ఈ మాణిక్ ఏం మాయ చేస్తాడో?

By KTV Telugu On 6 January, 2023
image

తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పేరు చెబితేనే సీనియర్లు గుర్రుమంటున్నారు. నిన్నటి దాకా రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా ఉన్న ఠాగూర్ కు రేవంత్ పై రకరకాల ఫిర్యాదులూ చేశారు సీనియర్లు. అయితే ఠాగూర్ మాత్రం రేవంత్ ను గారాబం చేస్తూ తమని పట్టించుకోవడం లేదని సీనియర్లకు మండుకొచ్చింది. అంతే హైకమాండ్ దూతగా వచ్చిన దిగ్విజయ్ సింగ్ చెవిలో ఊదాల్సింది ఊదేశారు. తెలంగాణాలో పర్యటించి సైలెంట్ గా వెళ్లిపోయిన దిగ్విజయ్ హై కమాండ్ కు ఏం చెప్పారో ఏమో కానీ ఠాగూర్ కు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చేసింది. ఠాగూర్ స్థానంలో రానున్న ఠాక్రే ఏం మ్యాజిక్ చేస్తారన్నదే ఇపుడు పార్టీలో ఆసక్తిగా మారింది.

తెలంగాణా కాంగ్రెస్ లో మరమ్మతు పనులు ఎందాకా వచ్చాయి? పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికీ పార్టీలోని ప్రముఖ సీనియర్లకీ మధ్య నెలకొన్న అగాధాన్ని ఎవరైనా పూడ్చగలరా అసలు? ఎన్నికల ఏడాదిలో కాంగ్రెస్ లో అల్లరి బాగా పెరిగిపోయిందని పార్టీ అధిష్ఠానం మా చెడ్డ చికాగ్గా ఉంది. అల్లరి చేసిన వారిపై యాక్షన్ తప్పదని హై కమాండ్ కళ్లెర్రజేసి వార్నింగ్ ఇస్తే అల్లరి మానలేదు సరికదా ఒక్కసారిగా నేతలంతా నవ్వేసి తర్వాత ఏంటి? అన్నట్లు చూశారని రాజకీయ పండితులు అంటున్నారు. ఒక పక్క ఎన్నికలు తరుముకు వస్తున్నాయి. ఈ ఏడాది నవంబరు డిసెంబరు నెలల్లో తెలంగాణకు ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. తెలంగాణా ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ను గత రెండు ఎన్నికల్లోనూ తెలంగాణ ప్రజలు అందలం ఎక్కించలేదు. వచ్చే ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి రాలేకపోతే ఇక తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అయిపోవడం ఖాయం అంటున్నారు రాజకీయ పండితులు.

వచ్చే ఎన్నికలు కాంగ్రెస్ కు యాసిడ్ టెస్ట్ లాంటిదే . కచ్చితంగా గెలవాల్సిన ఎన్నికలవి. అందుకే పార్టీ హై కమాండ్ తెలంగాణాలో సర్వశక్తులూ ఒడ్డి పోరాడాలని తలపోస్తోంది. తెలంగాణా పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించిన క్షణం నుంచే పార్టీలో అసమ్మతి పెరిగిపోయింది. రేవంత్ నియామకాన్ని చాలా మంది సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలో ఎందరో సీనియర్లు ఉండగా టిడిపి నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి కీలక పదవి ఇవ్వడం ఏంటని వారు మండిపడుతున్నారు. ఇక అప్పట్నుంచీ రేవంత్ రెడ్డి రైట్ అంటే అసమ్మతి సీనియర్లు లెఫ్ట్ అంటున్నారు.
ఎన్నికల ఏడాదిలో ఈ తలనొప్పేంట్రా భగమంతుడా అనుకున్న పార్టీ హై కమాండ్ తెలంగాణాలో పార్టీని రిపేర్ చేసి రమ్మనమని తమిళనాడుకు చెందిన మాణిక్యం ఠాగూర్ ను పంపింది. ఆయన వచ్చి పార్టీలో అందరి అభిప్రాయాలనూ ఓపిగ్గా సేకరించారు. కొద్ది రోజుల తర్వాత పార్టీలోని సీనియర్లంతా కూడా మాణిక్యం ఠాగూర్ పై హై కమాండ్ కు ఫిర్యాదు చేశారు. ఈయన మాకు పూచిక పుల్ల విలువ కూడా ఇవ్వడం లేదు. మా మాట వినడం లేదు. రేవంత్ రెడ్డి ఏం చెబితే అది చేస్తున్నాడు ఈయనతో మేం పనిచేయలేం అని అధిష్టానానికి కూల్ గా విన్నవించుకున్నారు.

