మింగేస్తోన్న టెక్నాలజీ.. కొత్త నీరొచ్చి పాత నీటికి కొట్టేస్తుంది.

By KTV Telugu On 6 January, 2023
image

కొత్త టెక్నాలజీ వచ్చి పాత అందాలను మింగేస్తుంది. కొత్త సదుపాయాలు వస్తే పాత అనుభూతులు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఒకటి పొందాలంటే మరోటి కోల్పోవాలి. ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక రంగంలో వస్తోన్న విప్లవాత్మక మార్పులు కొత్త కొత్త ఆవిష్కరణలను తెస్తున్నాయి. వాటిని చూసి సంతోషించాలో వాటి వల్ల కోల్పోయే వాటిని తలచుకుని కుమిలిపోవాలో అర్ధంకాని పరిస్థితి. ఒక్కటి మాత్రం నిజం పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు ఇపుడు వస్తోన్న కొత్త టెక్నాలజీలు మానవ సంబంధాలకు ఎసరు పెట్టేస్తున్నాయి. మనుషుల మధ్య మాటల్లేవు. మాట్లాడుకోవడాల్లేవు. ఒకరినొకరు పలకరించుకోవడాలు లేవు. ఆప్యాయంగా చూసుకోవడాల్లేవు. అనుబంధాలు లేవు. అరచేతిలో వైకుంఠంలా స్మార్ట్ ఫోన్లు మానవ సంబంధాలను మాయం చేసేస్తోంటే ఇతరత్రా టెక్నాలజీలు మనిషికీ మనిషికీ మధ్య దూరాన్ని మరింతగా పెంచేస్తున్నాయి.

మాయదారి సెల్ ఫోన్లు వచ్చాక జీవన సరళి మారిపోయింది. అందులోనూ ఆండ్రాయిడ్ ఫోన్లు, ఫోర్ జీ ఫోన్లు వచ్చాక మరీనూ. ఒకప్పుడు ఇంటిలో అందరూ హాయిగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేసేవారు. ఇపుడు కబుర్లు లేవు. రోబోల మాదిరిగా ఎవరి అన్నాలు వారివి. ఎవరి ఫోన్లు వారివి. ఎవరి చాటింగులు వారివి. ఎవరి పలకరింపులు వారివి.
వాట్సాప్ లో వచ్చే వీడియోలను చూసి మురిసిపోవడం. అవతలి మనిషితో పిచ్చిగా చాటింగులు చేసి తరించిపోవడం.
పక్కనే ఉన్న బంధువులను పట్టించుకోరు. భార్యా పిల్లలతో మాట్లాడే తీరికే ఉండదు. అన్నీ ఫోన్ వైపు చూస్తూ మాట్లాడ్డమే.
వాట్సప్ లు వచ్చాక మనుషుల మధ్య బంధు మిత్రుల మధ్య దూరాలు బాగా పెరిగిపోయాయి.ఇది వరకు ఏదన్నా శుభకార్యం ఉంటే ఊళ్లో అందరి ఇళ్లకూ వెళ్లి వారిని రమ్మనమని బొట్టు పెట్టి మరీ పిలిచేవారు. బంధువులు కాకపోయినా అన్నయ్యగారూ, అక్కయ్యగారూ.. పిన్నిగారూ.. మావయ్యగారూ అంటూ వరసలు కలిపేసి బంధుత్వాలు కుదిర్చేసుకుని ఆప్యాయంగా ఆహ్వనించేవారు. ఇపుడు సొంత బంధువులను కూడా ఇళ్లకు వెళ్లి పిలవడం లేదు. పెళ్లో,గృహప్రవేశమో ఉంటే వాట్సాప్ లోనే ఓ మెసేజ్ పెట్టేసి ఊరుకుంటున్నారు.

కనీసం ఫోన్ చేసి అయినా ఫలానా మెసేజ్ పెట్టాం తప్పకుండా రండి అని పిలవడాలు కూడా లేవు. మెసేజ్ చూసుకుంటే వస్తాడు. లేకపోతే లేదు. రాకపోయినా ఫర్వాలేదు. అన్నట్లుగా తయారైంది వ్యవహారం. మరి కొద్ది రోజుల తర్వాత బహుశా అవతలి బంధువులు కూడా వాట్సాప్ లో శుభలేఖ చూసి వాట్సాప్ లోనే ఆశీస్సులు పంపేస్తారేమో. కొత్తగా పెళ్లయిన దంపతులు ఒకరినొకరు అర్ధం చేసుకోడానికి తొలి రాత్రి మనసు విప్పి మాట్లాడుకునే వారు. ఇపుడు హైటెక్ యుగం. పెళ్లి చూపుల తర్వాతనుంచి చాటింగులే కబుర్లు. శోభనం రాత్రి వేళ కూడా ఎవరి ఫోన్లు వారివి ఎవరి కబుర్లు వారివి. జీవితాలు చాలా యాంత్రికంగా సాగిపోతున్నాయి. అంతే భయంకరంగానూ సాగిపోతున్నాయి. ఒకప్పుడు రైతులు తెల్లవారు జామున చీకట్లో లేచి పొలాలకు వెళ్లి మోటార్లు ఆన్ చేసుకుని వచ్చేవారు. ఎంత చలి అయినా వర్షం పడ్డా అది తప్పని సరి అయ్యేది. ఇపుడు రైతులూ సెల్ ఊబిలో పడిపోయారు. ఇంట్లో ఉండే సెల్ లో ఓ నంబర్ కు రింగ్ చేస్తే చాలు పొలంలో మోటార్ ఆన్ అయిపోతుంది. దాన్ని ఆఫ్ చేయడం కూడా ఫోనుతోనే. దానికీ మరో పద్ధతి ఉంది. దీని వల్ల రైతులకు బోలెడు మేలు జరిగి ఉండచ్చు. కానీ తెల తెల్లవారు జామున మంచు కురిసే వేళ రైతులకు పొలం వెళ్లడం అంటే అదో మధురమైన అనుభూతి మిగిలేది. ఇపుడా ఆనందాలు లేవు.

