బీజేపీ పరేషాన్.. బాబుతోనే పవన్ వైసీపీ అటాకింగ్?

By KTV Telugu On 8 January, 2023
image

చంద్రబాబు-పవన్ కళ్యాణ్‌ల తాజా భేటీ ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనల పొత్తుపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. వైసీపీ చెప్పినట్టే ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి. అధికారికంగా ఆ పార్టీల అధినేతలు ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ ఇద్దరు నేతల రాజకీయ భేటీ పొత్తు కన్ఫామ్ చేసేసింది. ఇటీవల కాలంలో విశాఖలో పవన్ కళ్యాణ్‌ను పోలీసులు అడ్డుకున్న సందర్భంగా విజయవాడలో జనసేనానిని కలుసుకొని చంద్రబాబు సంఘీభావం తెలిపారు. ఇప్పుడు కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనకు ఆటంకాలు ఎదురైన వేళ హైదరాబాద్‌లో సీబీఎన్ ఇంటికెళ్లి పవన్ మద్దతు తెలిపారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించిన అధినేతలు ఇద్దరూ జగన్‌ సర్కార్‌పై సమరమే అంటూ సంకేతాలు పంపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక బలోపేతానికి ఐక్య కార్యాచరణ రూపొందించే అంశంపై వీరిద్దరూ మాట్లాడుకున్నారు.

ఇక బాబు-పవన్ కళ్యాణ్‌ల భేటీపై ఏపీలో డైలాగ్ వార్ మొదలైంది. ఇద్దరు నేతలను చూసి వైసీపీ నేతలకు ప్యాంట్లు తడుస్తున్నాయంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఎందుకైనా మంచిది ముందు జాగ్రత్తగా డైపర్స్ వాడండని సూచించారు. అంతే ఘాటుగా వైసీపీ నుంచి కౌంటర్లు వస్తున్నాయి. పవన్ చంద్రబాబు దత్తపుత్రుడని మొదటి నుంచి చెబుతున్న వైసీపీ తమ అటాకింగ్ మరింతగా తీవ్రతరం చేసింది. ఇద్దరూ ఒకటి గూటి పక్షులేనని బాబు పల్లకి మోయడానికి పవన్ వస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. సంక్రాంతి పండుగ మాముళ్ల కోసం దత్తతండ్రి చంద్రబాబు వద్దకు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ వెళ్లాడని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ట్విట్టర్‌లో సెటైర్లు వేశారు. ఇక మరో మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్‌లో స్పందిస్తూ సంక్రాంతికి అందరింటికి గంగిరెద్దులు వెళ్తాయి చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లాడు. డూడూ బసవన్నలా తల ఊపడానికి అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 40ఏళ్ల ఇండస్ట్రీ ఒంటరిగా పోటీ చేయలేరా అంటూ అటాక్ చేస్తున్నారు.

చంద్రబాబు, పవన్ ముసుగు తొలగిపోయిందని జీవో1ను అడ్డం పెట్టుకుని పరామర్శ పేరుతో భేటీ అయ్యారని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కూర్చోని ఏపీ జీవో గురించి చర్చించడమేంటని ప్రశ్నించారు? ప్యాకేజీ గురించి మాట్లాడటం కోసమే చంద్రబాబు, పవన్‌లు భేటీ అయ్యారని ఆరోపించారు. చంద్రబాబు కారణంగా రాష్ట్రంలో 11మంది చనిపోయినా పవన్ స్పందించలేదని మంత్రి కారుమూరి అన్నారు. గతంలో ఓటుకు నోటు కోసం ఇద్దరూ చర్చించుకున్నారని ఇప్పుడు కూడా తెలంగాణలో ప్యాకేజీ కోసం భేటీ అయ్యారని నాగేశ్వరరావు అన్నారు. ముసుగు తీసేసి పవన్ ప్రజల్లోకి వెళ్లాలని ఎంపీ మార్గాని భరత్ సూచించారు. హైదరాబాద్‌లో నివాసం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలా? అని ప్రశ్నించారు. చంద్రబాబు పవన్ కలిస్తే వైసీపీ మరింత బలోపేతం అవుతుందని మంత్రి చెల్లుబోయిన వేణు అభిప్రాయపడ్డారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలవనివ్వబోనని ఆ పార్టీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వనని పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో చెప్పారు. అటు చంద్రబాబు కూడా ప్రభుత్వంపై పోరాటానికి విపక్షాలన్ని కలిసి రావాలని కోరుతున్నారు. ఈనేపథ్యంలో ఇద్దరి భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో తమ పొత్తుండదని బీజేపీ చెబుతుంటే తమ పార్ట్‌నర్ పవన్ మాత్రం టీడీపీతో కలిసి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు అధినేతల భేటీపై బీజేపీ ఏవిధంగా స్పందిస్తునేది ఆసక్తికరంగా మారింది. మరోసారి 2014 ఎన్నికల నాటి సీన్ రిపీట్ అవుతుందనే విశ్లేషణలు సాగుతున్నాయి. బీజేపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీలు 2024లో జగన్‌పై సమరశంఖారావం పూరించనున్నాయని ప్రస్తుత రాజకీయ పరిణామాలు తెలియజేస్తున్నాయి.