లోకేష్‌ చెంతకు గంటా.. టీడీపీలోనే ఉంటాడంటా.!

By KTV Telugu On 10 January, 2023
image

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. గత కొంతకాలంగా ఆయన వైసీపీలోకి వెళ్లనున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. కాపునాడుకు ముందు గంటా చుట్టే రాజకీయం తిరిగింది. అయితే ప్రస్తుతం ఆయన ఎక్కడకి వెళ్లడం లేదని టీడీపీలోనే ఉంటున్నారని తేలిపోయింది. కొన్నాళ్లుగా పార్టీతో అంటీముట్టనట్టుగా ఉంటున్న గంటా శ్రీనివాసరావు చాలా కాలం తర్వాత నారా లోకేష్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతుండడంతో గంటా మళ్లీ అధిష్టానానికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి విశాఖలోని చాలా నియోజకవర్గాలకు టీడీపీ ఇంఛార్జ్‌లను ఖరారు చేస్తున్నారు. ఈ సమయంలో గంటా-లోకేష్ భేటీ చర్చనీయాంశం అయ్యింది.

టీడీపీ జనసేన పార్టీల మధ్య పొత్తుకు అడుగులు పడుతున్న వేళ మళ్లీ గంటా యాక్టీవ్ పాలిటిక్స్‌లోకి వచ్చారు. లోకేష్‌తో దాదాపు అరగంటకు పైగా చర్చించారు. ఈ సమావేశంలో తాను ఎందుకు పార్టీకి దూరంగా ఉండాల్సి వచ్చింది తదితర అంశాలను లోకేష్‌కు వివరించినట్లు సమాచారం. అయితే గంటాపై టీడీపీ అధిష్టానం వైఖరి ఎలా ఉంటుంది. ఆయన భవిష్యత్తు కార్యాచరణపై ఏమిటనేది కూడా తేలాల్సి ఉంది. ఇక నుంచి పార్టీ కార్యక్రమాల్లో గంటా పాల్గొంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 2019 ఎన్నిల్లో విశాఖ నార్త్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు గంటా శ్రీనివాసరావు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచీ ఆయన టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు రావాలని అధిష్టానం కోరిన ఆయన హాజరుకాలేదు. పార్టీ సభ్యత్వ విషయంతో పాటూ కమిటీల ఏర్పాటుపై గంటా శ్రద్ధ పెట్టలేదనే ఆరోపణలున్నాయి.

వాస్తవానికి ఎన్నికలకు ముందునుంచే వైసీపీలో చేరేందుకు గంటా ప్రయత్నాలు కొనసాగించినా అవి ఫలించలేదు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు లాంటి నేతలు గంటా రాకను వ్యతిరేకించినా సీఎం గ్రీన్ సిగ్నల్ చెప్పారనే కథనాలు వచ్చాయి. కానీ అవేమీ జరగలేదు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గంటా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా చేసినప్పటికీ అది ఆమోదం పొందలేదు. ఇటీవల విశాఖలో కాపునాడు నిర్వహణకు ముందు గంటా శ్రీనివాసరావు మళ్లీ యాక్టీవ్ అయినట్టే కనిపించారు. కానీ తీరా చూస్తే ఆయన సభకు కూడా వెళ్లలేదు. తరచూ పార్టీలు నియోజకవర్గాలు మార్చే అలవాటు ఉన్న గంటా వ్యూహమేంటనేది ఎవరికీ అంతుచిక్కలేదు. అయితే లోకేష్‌తో భేటీతో ఆయన టీడీపీలోనే కొనసాగాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మొత్తంగా 2024లో గంటా శ్రీనివాసరావు ఎక్కడి నుంచి గంట మోగిస్తారనేది చూడాలి.