రేపటి నుంచి భారత్-శ్రీలంక వన్డే ఫైట్.. సీనియర్లు ఇన్ బూమ్రా ఔట్

By KTV Telugu On 9 January, 2023
image

శ్రీలంకతో మరో సిరీస్‌ ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. ఇప్పటికే టీ 20 సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్ రేపటి నుంచి వన్డే సమరానికి సన్నద్ధమవుతోంది. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌లు తిరిగి జట్టుతో చేరారు. గాయంతో చాలాకాలంగా జట్టుకు దూరమైన బుమ్రా రేపటి వన్డేలోకి అందుబాటులోకి వస్తాడని అంతా ఆశించిన వేళ బీసీసీఐ షాకింగ్ న్యూస్ చెప్పింది. పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో అతడిని ఈ సిరీస్ నుంచి తప్పించారు. భవిష్యత్తు టోర్నీల నేపథ్యంలో బుమ్రా రీఎంట్రీ విషయంలో తొందరపాటు పనికి రాదని భావించిన బోర్డు చివరి నిమిషంలో అతన్ని జట్టు నుంచి తొలగించింది. గత సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో సిరీస్‌లో గాయపడిన బూమ్రా ఇప్పటివరకు జట్టుతో చేరలేదు. పొట్టి సిరీస్‌కు దూరంగా ఉన్న పేసర్ షమీ తిరిగి జట్టులోకి రాగా సిరాజ్ కూడా అందుబాటులో ఉన్నాడు.

కెప్టెన్ రోహిత్ శర్మ రాకతో ఓపెనింగ్ స్థానంపై సర్దుబాటు తప్పడం లేదు. రోహిత్‌ను ఫినిషర్‌గా పంపించాలనే వాదనను టీం మేనేజ్‌మెంట్ సీరియస్‌గా తీసుకోలేదని సమాచారం. రోహిత్‌ను కచ్చితంగా ఓపెనర్‌గా దింపుతూ అతని జోడీగా శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌లలో ఒకరికి అవకాశం ఇవ్వనున్నారు. బంగ్లాదేశ్‌పై డబుల్ సెంచరీతో చెలరేగిన ఇషాన్‌ వైపు మేనేజ్‌మెంట్ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మూడో స్థానంలో విరాట్ కోహ్లీ వస్తాడు. అతను కూడా బంగ్లాపై చివరి వన్డేలో సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇక కోహ్లీ తర్వాత నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, ఐదో స్థానంలో శ్రేయాస్ అయ్యర్ బరిలో దిగనున్నారు. వీళ్లిద్దరూ కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు.

లంకతో వన్డే సిరీస్‌కు ముగ్గురు ఆల్‌రౌండర్లకు జట్టులో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్‌కు ఈ మ్యాచ్‌లో అవకాశం లభిస్తుందని సమాచారం. వీళ్లపై కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి. కివీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో సుందర్ అద్భుతంగా రాణించాడు. బూమ్రా గైర్జాజరుతో మహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్‌లను ప్రధాన పేసర్లుగా తీసుకోనుంది. ఇక స్పిన్నర్‌గా కేవలం యుజ్వేంద్ర చాహల్‌ను తీసుకుంటారని తెలుస్తోంది. గౌహతి వేదికగా రేపు భారత్, శ్రీలంకల మధ్య తొలి వన్డే జరగనుంది.