దీంతో టెన్ జన్ పథ్ కొత్త ఆలోచన చేసింది పార్టీలో అత్యంత సీనియర్ కార్యదక్షుడు అయిన దిగ్విజయ్ సింగ్ ను పిలిచి ఆ తెలంగాణా కాంగ్రెస్ లో ఏదో లొల్లి జరుగుతోంది ఓ సారి అటు పోయి దాన్ని సద్దుమణిగేలా చేసి రండి అని మిషన్ అప్పగించారు. హైకమాండ్ చెప్పిన వెంటనే సూట్ కేసు సద్దుకుని దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ వచ్చారు. ఆయన వచ్చిన రోజునే ఆయన మకాం చేసిన హోటల్ కు కొందరు నేతలు విడి విడిగా పోయి తమ మనసులో ఉన్న మాటలను ఆయన చెవిలో కుక్కేశారు. ఆ తర్వాత గాంధీ భవన్ వెళ్లిన దిగ్విజయ్ సింగ్ భిన్న వర్గాల వాదనలు అభ్యంతరాలు సలహాలు సూచనలు అన్నింటినీ ఓపిగ్గా విన్నారు. ఎన్నికల ఏడాదిలో తెలంగాణ కాంగ్రెస్ పుంజుకోవాలంటే ఏం చేయాలో ఓ నివేదిక రూపొందించి హైకమాండ్ చేతుల్లో పెట్టారు. ఆయన అధిష్ఠానానికి ఏం చెప్పారో తెలీదు కానీ ఆయన హస్తిన వెళ్లిన తర్వాత మాణిక్యం ఠాగూర్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీని డిసెంబరు 19న కలిశారు. రాహుల్ కు చెప్పాల్సింది చెప్పారు. రాహుల్ కూడా ఠాగూర్ కు చెప్పాల్సింది చెప్పారు. అక్కడ్నుంచి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జన ఖర్గేని కలిసిన ఠాగూర్ రాహుల్ ను కలిసి తాను చెప్పిన విషయాలు రాహుల్ చెప్పమన్న విషయాలను ఖర్గే చెవిలో ఊదారు.

అంతా సావధానంగా విన్న ఖర్గే చాలా కూల్ గా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా ఉన్న మాణిక్యం ఠాగూరు ను గోవాకు బదలీ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలతో వేడెక్కిపోయి ముచ్చెమటలు పట్టిన ఠాగూర్ కాస్త చల్లగా సేద తీరుతారని కాబోలు సాగర తీరం ఉండే గోవాకు పంపారు. మాణిక్యం ఠాగూర్ స్థానంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను చక్కదిద్దడానికి మహారాష్ట్ర కు చెందిన మాణిక్ రావు థాక్రేను నియమించింది పార్టీ హై కమాండ్. మాణిక్ రావు ఠాక్రే వచ్చి టి కాంగ్రెస్ ను రిపేర్ చేయాల్సి ఉంది. అయితే మాణిక్యం ఠాగూర్ రాహుల్ గాంధీతో పాటు ఖర్గేకి ఏం చెప్పి ఉంటారన్నది ఆసక్తిగా మారింది. పార్టీలోని విశ్వసనీయ వర్గాల భోగట్టా ప్రకారం పార్టీలోని సీనియర్లు జూనియర్లు కూడా రెండు గ్రూపులుగా విడిపోయి ఉన్నారని ఠాగూర్ పేర్కొన్నారట. ఆ విభజన కూడా ఒక్క అంశంపైనే అని ఠాగూర్ వివరించారట. వచ్చే ఎన్నికల్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారధ్యంలోని భారత రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకోవాలన్నది ఒక వర్గం డిమాండ్. దీనికి రెండో వర్గం ససేమిరా అంటోందట.

