ఒక తప్పును సరిదిద్దుకునేందుకు రెండు మూడు తప్పులు చేస్తున్నారా ? అదే తమ ముందున్న ఆప్షన్ అనుకుంటున్నారా ? కొత్త ఏడాది తొలి జీవో సృష్టించిన రచ్చ నుంచి బయట పడేందుకే వైసీపీ సర్కారు కొత్త నాటకానికి తెరతీసిందా ? ఎవరైనా కోర్టులో స్టే తెచ్చుకుంటే బావుంటుందని ఎదురు చూస్తోందా ?
విపక్షాల వేగాన్ని అడ్డుకునేందుకు జగన్ ప్రభుత్వం ఒక చిల్లర చీకటి జీవోను పట్టుకొచ్చింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న రోడ్డు షోలు బహిరంగ సభలకు పోటెత్తుతున్న జనం, ఆ డ్రోన్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారింది. కందుకూరులో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మరణించడం అధికార పార్టీకి అస్త్రంగా మారింది. ఆ తరువాత గుంటూరులో చంద్రబాబు మాట్లాడి వెళ్లిన తరువాత తొక్కిసలాటలో ముగ్గురు మరణించడం కూడా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం రోడ్డు షోలు, సభలు మున్సిపల్ పంచాయితీ రహదారులు, రోడ్డు మార్జిన్ లలో నిర్వహించకూడదని జీఓ నెంబరు 1 ను జారీ చేసింది.
జీఓ విడుదలైన మరుసటి రోజే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజమండ్రిలో రోడ్డు షో ప్రారంభించారు. ఆ తరువాత బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇదేమి న్యాయమని విపక్షాలన్నీ ప్రభుత్వాన్ని నిలదీశాయి. అప్పుడు గానీ జరిగిన తప్పు అర్థం కాలేదు. ఇలాంటి జీవోల వల్ల అందరికీ కష్టమేనని తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అలాగని ఉపసంహరించుకుంటే అదీ ప్రతిపక్షాలకు నైతిక విజయమవుతుంది. తాము ఓటమిని అంగీరకించినట్లవుతుంది. అందుకే మరో ప్లాన్ ను అమలు చేసే ప్రక్రియకు తెరతీశారు.అది ద్విముఖ వ్యూహమనే చెప్పాలి.
ప్రతిపక్ష నేతలను ముఖ్యంగా చంద్రబాబును అడ్డుకోవడం మొదటి ప్లాన్. కుప్పుంలో ముూడు రోజుల పాటు అదే పని చేశారు. క్షణక్షణం చంద్రబాబుకు అడ్డు తగిలారు. పోలీసు ఫోర్స్ ను వినియోగించి టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. పోలీసు విధులను అడ్డుకున్నారంటూ చంద్రబాబుపై కేసులు పెట్టారు. మరో పక్క అధికార పార్టీ వారే ర్యాలీలు నిర్వహించడం ప్లాన్ బీగా చెప్పుకోవాలి. జిల్లాల్లో ఇప్పటికే ఆ పని మొదలైంది. చట్టం ఏలిన వారి చుట్టమా అని ప్రశ్నించే పనులు అధికార పార్టీ వారే మొదలు పెట్టారు. త్రిపురాంతకంలో మంత్రి ఆదుమూలపు సురేష్ నేృత్వంలో ర్యాలీ నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించే కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు ర్యాలీ జరిపారు. రహదారిపై ర్యాలీ నిర్వహించడంతో పాటు బాణాసంచా కాల్చారు. దీని వల్ల ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఆగింది. నందిగామ, మాచర్ల, రావులపాలెంలో కూడా అధికార పార్టీ ర్యాలీలు నిర్వహించింది. అదీ జిఓ నెంబరు 1కు విరుద్దమని తెలిసినా కావాలనే చేశారు.
నిజానికి దేశంలో ర్యాలీలు కొత్త కాదు. ఏ రాజకీయ వ్యవహారానికైనా ర్యాలీలు నిర్వహించాల్సిందే. పంట నష్టపోయిన రైతులు ర్యాలీలు నిర్వహిస్తారు. వేతనాలు అందని కార్మికులు అదే పని చేస్తారు. పౌర హక్కుల కోసం మరికొందరు ర్యాలీలు జరుపుతున్నారు. ఎన్నికల ప్రచారం మొత్తం ర్యాలీ రూపంలో సాగుతోంది. జీఓ విడుదల చేసిన తర్వాత మాత్రమే ఆ సంగతి వైసీపీ ప్రభుత్వం విశ్లేషించుకుంది. రేపు తమకు కూడా ఇబ్బందేనని అర్థం చేసుకుంది. అందుకే విపక్షాలను ఏదో విధంగా రెచ్చగొట్టి కోర్టులో కేసు వేయించాలనిచూస్తోంది. జీఓపై కోర్టు స్టే ఇచ్చిన పక్షంలో ఊపిరి పీల్చుకోవాలనుకుంటోంది. అప్పుడిక ఆ సంగతి మరిచిపోయినట్లు నటించే వీలుంటుంది. మరి కోర్టు కేసుపై చంద్రబాబు నిర్ణయమేంటో చూడాలి.