొదటికే మోసం వస్తుంది. ఆ పరిస్థితి దగ్గరగా తెలంగాణ కాంగ్రెస్ చేరింది.