దాని బదులు ఇంట్లో మరో గంట సేపు ఎక్కువ పడుక్కునే వెసులు బాటు వచ్చింది. టెక్నాలజీ వల్ల లాభమా? నష్టమా ? అంటే రెండూనూ అని చెప్పక తప్పదు. కొత్త సుఖాలు వస్తే పాత అందాలు పోతాయంతే. ఏదన్నా ఊరు వెళ్లాల్సి వస్తే ఇంటికి నాలుగైదు తాళాలు వేసి చుట్టుపక్కల ఉన్నవారికి ఒకటికి పది సార్లు మా ఇంటివైపు ఓ లుక్ వేసి ఉంచండి అని చెప్పి వెళ్లేవారు. ఇపుడు డిజిటల్ సెక్యూరిటీ సదుపాయాలు వచ్చేశాయి. ఇళ్లల్లో రక రకాల కెమెరాలు పెట్టేస్తున్నారు. ఆ కెమెరాలు యజమాని సెల్ ఫోన్ కు అనుసంధానమై ఉంటాయి. ఫోన్ లో చూస్తే ఇంట్లో ఏంజరుగుతోందో తెలిసిపోతుంది. అవసరం అయితే ఇంట్లొ లైట్లు ఆన్ చేయాలన్నా ఆఫ్ చేయాలన్నా కూడా ఎక్కడో ఊళ్లో ఉండి కూడా ఫోన్ తో ఆపరేట్ చేసేసే వెసులు బాటు వచ్చేసింది. ఒకప్పుడు వినోదానికి తోలుబొమ్మలాటలుండేవి. ఆ తర్వాత నాటకాలు వచ్చి తోలుబొమ్మలను తన్నేశాయి. సినిమాలు వచ్చి నాటకాలను తన్నేశాయి. టీవీలు వచ్చి సినిమాలను తన్నేశాయి. ఓటీటీలు వచ్చి టీవీ ఛానెళ్లను తన్నేశాయి. కంప్యూటర్లు వచ్చి టైప్ రైటర్లను మింగేశాయి. రెడీ మేడ్ బట్టల షాపులు వచ్చి టైలర్ల పొట్ట కొట్టాయి. విద్యుద్దీపాలు వచ్చి కిరోసిన్ దీపాలు మాయం అయ్యాయి.
ఫ్రిడ్జిలు వచ్చి కడవలను మాయం చేశాయి. కార్లు వచ్చి ఎడ్ల బళ్లను మాయం చేశాయి. టేప్ రికార్డర్లు వచ్చి గ్రామ్ ఫోన్ రికార్డులను మాయం చేశాయి. సీడీలు వచ్చి టేప్ రికార్డర్లను తినేశాయి. ఇపుడు డిజిటల్ చిప్ లు వచ్చి సీడీ ప్లేయర్లను చావు దెబ్బతీశాయి.

కొత్త ఒక వింత పాత ఒక రోత అన్నట్లు కొత్త టెక్నాలజీ రావడం ఆలస్యం జనం దానివైపు ఆకర్షితులైపోతున్నారు. అంతవరకు ఉన్న టెక్నాలజీకి ఏ మాత్రం ఉద్వేగాలు లేకుండా గుడ్ బై చెప్పేస్తున్నారు. ఊళ్లల్లో రక రకాల ఆటలు ఉండేవి. వీడియో గేమ్స్ వచ్చాక భౌతికంగా ఆడే ఆటలు మాయం అయిపోతున్నాయి. ఫోన్లు కేవలం మాట్లాడుకోడానికి పరిమితం కావడంలేదు. ఫోన్లోనే సినిమాలు చూసేస్తున్నారు. వీడియో కాల్స్ పుణ్యమా అని అమెరికాలో ఉన్న అబ్బాయితో ఇండియాలో ఉన్న తల్లిదండ్రులు మాట్లాడేసుకుంటున్నారు. వీడియో ఫోన్లు ఉన్నాయి కదా ఎలాగూ చూసుకుంటున్నాం కదా అని పిల్లలు తల్లిదండ్రులను వదిలేస్తున్నారు. ఎప్పుడన్నా గుర్తుకు వస్తే వీడియో కాల్ చేసి చూస్తున్నారు. అంతే తప్పా ఒకప్పటిలా ఆప్యాయంగా మాట్లాడుకోవడాలు లేవిపుడు. తల్లిదండ్రులు తిన్నారా పన్నారా అని ఆరా తీసే తీరిక కూడా లేని యాంత్రిక యుగం అయిపోయింది.

