ఈ ఏడాది దక్షిణభారతంలోని కర్ణాటక తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. దాంతో దక్షిణాదిపై బీజేపీ ఫోకస్ చేసింది. ముఖ్యంగా తెలంగాణాలో పాగా వేసేందుకు వ్యూహాలు పన్నుతోంది. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించి అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో దూసుకుపోతోంది. కొన్నిరోజులుగా బీజేపీ అగ్ర నాయకులు తరచుగా తెలంగాణకు వచ్చిపోతున్నారు. పార్టీ జాతీయ స్థాయి కార్యక్రమాలు శిక్షణా తరగుతులు ఇక్కడే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కమలనాథులు మరో సంచలనాత్మక ఎత్తు వేయబోతున్నారని తెలుస్తోంది. తెలంగాణ నుంచి ప్రధాని మోదీ పోటీకి సిద్దమయ్యారని సమాచారం. 2024 ఎన్నికల్లో తెలంగాణ గడ్డ నుంచి లోక్‌సభకు పోటీ చేసేందుకు రంగం సిద్ధమయ్యిందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారంలోకి రావాలనేది బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ నేపథ్యంలో మోదీ తెలంగాణ నుంచి ఎంపీగా బరిలోకి దిగటం ద్వారా బీజేపీలో మరింతగా ఊపు వస్తుందనిa రాజకీయ వాతావరణం బీజేపీకి అనుకూలగా మారుతుందని ఆ పార్టీ అధినాయకత్వం వ్యూహంగా తెలుస్తోంది. తెలంగాణ లో మరో తొమ్మిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తరువాత 2024లో దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతాయి. అసెంబ్లీ ఎన్నికల ముందే ప్రధాని మోదీ తెలంగాణలో పోటీ చేసే విషయంపై బీజేపీ ప్రకటించే అవకాశం ఉంది. అంతకుముందు మోదీ తమిళనాడు నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే తమిళనాడుకంటే తెలంగాణ నుంచి పోటీ చేస్తేనే ఇక్కడ త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు వస్తాయనే అంచనాతో తెలంగాణ నుంచి పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మోదీ పోటీ చేసేందుకు ఏ నియోజకవర్గం అయితే అనువుగా ఉంటుందని ఇప్పటికే రాష్ట్రమంతా సర్వే చేయించి రెండు లోక్ సభ స్థానాలను గుర్తించారట. అన్ని రకాల వడబోత తరువాత రెండు లోక్ సభ స్థానాలను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. అందులో ఒకటి మల్కాజ్ గిరి రెండవది మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీజేపీకి కాస్త ఆదరణ ఉంది. సికింద్రాబాద్ నుంచి ఆ కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేంద్రంలో మంత్రిగా కూడా ఉన్నారు. అందువల్ల మల్కాజ్ గిరిని ఎంపిక చేసుకున్నారు. ఇక్కడి నుంచి పోటీ చేయడం ద్వారా జీహెచ్‌ఎంసీతో పాటు రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలపైన ప్రభావం ఉంటుంది. ఇక మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయటం ద్వారా ఆ ప్రాంతంలో టీఆర్ఎస్ హవాను అడ్డుకోవచ్చని అంచనా వేస్తున్నారు. 2009లో కేసీఆర్ మహబూబ్ నగర్ నుంచే ఎంపీగా గెలుపొందారు. అదే నియోజకవర్గం నుంచి ఇప్పుడు ప్రధాని పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. ఈ విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోకపోయినా ఆ దిశగా బీజేపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ ఎంపీలు మాత్రం ప్రధాని తెలంగాణ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం వారణాశి నుంచి ఎంపీగా ఉన్న ప్రధాని అక్కడ ఏ విధంగా డెవలప్ చేసారో అదే మంత్రం ఇక్కడ ప్రచారం చేస్తే వర్కవుట్ అవుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది. నిజంగా తెలంగాణ నుంచి ప్రధాని మోదీ పోటీ చేయడం ఖాయమైతే వచ్చే తెలంగాణ రాజకీయాలు మరింత ఆసక్తి కరంగా మారతాయని చెప్పవచ్చు.