లక్షల కోట్ల పెట్టుబడుల ప్రకటనలు – వాస్తవంగా తెలంగాణకు వచ్చింది ఎన్ని? కేటీఆర్ ప్రకటనల్లో వాస్తవం ఎంత?

By KTV Telugu On 9 January, 2023
image

తెలంగాణ పరిశ్రమలు, ఐటీ మంత్రి కేటీఆర్ ఆస్ట్రేలియా వెళ్లినా అమెరికా వెళ్లినా దావోస్ వెళ్లినా, ఇండియాలో ఉన్నా తెలంగాణకు మరో భారీ పెట్టుబడి అనే వార్త వినిపించని వారం దాదాపుగా ఉండదు. దీనికి తగ్గట్లుగా తెలంగాణ గత 8 ఏళ్లలో వివిధ రంగాల్లో 2.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఘనంగా ప్రకటించారు. టీఎస్‌ ఐపాస్ ద్వారా 20,000 కంటే ఎక్కువ వ్యాపార అనుమతులను ఇచ్చామని రూ. 2.5 లక్షల కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడిని ఆకర్షించామని లక్షల సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించామని చెబుతున్నారు. నిజానికి తెలంగాణలో భారీ పెట్టుబడులు అంటూ ఇటీవలి కాలంలో ప్రతీ వారం ఓ వార్త వస్తూనే ఉంది. కేటీఆర్ సమక్షంలో ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ ఒప్పందాలు చేసుకుంటూనే ఉంటారు. మరి నిజంగా ఎన్ని గ్రౌండ్ అవుతున్నాయి. ఎన్ని బడా మల్టినేషనల్ కంపెనీలు తెలంగాణలో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించాయి. సేవల రంగంలో వచ్చే పెట్టుబడులకే ప్రాధాన్యమా. ఉత్పత్తి రంగంలో ఎందుకు పెట్టుబడులు సాధించలేకపోతున్నారు.

తెలంగాణలో పారిశ్రమిక అభివృద్ధి ఘనం అని ప్రపంచ పెట్టుబడిదారులంతా తెలంగాణ వైపు చూస్తున్నారని కేటీఆర్ చెబుతూ ఉంటారు. తెలంగాణ ప్రభుత్వం అలాగే ప్రకటనలు చేస్తూ ఉంటుంది. ఏ ప్రభుత్వమైనా అంతే చేస్తుంది. కానీ వాస్తవంగా దేశంలోకి వస్తున్న విదేశీ పెట్టుబడులు అంతర్జాతీయ కంపెనీల చూపు ఎక్కువగా తెలంగాణ వైపు ఉందా అంటే ఆలోచించాల్సిన పరిస్థితి. గత ఎనిమిదేళ్లలో తెలంగాణకు వచ్చిన ఒక్క అంతర్జాతీయ కంపెనీ పెట్టుబడి గురించి ఠక్కున అడిగితే చెప్పలేం. ఆంధ్రప్రదేశ్‌లో కియా కార్ల పరిశ్రమ వచ్చింది. దేశంలో ఎక్కడ కియా కారు కనిపించినా ఆటోమేటిక్‌గా అది మేడిన్ ఆంధ్రా అని మనసులో మెదులుతుంది. కియా అనేది అంతర్జాతీయ బ్రాండ్ ఇండియాలో ఎంట్రీ మొదటి సారిగా ఇచ్చింది. ఇలాంటి పెట్టుబడిని తెలంగాణ ఎనిమిదేళ్లలో ఒక్కటైనా ఆకర్షించిందా? అంటే సమాధానం కోసం వెదుక్కోవాల్సిన పరిస్థితి.

ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్ ఇన్వెస్టర్లను రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి సేవల రంగం రెండు ఉత్పత్తి రంగ ఇన్వెస్టర్లు. సేవల రంగం అంటే సాఫ్ట్ వేర్ కంపెనీలు అనుకోవచ్చు. ఈ కంపెనీలు పెట్టుబడి పెట్టాలంటే చాలా తేలికగా నిర్ణయం తీసుకుంటాయి. ఒక వేళ తరలించాలనుకుంటే అంతే తేలికగా నిర్ణయం తీసుకుంటాయి. ఈ విషయం మన కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. కానీ తయారీ రంగ పెట్టుబడులు మాత్రం అలా కాదు. ఓ సారి ఫిక్సయ్యాయంటే అక్కడ్నుంచి కదలడం చాలా కష్టం. ప్రపంచ ఉత్పత్తి రంగానికి చైనా బాస్ లా ఉంది. ఇటీవల కరోనా అనంతర పరిస్థితులతో చాలా కంపెనీలు ఉత్పత్తి కేంద్రాలను చైనాతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఉంచుకోవాలనుకుంటున్నారు. కరోనా అనంతర పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితుల కారణంగా ఐఫోన్ లాంటి అంతర్జాతీయ బడా బ్రాండ్లు చైనాతో పాటు ఇతర చోట్ల కూడా ఉత్పత్తి కార్యకలాపాలు పెంచాలనుకుంటున్నారు. వారిలో ఎక్కువ మంది చూపు ఇండియా పైనే ఉంది. దీనికి కారణం త్వరలో చైనాను మించిపోనున్న జనాభా భారీ వర్క్ ఫోర్స్ వంటివి .