కాశీ మజిలీ కథల కాలం కాదిది. అప్పట్లో కాశీ వెళ్తే కాటికి వెళ్లినట్లే అనుకునేవారు. కాశీ వెళ్లేవాళ్లు మళ్లీ తిరిగొస్తామో లేదోనని వీలునామాలు రాసి మరీ పోయేవారు. ఆస్తులు పంచి ఇచ్చేస్తే ఓ పని అయిపోయిందని అనుకునేవారు. ఇపుడు డబ్బులు ఉండాలే కానీ ఎక్కడినుంచి ఎక్కడికైనా ఇలా వెళ్లి ఆలా వచ్చేసే వెసులుబాటు ఉంది. ఎంత వేగంగా వెళ్తున్నారో అంతే వేగంగా గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చేస్తున్నారు. కొత్త టొక్నాలజీ కొత్త కొత్త ఔషధాలను తెచ్చింది. ఒకప్పుడు జ్వరం జలుబు చేస్తే మిరియాల కషాయమో శొంఠికషయామో తాగితే క్షణాల్లో నయం అయిపోయేది. ఇపుడు ప్రతీ దానికీ ఓ గోలీ వచ్చేసింది. నాన్నమ్మల కాలం నాటి దిబ్బరొట్లు ఈ తరానికి నచ్చడం లేదు. ఆరోగ్యాన్ని దెబ్బతీసే పిజ్జాలు, బర్గర్లు లొట్టలేసుకుని తినేసి ఒల్లు గుల్ల చేసుకుంటున్నారు. ఏ రోగానికైనా మందు ఉందిపుడు. ఏదైనా నయం చేసేసే కార్పొరేట్ ఆసుపత్రులు వచ్చేశాయి. ఎంత వేగంగా జీవితం నడుస్తోందో అంతే వేగంగా బకెట్ తన్నేసే సదుపాయమూ వచ్చి చచ్చింది. చందమామను చుట్టేస్తున్నారు. చంద్రుడి నుదిటిపై నీటి జాడ ఉందో లేదో చూసి చెప్పేస్తున్నారు. అంగారకుడిపైకి యంత్రాలు పంపేసి నిఘా పెట్టేశారు. రేపో మాపో సూర్యుడిపైకీ రాకెట్ పంపేస్తాం అంటున్నారు. అంతా వేగమే. అంతా దూకుడే.

ఇంత వేగంలో పడిపోయాక జాబిలి చల్లదనాన్ని అనుభవించడం చేత కావడం లేదు. వెన్నెల హాయిని అనుభవించే తెలివిలేకుండా పోయింది. వెండికొండల్లాంటి మబ్బులు ఆకాశంలో ఊరేగింపుగా నెమ్మదిగా కదులుతూ ఉంటే ఆ అందాన్ని చూసి మైమరచిపోయే అనుభూతులను సొంతం చేసుకోవడం ఎవరికీ రావడం లేదు. తొలకరి చినుకులు పడినపుడు భూమిలో దాగిన విత్తనం నుండి ఆకుపచ్చ మొలకలు వినయం నిండిన పెళ్లికూతురులా తల దించుకుని ఈ లోకంలోకి రావడాన్ని చూడలేకపోతున్నాం. తెల తెల్లవారు జామున తూరుపు దిక్కున సూర్యుడు దర్జాగా వెలిగిపోతూ వస్తూ ఉంటే సింధూరపువ్వులా మారిపోయిన ఆకాశపు అందాన్ని ఆస్వాదించే అదృష్టం ఈతరం జనాలకు అర్ధం కావడం లేదు. ఎంత సేపూ టెక్నాలజీని పట్టుకుని ఊరేగుతున్నారు. అదే లోకం అనుకుంటున్నారు. అదే జీవితం అనుకుంటున్నారు. ఆ ధ్యాసలో ప్రతీ మనిషీ ఓ రోబో అయిపోతున్నాడు. మరమనిషి అయిపోయాక మానవత్వాన్ని చేజార్చుకుంటున్నాడు. ప్రేమ ఆప్యాయతలను కోల్పోతున్నాడు. టెక్నాలజీ తెస్తోన్న విధ్వంసాన్ని ఎవరైనా ఆపితే బాగుండును అని మేథావులు అంటున్నారు. అయితే ఎవరాపగలరు? యంత్రాల్లా మారిపోయిన మనుషులకు మనిషిగా మారాలన్న మనసు రావాలి కదా. అది వస్తుందా అని?