కామారెడ్డి కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మున్సిపల్లో విలీనమయ్యే గ్రామాల రైతులు కుటుంబ సభ్యులతో సహా తరలివచ్చి మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకంగా కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. పోలీస్ బారికేడ్లను కూడా పక్కకు నెట్టి కలెక్టరేట్ ముట్టడించారు. కామారెడ్డి ఇండస్ట్రియల్ జోన్ మాస్టర్ ప్లాన్ లో ఎల్లారెడ్డి, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఎనిమిది గ్రామాలను చేర్చారు. ఈ గ్రామాల రైతుల నుంచి భూములను సేకరించి ఇండస్ట్రియల్ కారిడార్ కు కేటాయించనున్నారు. అయితే దీన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమకు జీవనోపాధిని కల్పించే భూములను ఇవ్వబోమని అంటున్నారు. తన భూమి పోతుందనే భయంతో రాములు అనే రైతు నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు.
దీంతో ఈ ఎనిమిది గ్రామాలకు చెందిన రైతులు ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ఆందోళనలకు దిగారు. భారీ ర్యాలీగా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. కామారెడ్డి నూతన మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కలెక్టర్ బయటకు రాకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి రైతుల ఆందోళనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇండస్ట్రియల్ జోన్‌పై ఆందోళన చేస్తున్న రైతుల సమస్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మాస్టర్ ప్లాన్ సమస్య ఎందుకు వచ్చిందని మున్సిపల్ కమిషనర్ ను కేటీఆర్ ప్రశ్నించారు. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ స్టేజ్ లో ఉందని ప్రజలకు ఎందుకు చెప్పలేకపోయారని మున్సిపల్ కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు ఈ ప్రభుత్వం లేదని అన్నారు. నగరాలను అభివృద్ధి చేసేందుకే మాస్టర్ ప్లాన్ అని చెప్పారు. రైతులు మాత్రం తాడోపేడో తేల్చుకోవాలనే పట్టుదలతో ఆందోళన కొనసాగిస్తున్నారు.