కొత్త సంవత్సరంలో చావుకబురు చల్లగా చెప్పింది. కొత్త కబురేం కాదు ఇదివరకు పేల్చిన బాంబునే మరోసారి పేల్చింది. 2023లో 18వేలమంది ఉద్యోగులపై వేటు తప్పదని ప్రకటించారు అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ. దీంతో ఉద్యోగాల ఊచకోత మొదలుకాబోతోంది. కత్తి ఎవరి మెడపై పడుతుందోనని దినదినగండంగా రోజులు వెళ్లదీస్తున్నారు అమెజాన్ ఉద్యోగులు.
లేఆఫ్. అంటే ఉద్యోగజీవితం ముగిసినట్లే. కొత్త సంవత్సరంలో ఉద్యోగులకు ప్రమాదహెచ్చరికలు పంపింది ఈ కామర్స్ దిగ్గజసంస్థ అమెజాన్. 18వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు అమెజాన్ సిద్ధమైంది. వాతపెడుతూనే వెన్నరాసే ప్రయత్నం చేస్తోంది. ఈ నిర్ణయం బాధాకరమంటూనే అస్థిర ఆర్థిక పరిస్థితులతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని అమెజాన్ చెబుతోంది. మానసికంగా సిద్ధపడాలంటూ ముందే అమెజాన్ ఉద్యోగులకు లేఖరాశారు అమెజాన్ సీఈఓ ఆండీ జెస్సీ .
ఉద్యోగాల కోతపై నవంబరులోనే అమెజాన్ ప్రకటన చేసింది. అప్పుడే కొంతమందిని ఇళ్లకు సాగనంపింది. కొన్ని నెలలపాటు ఈ తొలగింపు ప్రక్రియ కొనసాగుతుందన్న అమెజాన్ కొత్త సంవత్సరంలో ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. అన్ని విభాగాలపై లోతైన సమీక్ష తర్వాత అవసరమైన చోట ఉద్యోగుల లేఆఫ్‌కి పూనుకుంది. నవంబరులోనే ప్రకటన చేసినా కొంతమందిని ఇంకా తొలగించలేదు అమెజాన్. వాళ్లందరినీ ఇప్పుడు తొలగించబోతున్న 18వేలమంది జాబితాలో చేర్చేసింది.
తమ నిర్ణయంతో ప్రభావితమయ్యే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడతారని తమకు తెలుసంటున్నారు అమెజాన్ సీఈవో జెస్సీ. కానీ మరో మార్గం లేదంటూ తమ చర్యను సమర్థించుకుంటున్నారు. కరోనా సంక్షోభ సమయంలో ఈకామర్స్ వ్యాపారం భారీగా పుంజుకుంది. దీంతో డిమాండ్‌కి తగ్గట్లు అమెజాన్సంస్థ భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టింది. అయితే ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొని వ్యాపారం తగ్గుముఖం పట్టటంతో కాస్ట్ కంట్రోల్‌పై దృష్టిపెట్టింది. దీంతో ఉద్యోగుల మెడపై కత్తి వేలాడుతోంది.
ఓ పక్క ఉద్యోగాలు పీకేస్తూనే వారిని ఓదార్చే ప్రయత్నం చేస్తోంది అమెజాన్ సంస్థ. ఉద్యోగాలు కోల్పోయేవారికి పూర్తి సహకారం ఉంటుందంటున్నారు సంస్థ సీఈవో ఆండీ జెస్సీ. స్పెషల్ ప్యాకేజీలతో పాటు, హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో తమ వంతు సాయం చేస్తామని చెబుతున్నారు. సంస్థ ఎన్ని ఓదార్పు మాటలు చెప్పినా ఒక్కసారిగా రోడ్డుమీద పడే వేలాదిమందికి మరో ఉద్యోగం అంత సులువు కాదు. జనవరి 18న ఉద్యోగులకు లే ఆఫ్ సమాచారం అందించబోతోంది అమెజాన్ సంస్థ. వాస్తవానికి ముందే ఉద్యోగులకు చెప్పాకే బయటికి ప్రయటించాలనుకుంది అమెజాన్. అయితే విషయం ముందే లీక్ కావటంతో అధికారిక ప్రకటన చేసింది.
2022 సెప్టెంబర్ చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ కంపెనీలో 1.54 మిలియన్ల మంది ఉద్యోగులున్నారు. అందులో 7% మంది భారతదేశంలో ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీగా పేరున్న అమెజాన్లోనే ఉద్యోగుల తొలగింపు మొదలైందంటే అది ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం సృష్టించేలా ఉంది. ఇప్పటికే పెద్ద పెద్ద కంపెనీలు అమెజాన్ బాటలోనే ఉద్యోగుల తగ్గింపుపై దృష్టిపెట్టాయి. అమెజాన్ తొలగించనున్న 18వేలమంది ఉద్యోగుల్లో భారత్‌లో దాదాపు వెయ్యిమంది పైనే ఉండొచ్చని అంచనా, జనవరి 18న ప్రారంభమయ్యే ఉద్యోగుల తొలగింపులు చాలా వరకు అమెజాన్ స్టోర్స్, PXT విభాగాల నుంచి ఉంటాయని భావిస్తున్నారు.
ఉద్యోగులకు మూడు నాలుగు నెలల జీతం ఇచ్చి తొలగించకుండా వాలంటరీ సెపరేషన్ ప్రోగ్రామ్ ప్రతిపాదించింది అమెజాన్ సంస్థ. ఈ స్కీం కింద ఉద్యోగులు స్వచ్ఛందంగా పథకాన్ని ఆమోదించడానికి, ఉద్యోగాలకు రాజీనామా చేయడానికి అవకాశం ఉంటుంది. స్వచ్ఛంద రాజీనామాకు అంగీకరించేవారికి అమెజాన్ అనేక రాయితీలు ప్రకటించింది. ఒక ఉద్యోగిని కంపెనీ తొలగించినట్లయితే చట్టబద్ధంగా పలు సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. కానీ స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే ఎలాంటి సమస్య ఉండదు. అందుకే తొలగింపులు వివాదాస్పదం కాకుండా ముందే జాగ్రత్తపడుతోంది అమెజాన్.
అమెజాన్ కంపెనీ చరిత్రలోనే ఇంతమంది ఉద్యోగాల తొలగింపు ఇదే తొలిసారి. అందుకే బ్రాండ్ నేమ్ దెబ్బతినకుండా జాగ్రత్తపడుతోంది అమెజాన్. నాలుగు డబ్బులు ఎక్కువ పెట్టాల్సి వచ్చినా తొలగింపుల ప్రక్రియ సాఫీగా సాగాలని కోరుకుంటోంది. అటు ఉద్యోగులు కూడా తెగేదాకా లాగకుండా కొన్ని ప్రయోజనాలైనా దక్కుతాయనే ఆశతో తమకుతామే తప్పుకుంటారనేది అమెజాన్ సంస్థ ఆలోచన. సంస్థ కారణాలు ఎలా ఉన్నా ఉద్యోగ భద్రతమీద ఆశతో ఉన్న ఉద్యోగులు రోడ్డునపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికసంక్షోభాలు తలెత్తుతున్న సమయంలో ఏ సంస్థలోనూ ఉద్యోగ భద్రత లేదన్న విషయం అమెజాన్ ప్రకటనతో అందరికీ అర్ధమైంది. ఇవాళ అమెజాన్, రేపు మరోసంస్థ. ఈ ఊచకోత ఎన్నివేలమంది జీవితాలను రోడ్డున పడేయబోతోందో చెప్పలేం.