సన్నాఫ్‌ అమిత్‌షాతో బీసీసీఐ భ్రష్టుపడుతోందా?

By KTV Telugu On 7 January, 2023
image

బీసీసీఐ భ్రష్టుపడుతోంది. క్రీడాస్ఫూర్తి కనిపించాల్సిన చోట ప్రాంతీయాభిమానం రాజ్యమేలుతోంది. అమిత్‌షా కొడుకు జైషా జోక్యం ఎక్కువైపోయింది. సొంత అభిప్రాయాలను బీసీసీఐ మీద రుద్దుతున్నారన్న విమర్శలొస్తున్నాయి. టాలెంట్‌ ఉంటే మారుమూల నిరుపేదనైనా ప్రోత్సహించాలి. కానీ బీసీసీఐలో మనోడైతే చాలు తోసేయ్‌ అన్నట్లుంది ప్రజంట్‌ ట్రెండ్‌. క్రికెట్‌లో ఇంకా క్రీడాస్ఫూర్తి ఎక్కడ తగలడిందని అనుకోవచ్చు. ఎందుకంటే క్రికెట్‌ ఎప్పుడో మనీ గేమ్‌గా మారిపోయింది. క్యాష్‌ అండ్‌ క్రేజ్‌ ఉన్న బీసీసీఐని రాజకీయం ఎప్పుడో కమ్మేసింది.

ఎప్పుడూ బ్యాట్‌ పట్టనోడు ఏ రోజూ బాల్‌ రుద్దనోడు కూడా బీసీసీలో చక్రం తిప్పేస్తుంటాడు. ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా క్రికెట్‌ బోర్డుల్లో రాజకీయనేతల పెత్తనమే ఫైనల్‌. అదృష్టంకొద్దీ మన దక్షిణాది బోర్డులు మరీ అంత చెడిపోలేదు. యూపీఏ సర్కారు హయాంలో శరద్‌పవార్‌ బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు ఏం జరిగిందో దేశమంతా చూసింది. ఆమధ్య చనిపోయిన అరుణ్‌జైట్లీలాంటి నేతలు ఢిల్లీ క్రికెట్‌బోర్డుని తమ కనుసన్నల్లో శాసించారు. కాంగ్రెస్‌ హయాంలో రుగ్మతలకు మందు వేస్తున్నానని చెప్పుకునే బీజేపీ అంతకు భిన్నంగా చేస్తున్నదేమీ లేదు. ఇంకా చెప్పలాంటే బీజేపీ పాలనలో క్రీడాస్ఫూర్తికి రాజకీయం మరిన్ని తూట్లు పొడుస్తోంది.

బీసీసీఐలో ఇప్పుడు చీమచిటుక్కుమనాలన్నా జై షా చిటికె వేయాల్సిందే. మనిషి మామూలుగా కనిపిస్తాడుగానీ బ్యాక్‌గ్రౌండ్‌ పవర్‌ఫుల్‌. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కొడుకు అయ్యేసరికి బీసీసీఐ జై షాకి పాదాక్రాంతం అయిపోయింది. గతంలో బీసీసీఐ కోశాధికారి ఎవరో కూడా బయట పెద్దగా తెలిసేది కాదు. కానీ ఇప్పుడా పోస్టులో ఉన్న జైషానే అందరినీ ఓ ఆట ఆడిస్తున్నారు. సౌరవ్‌గంగూలీని అధ్యక్ష పదవినుంచి తప్పించినప్పుడు జైషా కూడా తప్పుకోవాలి కదా అన్న లాజిక్‌కి సమాధానం దొరకదు. పేకముక్కల్లో ఎవరి సెట్‌ ఎలా ఉంటుందో తెలీదు. బీసీసీఐ జట్టు సెలక్షన్‌ కూడా సేమ్‌ అలాగే ఉంటోంది.

బీసీసీఐ గేమ్‌ టీమిండియా పర్‌ఫామెన్స్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. హార్ధిక్ పాండ్యాను నెత్తిన పెట్టుకుంది బీసీసీఐ. విరాట్‌కొహ్లీ లేన‌ప్పుడు ర‌హ‌నే కెప్టెన్. కానీ పాండ్యా అలా కాదు. అయినా అతనే తోపులా కనిపిస్తున్నాడు బీసీసీఐకి. అక్కడితోనే ఆగలేదు బీసీసీఐ జాఢ్యం. గుజరాతీలతో టీంని నింపే ప్రయత్నాల్లో పడ్డారు. దేవెగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు టీమిండియా జట్టులో ఆరేడు మంది క‌ర్ణాట‌క క్రికెట‌ర్లే ఉండేవారు. ఇప్పుడు గుజరాతీలకు పెద్దపీట వేసే ప్రయత్నం జరుగుతోంది. సమర్థత ఉండాలిగానీ ప్రాంతం ప్రాతిపదికన ప్రాధాన్యం ఇవ్వడంకంటే ఆత్మవంచన మరోటి ఉంటుందా? పాకిస్తాన్‌తో మనకున్న శత్రుత్వం ఎప్పుడూ క్రికెట్‌మీద ప్రభావం చూపలేదు. కానీ ఇందులోనూ భావోద్వేగ ఆటను ఆడుతూ బీసీసీఐ చరిత్రలోనే కనిష్టస్థాయికి దిగజారిపోతోంది.