కోహ్లీ రికార్డుల పంట.. శతకంతో 2023 కి వెల్‌కమ్‌

By KTV Telugu On 10 January, 2023
image

భారత డైనమిక్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ తనకు కాదేదీ అనర్హం అన్నట్టుగా చెలరేగి పోతున్నాడు. గతేడాది బంగ్లాదేశ్‌పై జరిగిన వన్డే సిరీస్‌లో శతకంతో ఘనంగా 2022కు వీడ్కోలు పలికిన కోహ్లీ 2023లో తన కెరీర్‌ను అంతకంటే ఘనంగా ఆరంభించాడు. కొత్త ఏడాదిలో తొలి ఇన్నింగ్స్‌లోనే శతకంతో అదరగొట్టాడు. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు అందుబాటులోకి వచ్చిన కోహ్లీ వస్తూనే సెంచరీ బాదాడు. 80బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ తో 100 పరుగులు పూర్తి చేశాడు. మొత్తంగా 87 బంతులు ఎదుర్కొన్న విరాట్ 12 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 113 పరుగులు చేశాడు.

గౌహతి వన్డేలో కోహ్లీ తన సెంచరీతో రికార్డుల పంట పండించాడు. స్వదేశంలో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్‌గా సచిన్ టెండూల్కర్ సరసన చేరాడు. మొత్తం 164 మ్యాచుల్లో సచిన్ ఈ ఫీట్ సాధిస్తే కోహ్లీ కేవలం 102 మ్యాచుల్లోనే ఈ ఘనత అందుకున్నాడు. అంతేకాదు శ్రీలంకపై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌ల జాబితాలో సచిన్‌ను అధిగమించాడు విరాట్. ఇప్పటివరకు లంకపై సచిన్ 8 సెంచరీలు చేయగా గౌహతి మ్యాచ్‌లో శతకంతో కోహ్లీ మాస్టర్ బ్లాస్టర్ రికార్డ్‌ను బ్రేక్ చేశాడు.

కోహ్లీ మరో రికార్డ్‌కు చేరువలో ఉన్నాడు. ఈ సిరీస్ మొత్తంలో మరో 180 పరుగులు చేస్తే వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఐదో బ్యాటర్‌గా నిలుస్తాడు. ఈ క్రమంలో లంక లెజెండ్ మహేల జయవర్దనేను వెనక్కు నెట్టి ఐదో స్థానాన్ని ఆక్రమిస్తాడు. అంతేకాదు గౌహతి స్టేడియంలో కోహ్లీ రికార్డు అద్భుతంగా ఉంది. చివరగా ఇక్కడ ఆడినప్పుడు అతను 140 పరుగుల భారీ స్కోరు చేశాడు. ఇప్పుడు మరోసారి సెంచరీతో రాణించాడు. విరాట్ విశ్వరూపానికి తోడు రోహిత్ శర్మ, గిల్‌లు హాఫ్ సెంచరీలతో రాణించడంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 373 పరుగులు చేసింది.