మరి పెట్టుబడుల్లో అగ్ర భాగాన ఉందని చెబుతున్న తెలంగాణ ఐ ఫోన్ పరిశ్రమను ఎందుకు ఆకర్షించలేకపోయింది. తెలంగాణలో పెట్టుబడులకు ఐ ఫోన్ ఉత్పత్తి సంస్థ ఎందుకు తెలంగాణను కనీసం పరిశీలించలేదు. ఒక్క ఐ ఫోన్ మాత్రమే కాదు ఇండియాలో భారీ మల్టీనేషనల్ కంపెనీలు ముఖ్యంగా కార్లు దుస్తులు సౌందర్య సాధనాలు ఇలా నిత్య జీవితంలో మనం ఉపయోగించే అంతర్జాతీయ బ్రాండ్లు ఇండియాలో ఉత్పత్తి కేంద్రాలు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. కానీ తెలంగాణ మాత్రం పెద్దగా వాటిని ఆకర్షించలేకపోతోంది. ఇది లెక్కల్లో కనిపించే నిజం. తెలంగాణకు 2021-22లో వచ్చిన విదేశీ పెట్టుబడులు రూ. 11965 కోట్లు. అదే పొరుగున ఉన్న కర్ణాటకకు వచ్చినవి 1,63,798 కోట్లు. విధేశీ పెట్టుబడులు అంటేనే అంతర్జాతీయ బ్రాండ్లు పెట్టే పెట్టుబడులని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కర్ణాటక తర్వాత మహారాష్ట్ర, గుజరాత్ , ఢిల్లీ, తమిళనాడులకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వెళ్తున్నాయి. ఆ తర్వాత స్థానంలోనే తెలంగాణ ఉంటోంది. మరి కేటీఆర్ చెబుతున్న లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి. ఎవరు పెట్టారు.

తెలంగాణలో సాఫ్ట్ వేర్ రంగం మంచి అభివృద్ధి సాధిస్తోంది. తెలంగాణకు వస్తున్న పెట్టుబడులు ఈ రంగంలోనే అత్యధికం. మరి తయారీ రంగంలో తెలంగాణ ఏం సాధించింది అంటే చెప్పడం కష్టం. కర్ణాటకలో సాఫ్ట్ వేర్ తో పాటు తయారీ రంగం కూడా పెట్టుబడులను విపరీతంగా ఆకర్షిస్తోంది. తమిళనాడు అయితే ఆటోమోబైల్ హబ్ గా ఉంది. గుజరాత్, మహారాష్ట్ర గురించి చెప్పాల్సిన పని లేదు. అత్యధిక ఉత్పాదక సంస్థలు అక్కడే ఉత్పత్తి సంస్థలు పెట్టాలనుకుంటున్నాయి. తెలంగాణ వైపు చూడటం లేదు. కానీ ప్రభుత్వం తరపున చేసే ప్రకటనలు మాత్రం ఆకాశానికి చేరువలో ఉంటాయి. ఇప్పటికైతే తెలంగాణ పెట్టుబడులన్నీ పేపర్ మీదనే ఉన్నాయనుకోవాలి. గ్రౌండ్ అవుతున్న పెట్టుబడులు చాలా స్వల్పం. పెట్టుబడుల ప్రతిపాదనలు వేరు ఎంవోయూలు చేసుకోవడం వేరు వాటిని గ్రౌండ్ చేసుకోవడం అత్యంత కీలకం. ఈ విషయంలో తెలంగాణ సర్కార్ వెనుకబడిందని చెప్పుకోవచ్చు. చైనాలో ఏర్పడిన పరిస్థితుల వల్ల ప్రపంచ తయారీ రంగం చూపు భారత్ వైపు ఉంటుందని ఈ పరిస్థతిని అనుకూలంగా చేసుకోవాలని కేటీఆర్ తరచూ చెబుతూంటారు. కానీ ఆయన ఈ ప్రయత్నాల్లో సఫలమయ్యారా. ప్రచారంలో మాత్రమే ముందున్నారా. అనేది సమీక్ష చేసుకోవాల్సిన సందర్భం.