జాతీయ పార్టీగా మారిన బీఆర్ఎస్ తెలంగాణ గడ్డపై నుంచే సమర శంఖారావం పూరించబోతోంది. తన తొలి సభను ఖమ్మం గుమ్మంలో నిర్వహించనుంది. సంక్రాంతి తర్వాత ధూం ధాం మొదలుపెడతామన్న కేసీఆర్ చెప్పినట్టుగానే ఈనెల 18న ఖమ్మం బహిరంగసభ ద్వారా బీఆర్ఎస్ శంఖారావం పూరించేందుకు సిద్ధమయ్యారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా అవతరించాక నిర్వహిస్తున్న మొదటి సభ కావడంతో గులాబీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులతో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌ను ఈ సభకు ఆహ్వానించారు కేసీఆర్. తొలుత ఢిల్లీలో సభ నిర్వహించాలని భావించినప్పటికీ సొంత రాష్టంలో మారుతున్న రాజకీయ పరిణామాలతో ఖమ్మం జిల్లాను ఎంచుకున్నారు. విపక్షాల ఐక్యతను చాటుతూ జాతీయ రాజకీయాల్లో సత్తా చాటేందుకు ఈసభను వేదికగా మల్చుకోవాలనే వ్యూహంతో కేసీఆర్ ఉన్నారు.
కేసీఆర్ ఖమ్మంలో సభ నిర్వహించడం వెనుక అనేక రకాల కారణాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఖమ్మం జిల్లా రాజకీయాలు కుతకుతలాడుతున్నాయి. ఈ జిల్లాలో మొదటి నుంచి కారు పార్టీకి వ్యతిరేక పవనాలే వీస్తున్నాయి. దీనికి తోడు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువైపోయాయి. ఇద్దరు బడా నేతలు బీజేపీతో టచ్‌లోకి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. దానికి తోడు తెలంగాణలో పూర్వవైభవం అని పరితపిస్తున్న చంద్రబాబు ఇటీవల ఖమ్మంలో భారీ బహిరంగసభను నిర్వహించి తమకు బలం తగ్గలేదని చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఇక రానున్న ఎన్నికల్లో పాలేరు నుంచి వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో పట్టున్న కాంగ్రెస్‌తో పాటు అన్ని పార్టీలను తట్టుకొని నిలబడాలంటే ఖమ్మంలో కారు పార్టీ చెమటోడ్చక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే ఖమ్మంలో పార్టీని గాడిన పెట్టేందుకు కేసీఆర్ సభ నిర్వహణకు ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు.
ఇక ఖమ్మం ఏపీ సరిహద్దు జిల్లా కావడంతో అక్కడ సెటిలర్స్ ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే ఆంధ్రాలో బీఆర్ఎస్ ఎంట్రీకి సన్నాహాలు చేస్తున్నారు కేసీఆర్. రెండు రాష్ట్రాల ప్రజలను ఆకర్షించడంతో పాటు ఏపీలోనూ బీఆర్ఎస్‌కు స్కోప్ ఉందనే సంకేతాలు ఇచ్చేందుకే ఖమ్మంని ఎంచుకున్నారని తెలుస్తోంది. మరోవైపు ఖమ్మంలోని ఏజెన్సీ ప్రాంతాలకు దగ్గర్లోనే ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ఉంది. చాలా మంది ఆ రాష్ట్రాల ప్రజలు తరచూ వస్తుంటారు. ఈ సభ ద్వారా అటు ఛత్తీస్‌గఢ్ వైపు కూడా పార్టీని విస్తరించేందుకు వీలవుతుందనే లెక్కలు వేసుకున్నారట గులాబీ బాస్. ఇక ఈ సభకు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎం అఖిలేష్ సహా మరికొందరు జాతీయ నేతలు రానుండడంతో పెద్ద ఎత్తున జనసమీకరణకు గులాబీ శ్రేణులు ప్లాన్ చేస్తున్నాయి. ఖమ్మంతో పాటు మహబూబాబాద్, భద్రాచలం, సూర్యాపేట, నల్గొండ, వరంగల్, ములుగు, భూపాలపల్లి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వస్తారని అంచనా.
మొత్తంగా తెలంగాణలో ఈఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంపై ఫోకస్ పెడుతూనే అటు జాతీయ స్థాయిలో వ్యూహరచన చేస్తూ ముందుకు వెళ్తున్నారు కేసీఆర్. ఇప్పటికే ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఏపీ నుంచి కొందరు నేతలను పార్టీలో చేర్చుకొని అక్కడ అధ్యక్ష బాధ్యతలు కూడా అప్పజెప్పారు. ఇప్పుడు ఖమ్మం సభ ద్వారా తమ జాతీయ వాణి వినిపించేందుకు సిద్ధమవుతున్నారు.