ఏపీకి ఎలన్ మస్క్ సహా దిగ్గజ పారిశ్రామిక వేత్తలు?

By KTV Telugu On 7 January, 2023
image

ఏపీ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయి, కొత్తగా పెట్టుబడులు రావడం లేదని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న వేళ వాటికి చెక్ పెట్టేందుకు జగన్ సర్కార్ నయా ప్లాన్‌తో ముందుకెళ్తోంది. ఎన్నికలకు ముందు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ పారిశ్రామికవేత్తలను ఏపీకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చాలనే లక్ష్యంగా జగన్ సర్కార్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో రెండు రోజుల పాటు ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 నిర్వహిస్తోంది. ఈ సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ప్రధాని మోడీతో పాటు 15మంది కేంద్ర మంత్రులు మరో 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులు 44మంది ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామిక వేత్తలు, 53మంది భారతీయ వ్యాపారవేత్తలు వివిధ దేశాల రాయబారులను ఆహ్వానిస్తోంది.

జీఐఎస్ కోసం టెస్లా అధినేత ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ సహా మరికొంతమంది ప్రముఖులకు సీఎం జగన్ ఆహ్వాన పత్రికలు పంపించారు. యాపిల్ సీఈవో టిమ్ కుక్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల ప్రభుత్వ ఆహ్వానితుల జాబితాలో ఉన్నారు. అదేవిధంగా అమెజాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జెఫ్ బెజోస్, సామ్‌సంగ్ ఛైర్మన్, సీఈఓ ఓహ్-హ్యున్ క్వాన్ కూడా ఉన్నారు. ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, ఆనంద్ మహీంద్రా, కుమార్ మంగళం బిర్లా, ఆది గోద్రెజ్, రిషద్ ప్రేమ్‌జీ, ఎన్.చంద్రశేఖరన్ వంటి భారతీయ వ్యాపారవేత్తలు కూడా ఈ కార్యక్రమానికి రానున్నారని తెలుస్తోంది.

విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ తో ఈ ప్రాంతానికి అరుదైన గుర్తింపు తీసుకురావాలని భావిస్తోంది. అదే సమయంలో ప్రత్యర్థుల విమర్శలకు చెక్ పెట్టి వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆదారాభిమానం చూరగొనేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. భవిష్యత్తు కోసం సిద్ధమయ్యే లక్ష్యంతో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించబడుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ సమ్మిట్‌కు హాజరు కావాలని మీ వ్యాపారం అభివృద్ధి చెందేందుకు తమతో కలిసి పనిచేయాలని బిజినెస్‌మెన్‌లకు ఆహ్వానం పలికారు. 2019 మేలో అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ ప్రభుత్వం వివిధ దేశాల నుంచి పెట్టుబడులు కోరుతూ విజయవాడలో దౌత్య కార్యక్రమాలను నిర్వహించింది. ఇప్పుడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా ప్రతి రంగంలో సమృద్ధి పెట్టుబడిదారులకు అనుకూలమైన వ్యాపార వాతావరణాన్ని ప్రకటిస్తూ అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్ ని పెద్ద ఎత్తున ప్రదర్శించాలని కోరుతోంది.

2022లో ఏపీ ప్రభుత్వం రూ. 1,26,750 కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించిందని 2023 మరింత ఎక్కువ మేర పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేలా కృషి చేస్తామన్నారు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. నిర్దిష్ట లక్ష్యమేదీ లేకపోయినా 5 నుంచి 8 లక్షల కోట్ల మధ్య పెట్టుబడులు వచ్చే అవకాశముందని అన్నారాయన. ఈ గ్లోబల్ సమ్మిట్ ప్రచార కార్యక్రమాలను కూడా దేశ విదేశాల్లో ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేచేసింది. జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, అమెరికా, తైవాన్‌లలో రోడ్ షో లు నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. అయితే డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు. భారతదేశంలో సమ్మిట్ రోడ్‌షో జనవరి 10-14 వరకు న్యూఢిల్లీలో ఫిబ్రవరి 3న ముంబైలో నిర్వహించబడుతుంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో ఈవెంట్‌కు తేదీలు ఖరారు కాలేదు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఈవెంట్‌లో బిజినెస్-టు-బిజినెస్ (B2B), గవర్నమెంట్-టు-బిజినెస్ (G2B) సమావేశాలు, గ్లోబల్ లీడర్‌లకు అవకాశాలను ప్రదర్శించడానికి సెక్టార్-నిర్దిష్ట ప్లీనరీ సెషన్‌లు ఉంటాయి.

వ్యవసాయ-ఆహార ప్రాసెసింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వాహనాలు, పారిశ్రామిక, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలు, పెట్రోలియం, పెట్రోకెమికల్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, పునరుత్పాదక ఇంధనం, ఎంఎస్ఎంఈలు, టూరిజం వంటి వాటిపై దృష్టి కేంద్రీకరిస్తోందని అధికారులు చెబుతున్నారు. పారిశ్రామిక అభివృద్ధి విధానంతో పాటు పంప్‌డ్‌ స్టోరేజీ పవర్‌, బల్క్‌ డ్రగ్‌ పార్కులు, రిటైల్‌ పార్కులు, ఎలక్ట్రిక్‌ మొబిలిటీ, పునరుత్పాదక ఇంధన ఎగుమతి, ఎలక్ట్రానిక్స్‌, ఐటీ వంటి రంగాలకు సంబంధించిన ప్రత్యేక విధానాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు.