ఊరంత నోరున్న సోమువీర్రాజు ఎందుకో దాన్ని కుట్టేసుకున్నారు. పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు తీవ్రవ్యాఖ్యలుచేసినా ఢిల్లీ పెద్దలెందుకో పట్టించుకోలేదు. దీంతో ఏపీ బీజేపీలో ఏం జరుగుతోందని పార్టీ కార్యకర్తుల చర్చించుకుంటున్నారు. కొందరు బీజేపీ జిల్లా అధ్యక్షులను మార్చటంతో సోమువీర్రాజుపై కన్నా లక్ష్మినారాయణ మాటలతో విరుచుకుపడ్డారు. కోర్ కమిటీలో చర్చించకుండా ఎలా నిర్ణయం తీసుకుంటాని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిన నిలదీశారు. తన హయాంలో నియమించిన వారిని సోమువీర్రాజు తొలగించటంతో కన్నా కోపం నషాళానికంటింది. పార్టీలో ఏం జరుగుతున్నా తనకు సమాచారం లేదని ఆగ్రహించారు. తాను పార్టీలోకి తెచ్చిన నేతలు ఎందుకు వెళ్లిపోతున్నారో చెప్పాలని సోమువీర్రాజును నిలదీశారు.
సోమువీర్రాజుపై గతంలో కూడా కన్నా లక్ష్మినారాయణ బహిరంగంగానే అసంతృప్తి బయటపెట్టారు. పవన్‌కళ్యాణ్‌ని సమన్వయం చేసుకోవడంలో సోమువీర్రాజు విఫలమయ్యారని ఆరోపించారు. ఇప్పుడు మరోసారి ఆయన ఒంటికాలిమీద లేచినా సోమువీర్రాజు నోరుతెరిచే పరిస్థితి లేదు. అధిష్ఠానం వద్దన్నదో తెగేదాకా లాగడం ఎందుకని సోమువీర్రాజే అనుకుంటున్నారోగానీ కన్నాకు కౌంటర్ ఇవ్వలేదు. అయితే కన్నా వ్యాఖ్యలను తేలిగ్గా తీసుకుంటే రేపు మరొకరు ఇలాగే మాట్లాడాతారన్న భయం సోమువీర్రాజులో ఉంది. కానీ ఏపీ బీజేపీలో ఇప్పుడంతా వలస నేతల హవానే నడుస్తోంది. వాళ్లంతా టీడీపీ అనుకూల ఎజెండాతో పనిచేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
కన్నా లక్ష్మినారాయణ కొన్నాళ్లుగా కాపు సమీకరణాల చుట్టూ తిరుగుతున్నారు. ఆయనతో జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఈమధ్య భేటీకావటం ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీలో భవిష్యత్ లేదన్న ఆలోచనతో ఉన్న కన్నా లక్ష్మినారాయణ జనసేనలో చేరొచ్చన్న ప్రచారం ఉంది. బీజేపీలో అసంతృప్తి ఉన్నా ఆయన రాజీనామా చేయలేదు. పార్టీలో ఉంటూనే విమర్శలకు పదునుపెడుతున్నారు. పార్టీ ఏదన్నా యాక్షన్ తీసుకుంటే దుమ్ము దులిపి నాలుగు చీవాట్లు పెట్టి బయటికొద్దామన్న ప్లాన్‌తో ఆయన ఉన్నట్లు కనిపిస్తోంది. సోమువీర్రాజుకు వ్యతిరేకంగా రాష్ట్రంలో తన వర్గాన్ని దువ్వుతున్నారు. సోమువీర్రాజుపై ప్రత్యక్ష విమర్శలు చేస్తున్నారు. ఏదోలా కట్టడిచేయకపోతే తనకు గౌరవం ఉండదని వీర్రాజు టెన్షన్ పడుతున్నారు. మరి కన్నా ఎపిసోడ్‌కి బీజేపీ ఎలాంటి ముగింపు ఇస్తుందో చూడాలి.