టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ హైదరాబాద్ భేటీతో రాజకీయాలు ఊపందుకున్నాయి. ఏపీలో ముందస్తు ఎన్నికల చర్చ నడుమ సీట్ల సర్దుబాటు కోసమే ఇద్దరు అగ్రనేతలు సమావేశమయ్యారన్న చర్చ జరుగుతోంది. సీట్ల సర్దుబాటు ఎన్నికలు ప్రకటించిన తర్వాతే ఉంటుందని ఇప్పుడు అలాంటిదేమీ లేదని ఇద్దరు నేతలు చెప్పుకున్నప్పటికీ వారి మాటలు నమ్మేందుకు జనం సిద్ధ పడటం లేదు. ఏదో జరిగింది ఒప్పందమూ కుదురిందని ప్రచారం మొదలు పెట్టేశారు.
బాబు పవన్ భేటీపై అన్ని వైపుల నుంచి లాగడం మొదలైంది. ఎవరి మాట వాళ్లు మాట్లాడుతున్నారు. రాంగోపాల్ వర్మ అసభ్యకరమైన ట్వీట్ తో కాపుల కోపం తారా స్థాయికి చేరింది. బీజేపీ నేతలు భయంతో కూడిన గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ పవన్ కళ్యాణ్ తమ చేతి నుంచి పోకుండా చూసుకునే ప్రయత్నంలో ఉన్నారు. టీడీపీ ఆచి తూచి అడుగులు వేస్తుంటే వైసీపీలో కొంత ఆందోళన కనిపిస్తున్న మాట వాస్తవం.
సోషల్ మీడియా వేదికగా కాపులను, జనసైనికులను రెచ్చగొట్టడంలో కొందరు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఫిఫ్టీ ఫిప్టీ అంటే చెరి సగం స్థానాలు పోటీ చేసేట్టుగా ఒప్పందం చేసుకోవాలని పవన్ కు కొందరు లేఖాస్త్రం సంధించారు. ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్లే సీఎం కావాలని కూడా ప్రతిపాదిస్తూ పవన్ గ్రూప్ లో ఆశలు రేకెత్తించే ప్రయత్నం జరుగుతోంది. విపక్షాల ఓట్లు చీలనివ్వబోనని పవన్ అంటున్నప్పటికీ తాను సీఎం అయ్యేదీ లేనిదీ ప్రజల చేతులో ఉందని జనసేనాని గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా సామాజిక మాధ్యమాల వేదికగా గుర్తుచేస్తున్నారు. దానితో ఇప్పుడు పవన్ అభిమానులు కాపు సామాజిక వర్గం వారు ఆలోచనలో పడ్డారు.
జనసేన అభిమానులు కొందరు పాత లెక్కలు తీస్తున్నారు. పవన్ మద్దతిచ్చినప్పుడు చంద్రబాబు గెలిచారని గుర్తుచేస్తున్నారు. జనసేన విడిగా పోటీ చేసిన 2019లో టీడీపీ ఓడిపోయిందని ప్రస్తావిస్తున్నారు. అప్పుడు అనేక నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేనకు వచ్చిన ఓట్లను కలుపుకుంటే వైసీపీ కంటే సగటును 30 నుంచి 40 వేల ఓట్లు అధికంగా వచ్చాయని గణాంకాలు తీస్తున్నారు. ఇప్పుడు కూడా జనసేన లేకుండా టీడీపీ గెలవడం కష్టమని అభిప్రాయానికి వచ్చిన వారంతా తక్షణమే బేరం పెట్టాలని సమాన ప్రాతిపదికన పోటీ చేసేందుకు ఒప్పుకుంటేనే ముందుకు సాగాలని సూచిస్తున్నారు వీలైతే చెరిసగం కాలం ముఖ్యమంత్రిత్వం వహించే విధంగా ఒప్పందం చేసుకోవాలన్న ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది.
కాపు సామాజిక వర్గం రాజ్యాధికారానికి పనికి రాదా అని వాళ్లను వాళ్లు ప్రశ్నించుకుంటున్నారు. ఎప్పుడు ఆ రెండు సామాజిక వర్గాలే పెత్తనం చేయాలా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో వైసీపీ బాగా వీకైపోయిన నేపథ్యంలో తమకు అవకాశాలు పెరిగాయని వాదించే వాళ్లూ ఉన్నారు. అందులో కొందరు నౌ ఆర్ నెవ్వర్. అంటే ఇప్పుడు కాకపోతే మరోసారి ఛాన్స్ రాదన్న ఆలోచనలో పడిపోయారు. అందుకే వీలైనంత త్వరగా తేల్చేస్తే పోటీ చేసే స్థానాలను లెక్కేసుకుని ప్రచారాన్ని ముమ్మరం చేయాలన్న ఆలోచన వారిలో మెదులుతోంది.
చంద్రబాబు, పవన్ భేటీతో ఆలోచినలో పడిపోయిన బీజేపీ ఇప్పుడు జనసేనను తమవైపుకు లాక్కునేందుకు పాచికలు వేస్తోంది. పవన్ ఏపీ సీఎం కావాలంటే అది తమ వల్లే సాధ్యమని బీజేపీ నేతలు అంటున్నారు. మరి చివరాఖరుకు పవన్ ఎటు వైపు వెళతారో చూడాలి.