2014లో కెసిఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మించి మోసం చేశారని అటువంటి నాయకునితో పొత్తేంటని రెండో వర్గం వాదిస్తోందట. ఇద్దరినీ శాంత పరచి ఒక్కతాటిపైకె తెద్దామని తానెంతగా ప్రయత్నించినా రెండు వర్గాలూ రాజీకి రాలేదన్నది ఠాగూర్ ఆక్రోశం. కాంగ్రెస్ పార్టీకి కొత్త అయిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కల్చర్ పై అవగాహన పెంచాలన్న సదుద్దేశంతో తాను రేవంత్ కు కాంగ్రెస్ సంస్కృతి గురించి వివరించడానికి చూస్తే పార్టీలోని సీనియర్లు దాన్ని అపార్ధం చేసుకుని తాను రేవంత్ కు ఏకపక్షంగా మద్దతునిస్తూ మిగతా సీనియర్లను పక్కన పెట్టేశానని అనకున్నారని ఠాగూర్ భోరుమన్నారట. తనపై వారికి విశ్వాసం, నమ్మకం లేనపుడు నేను వారితో ఎలా కలిసి పనిచేయగలనని ప్రశ్నించిన ఠాగూర్ తనంతట తానుగా తెలంగాణా వ్యవహారాల నుండి తనను తప్పించాలని ఖర్గేకు మొరపెట్టుకున్నారని వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఠాగూరు ను తప్పించి థాక్రేకు బాధ్యత అప్పగించారు. మరి థాక్రే ఈ ఆపరేషన్ లో ఎంత వరకు సక్సెస్ అవుతారన్నది కోటి డాలర్ల ప్రశ్న.

ఈ మధ్యనే రేవంత్ రెడ్డి, మాణిక్యం ఠాగూర్ కలిసి తెలంగాణా కాంగ్రెస్ కార్యవర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున కమిటీలను నియమించారు. ఆ ప్రక్రియలో రేవంత్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించి సీనియర్లను పూర్తిగా పక్కన పెట్టేశారని విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీని ఎన్నికల సమయానికి బలోపేతం చేసే క్రమంలో భాగంగా పాదయాత్రలు నిర్వహిస్తే బాగుంటుందని నేతలు భావించారు. 2004 ఎన్నికలకు ఏడాది ముందు 2003 ఏప్రిల్ లో అప్పటి కాంగ్రెస్ అగ్రనేత దివంగత వై.ఎస్.రాజశేఖర రెడ్డి చేపట్టిన పాదయాత్ర పార్టీకి దిశానిర్దేశనం చేసిందని పార్టీ క్యాడర్ కు ఊపునిచ్చిందని పార్టీ నేతలు గుర్తు చేసుకున్నారు. పార్టీ నేతల భేటీలో తనకు సీనియర్లు సహకరించడం లేదని రేవంత్ రెడ్డి పరోక్షంగా ఆరోపించారు. దానికి సిఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క దీటుగా బదులిచ్చారు.
వై.ఎస్.ఆర్. పాదయాత్రలో పార్టీలోని కీలక నేతలంతా పాల్గొన్నామని భట్టి గుర్తు చేస్తూ అప్పట్లో వై.ఎస్.ఆర్. పార్టీలోని అన్ని వర్గాల నేతలనూ కలుపుకుపోయేలా వ్యవహరించారని అన్నారు. అది రేవంత్ రెడ్డికి చురక అంటించేందుకే అన్నది పార్టీ వర్గాల భావన.

