ఏపీకి అప్పు పుట్టకూడదా..ఇదేం పని ఎంపీగారూ

By KTV Telugu On 6 January, 2023
image

అప్పులేంది ఎవరికి? అన్ని రాష్ట్రాలకూ అప్పులున్నాయి. ఆ మధ్య కేంద్రం ప్రకటించిన చిట్టాపద్దుల్లో ఎవరూ అప్పుల్లో తగ్గడం లేదన్న విషయం తెలిసిపోయింది. అంతెందుకు లక్షలకోట్ల ఆదాయమార్గాలున్న కేంద్రం చేయడంలేదా తప్పుదు తెచ్చుకుంటుంటాం మళ్లీ తీరుస్తుంటాం. అందులో రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఎంతగా నష్టపోయిందో అందరికీ తెలుసు. ఆదాయవనరులున్న హైదరాబాద్‌ చేజారిపోయింది. విభజన హామీలు నెరవేరక రెండురాష్ట్రాల మధ్య పెండింగ్‌ అంశాలు కొలిక్కిరాక ఏపీ ఆర్థికంగా నష్టపోతూనే ఉంది. ఇలాంటి సమయంలో అప్పులొద్దంటే పస్తులుండటమే.
ఏపీ పరిస్థితి తెలిసినా విపక్షాలు రాజకీయం కోసం విమర్శలు చేస్తూనే ఉంటాయి. అప్పులు చేస్తే చివరికి శ్రీలంక పరిస్థితి వస్తుందని దెప్పిపొడుస్తుంటాయి. కానీ ఏం చేస్తే ఆర్థిక సమస్యలు దూరమవుతాయో నిర్మాణాత్మక సూచనలు మాత్రం ఎవరూ చేయరు. ఫ్యాన్‌ సింబల్‌తో గెలిచి వైసీపీకి వెన్నుపోటు పొడుస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా ఆ బ్యాచ్‌తో చేరిపోయారు. అప్పులు చెల్లించలేక ఆంధ్రప్రదేశ్‌ చేబదుళ్లతో నెట్టుకొస్తోందని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో అదనపు రుణాలకు అనుమతిస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సర్వనాశనం కావడం ఖాయమంటూ కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శికి ఏకంగా ఆరు పేజీల లేఖ రాశారు.

2022–23 ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్ నుంచి రూ.46 వేల కోట్ల అప్పు తెచ్చుకోవడానికి ఏపీకి అనుమతి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలు స్పెషల్ పర్పస్ వెహికల్స్ ద్వారా తీసుకున్న రుణం ఇప్పటికే రూ.9,03,436.58 కోట్లకు చేరిందని ఎంపీ లెక్కలు చూపించారు. రాష్ట్ర ప్రభుత్వ వార్షికాదాయం రూ.1.50 లక్షల కోట్లు మాత్రమే ఉందని అప్పులు, వడ్డీల కింద రూ.55 వేల కోట్లు పోతోందని చెబుతున్నారు ఎంపీ. రాష్ట్ర రెవెన్యూ లోటు త్వరలో రూ.50 వేల కోట్లు దాటుతుందని కూడా ఆయనగారు జోస్యం చెబుతున్నారు. జగన్ ప్రభుత్వం చేసే భారీ ఖర్చులు వేరే ఖాతాల్లో చూపించి, రెవెన్యూలోటును దాచిపెట్టడంతో వాస్తవాలేంటో బయటికి రావడంలేదని తన అపరాధపరిశోధనలో కనిపెట్టేశారు నరసాపురం ఎంపీ.

ఆదాయలోటును భర్తీచేసుకునేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు ఎస్పీవీలు, ఇతర మార్గాల్లో 2022 మార్చి 31 నాటికి రూ.2.5 లక్షల కోట్లకు పైగా బడ్జెటేతర రుణాలు తీసుకుందని రఘురామకృష్ణంరాజు కేంద్ర ఆర్థికశాఖ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే పరిమితులకు మించి అప్పు చేసినందున అవన్నీ తీరేదాకా ఏపీకి కొత్త అప్పులకు అవకాశం ఇవ్వొద్దని కేంద్ర ఆర్థికశాఖకు రాసిన లేఖలో కోరారు. రాష్ట్రానికి న్యాయం చేయండని పార్లమెంట్‌లో నోరెత్తలేరు. ఏపీని కష్టాలనుంచి గట్టెక్కించేందుకు ఎంపీగా తనవంతు మాటసాయం చేయలేరు. కానీ అప్పులు ఇవ్వొద్దు చేయనివ్వొద్దంటూ కేంద్రానికి లేఖలు మాత్రం రాస్తారు. ఇదెక్కడి విచిత్రం? ఈదేవాడికే తెలుస్తుంది లోతన్నట్లు ప్రభుత్వంలో ఉన్నవాళ్లకే తెలుస్తాయ్‌ కష్టనష్టాలు. ఒడ్డున ఉండి రాళ్లేస్తే రాష్ట్రానికి నమ్మకద్రోహం చేసినట్లే!