ఇక తెగడానికేం లేదు.. క్లైమాక్స్‌ ఫైటింగే. గవర్నర్‌ వర్సెస్ స్టేట్‌ ఇదో కొత్త పర్వం

By KTV Telugu On 10 January, 2023
image

గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగం అవుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ తరచూ చేసిన ఆరోపణ ఇది. కానీ ఇప్పుడేం జరుగుతోంది. అప్పటికంటే ఎక్కువగానే రాజ్‌భవన్‌ల జోక్యం పెరుగుతోంది. చిన్నచిన్న వివాదాలు కాదు. చట్ట సభసాక్షిగా పరస్పరం నిందించుకునేదాకా వెళ్తోంది. పాండిచ్చేరి, పశ్చిమబెంగాల్‌, కేరళ, తెలంగాణ ఎపిసోడ్‌లను మించిపోయే హైడ్రామాకు వేదికైంది తమిళనాడు అసెంబ్లీ. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగం అంటే ఎక్కడైనా ప్రభుత్వం తయారుచేసిన స్పీచ్‌ యథాతథంగా చదివేస్తారు. కానీ అలాచేస్తే గవర్నర్‌ రవి ప్రత్యేకత ఏముంటుంది. అక్కడే కథ అడ్డం తిరిగింది.

కొత్త సంవత్సరంలో తమిళనాట తొలి అసెంబ్లీ సమావేశానికి వచ్చిన గవర్నర్‌కి గ్రాండ్‌ వెల్‌కమ్‌ పలికారు. కానీ సభ లోపలికొచ్చాకే సీన్‌ మారిపోయింది. ప్రభుత్వం అందించిన ప్రసంగపాఠంలోని ద్రావిడ మోడల్‌ సర్కారు, తమిళనాడు వంటి పదాలను రాష్ట్ర నాయకుల పేర్లను గవర్నర్‌ పలకకపోవడం వివాదాస్పదమైంది. గవర్నర్‌ ప్రసంగాన్ని ప్రారంభించగానే డీఎంకే కూటమి పార్టీలైన కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, ఎండీఎంకే, వీసీకే, ఎంఎన్‌ఎంకే, కేడీఎంకే, టీవీకే ఎమ్మెల్యేలు పోడియం దగ్గరికెళ్లి గవర్నర్‌ గో బ్యాక్‌ నినాదాలు చేశారు. అయినా ఆయన పట్టించుకోకుండా ప్రసంగాన్ని కొనసాగించటంతో డీఎంకే కూటమి పార్టీల సభ్యులు వాకౌట్‌ చేశారు.

గవర్నర్‌ తీరును సభాముఖంగా సీఎం స్టాలిన్‌ తప్పుపట్టారు. సంప్రదాయానికి గవర్నర్‌ తూట్లు పొడిచారని ప్రభుత్వాన్ని అవమానించారని స్టాలిన్‌ ఆవేదన వ్యక్తంచేశారు. గవర్నర్‌ సమ్మతంతో ముద్రించిన ప్రసంగాన్ని పూర్తిగా చదవకపోవడం బాధాకరమన్నారు స్టాలిన్‌. ఇది సభా మర్యాదలను అతిక్రమించడమేనని ఆక్షేపించారు. సభ్యులకు అందించిన ముద్రిత ఆంగ్ల ప్రసంగం సభాపతి చదివిన తమిళ ప్రసంగాలను మాత్రమే రికార్డుల్లోకి ఎక్కించాలనే తీర్మానాన్ని ప్రతిపాదించారు. దానిని సభ ఆమోదించింది. తొలి తీర్మానాన్ని ప్రతిపాదించిన సమయంలో సభ నుంచి గవర్నర్‌ నిష్క్రమించారు. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా అన్నాడీఎంకే సభ్యులు కూడా వాకౌట్‌ చేశారు. సభలో స్టాలిన్‌ తీరుకు సినీ నటుడు సత్యరాజ్‌ శాల్యూట్‌ చెప్పడం ఈ ఎపిసోడ్‌లో కొసమెరుపు.