రేవంత్ రెడ్డి పార్టీలో సీనియర్లను కలుపుకుపోకుండా ఒంటెత్తు పోకడలతో ముందుకు పోతున్నారని భట్టి పరోక్షంగా దెప్పి పొడిచారు. రేవంత్ రెడ్డి ఇప్పటికీ టిడిపి మనిషేనని ఆయన ఇప్పటికీ చంద్రబాబు కనుసన్నల్లో పనిచేస్తున్నారన్నది కాంగ్రెస్ లో రేవంత్ ప్రత్యర్ధుల ఫిర్యాదు. దానికి చెక్ చెప్పేందుకే కావచ్చు రేవంత్ రెడ్డి మొన్నటి సభలో మాట్లాడుతూ నాడు వై.ఎస్.ఆర్. పాదయాత్ర ప్రభంజనంతో చంద్రబాబును ఢీకొని ఘన విజయం సాధించారని ఇపుడు కాంగ్రెస్ అదే స్ఫూర్తితో పోరాడితే చంద్రశేఖరరావును ఓడించడం ఏమాత్రం కష్టం కాదని రేవంత్ అన్నారు. దీని ద్వారా తాను చంద్రబాబును కూడా ఎటాక్ చేశానని చాటి చెప్పుకున్నారు రేవంత్ రెడ్డి. అయితే పార్టీలో బి.ఆర్.ఎస్. తో పొత్తు పెట్టుకోవాలని తహ తహ లాడుతోన్న వారెవరన్నది చర్చనీయాంశమవుతోంది. కాంగ్రెస్ పార్టీ కష్టపడితే అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న తరుణంలో బి.ఆర్.ఎస్. తో పొత్తు పెట్టుకోవాలని సూచించిన సీనియర్లు కాంగ్రెస్ కోవర్టులని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కెసిఆర్ పార్టీ పట్ల జనంలో వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని కెసిఆర్ తపించడంలో అర్ధం ఉంది కానీ కెసిఆర్ కు లబ్ధి చేకూర్చేందుకు కాంగ్రెస్ ఎందుకు ప్రయత్నించాలన్నది రేవంత్ వర్గం వాదనగా చెబుతున్నారు. కాంగ్రెస్ హయాంలో కీలక మంత్రి పదవులు అనుభవించిన సీనియర్లే ఇపుడు కెసిఆర్ పాట పాడటం దుర్మార్గం అంటున్నారు వారు.

కాంగ్రెస్ పార్టీలోని ఈ అంతర్గత కుమ్ములాటలను బిజెపి నాయకత్వం తన్మయత్వంతో చూసి మురిసిపోతోంది. కాంగ్రెస్ లో ఇటువంటి గొడవలు రోజుకు ఆరు జరిగితే మంచిదని దేవుణ్ని కోరుకుంటోంది కూడా. ఎందుకంటే కాంగ్రెస్ కు నష్టం జరిగితే అది బిజెపి లాభం అవుతుంది. తెలంగాణాలో చెప్పుకోదగ్గ క్యాడర్ లేని బిజెపికి ఎంత లాభం వచ్చినా ముఖ్యమే. బి.ఆర్.ఎస్. కు ప్రత్యామ్నాయం బిజెపియేనని చాటి చెప్పాలన్నది కమలనాథుల లక్ష్యం. సరిగ్గా ఈ తరునంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు తమతో తామే యుద్ధం చేసుకుంటూ ఉంటే బిజెపి చాలా ఆనందంగా యాక్షన్ మూవీ చూస్తున్నట్లు అనుభూతి పొందుతోంది. ఇపుడు థాక్రే కాంగ్రెస్ లోని ఈ రుగ్మతనే నయం చేయాల్సి ఉంది. రోగానికి సరియైన మందు ఏదో థాక్రేకు తెలుసా లేదా అన్నది క్వశ్చన్. కొందరేమంటారంటే కాంగ్రెస్ లోని ఇటువంటి రోగాలకు అసలు మందే లేదని వారంటున్నారు. ఎవరొచ్చినా కాంగ్రెస్ పార్టీ తలరాతను మార్చలేరని వారంటున్నారు. అందుకే ఏ మాణిక్యం అయితేనేంటి? అని కాంగ్రెస్ వాదులు కూసింత నిరాశగనే నిలదీస్తున్నారు.