తెలంగాణకు అడిగిన దాని కన్నా రూ. 3వేల కోట్ల ఎక్కువ అప్పునకు అనుమతి

By KTV Telugu On 7 January, 2023
image

తెలంగాణ ప్రభుత్వానికి చివరి మూడు నెలల్లో కేంద్రం అడిగిన దాని కన్నా ఎక్కువగానే రుణం మంజూరు చేసింది. ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ ఖాతాలో జనవరి ఫిబ్రవరి మార్చినెలల్లో 6,572 కోట్ల రూపాయలు కావాలని కేంద్రానికి తెలంగాణ సర్కార్ ప్రతిపాదన పెట్టింది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం 9,572 కోట్ల రూపాయలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఓ రకంగా ఆర్థిక సమస్యల్లో ఉన్న తెలంగాణ సర్కార్ కు ఈ అప్పు ఊరట కలిగిస్తంది. అయితే ఇంత కాలం అడిగిన దాన్ని కూడా ఇవ్వని కేంద్రం ఇప్పుడు అడగకుండానే దాదాపుగా మూడు వేల కోట్ల అప్పు ఎందుకిచ్చింది ? తెలంగాణ సర్కార్ చేస్తున్న ఆరోపణలతో వెనక్కి తగ్గిందా ? ఇంత కాలం కావాలనే తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన అప్పులను తొక్కి పెట్టిందా ? లేకపోతే రాజకీయ కారణాలున్నాయా ?

2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.53,970 కోట్ల రుణాలు తీసుకోవాలని లక్ష్యంగా బడ్జెట్ ప్రతిపాదనల్లో పెట్టుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం మొదటి నుంచి తెలంగాణ అప్పులపై ఆంక్షలు విధించింది. గతంలో కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రుణాలను కూడా కలపడంతో చివరికి అప్పుల పరిమితి తగ్గిపోయింది. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం రాష్ట్రానికి రూ.39,450 కోట్ల అప్పులు చేసుకునే అవకాశం ఉందని గతంలో కేంద్రం నుంచి సమాచారార వచ్చింది. ఇప్పటివరకు రూ.28,424.88 కోట్ల అప్పులు తీసుకున్నారు. కేంద్రం పెట్టిన పరిమితి మేరకు ఇంకా కేవలం రూ.6,572 కోట్ల అప్పు తీసుకునేందుకు చాన్స్ ఉంది. దీన్నే తెలంగాణ సర్కార్ ఇండెంట్ పెట్టింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా మరో మూడు వేల కోట్ల వరకూ ఎక్కువ అప్పు తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఓపెన్ బార్కెట్ బారోయింగ్ రుణాలు 37,650 మిగతావి పబ్లిక్ డెట్ ఇతర పద్దతుల్లో తీసుకున్నట్లవుతుంది.

అప్పులు దొరకకపోవడం వల్లనే కేంద్రం ఇవ్వాల్సినవి ఇవ్వకపోవడం కనీసం అప్పులు తీసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడం వల్లనే జీతాలు కూడా సక్రమంగా చెల్లించలేకపోతున్నామని ఆర్థిక మంత్రి హరీష్ రావు తరచూ చెబుతూంటారు. కేంద్రం తీరుపై తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంపై తీవ్ర అగరహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ప్రత్యేక అసెంబ్లీ పెట్టి చర్చించాలనుకున్నారు. డిసెంబర్‌లో వారం రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనుకున్నా ఆగిపోయారు. ఇప్పుడు కేంద్రం అడిగిన దాని కన్నా ఎక్కువ రుణ పరిమితి మంజూరు చేసింది. దీంతో తెలంగాణ సర్కార్ కాస్త తేలిక పడే అవకాశం ఉంది.

తాము అప్పులు చేస్తోంది ఉచిత పథకాలకు పంచడానికి కాదని సంపద పెంచడానికేనని కతెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఆ ప్రకారం మూలధన వ్యయం లెక్కలను కూడా చూపిస్తోంది. రాష్ట్ర సంపదను పెంచి తెలంగాణను బలమైన ఆర్థిక శక్తిగా తెలంగాణను నిలుపుతున్నామని చెబుతున్నారు. ఫలితంగా 2014-15వ ఆర్థిక సంవత్సరంలో రూ.11,583 కోట్లుగా ఉన్న రాష్ట్ర మూలధన వ్యయం 2021-22లో రూ.61,343 కోట్లకు చేరింది. అంటే గత ఎనిమిదేళ్లలో తెలంగాణ మూలధన వ్యయం ఐదున్నర రెట్లు పెరిగిందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. అయితే కేంద్రం చెప్పిన అనేక సంస్కరణలను తెలంగాణ ఆమోదించలేదు. కరెంట్ మీటర్లు పెట్టడం మున్సిపాలిటీల్లో ఆస్తిపన్నును ప్రతీ ఏడాది పెంచడం వంటి సంస్కరణలు అమలు చేయకపోవడం వల్ల అప్పుల పరిమితిని తగ్గుతూ వస్తోంది.

కారణం ఏదైనా అనేక ఆర్థిక సమస్యల్లో ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం కొత్తగా ఇచ్చిన అనుమతి మాత్రం ఊరట నిచ్చేదే. ఇది రాజకీయ పరిమామాలతో జరిగిందా లేదా అన్నది మాత్రం క్లారిటీ లేదు. కానీ ఇంత కాలం ఆపడం వల్ల తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పడింది.