తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చి చాలా కాలం అవుతోంది. దసరా పండగ రోజు తీర్మానం చేశారు. తర్వాత ఈసీ అనుమతి వచ్చింది. అధికారికంగా ఇప్పుడు టీఆర్ఎస్ ఉనికి లేదు. బీఆర్ఎస్ మాత్రమే ఉంది. అయితే ఈ బీఆర్ఎస్ను జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు మాత్రం గడప దాటడం లేదు. మొత్తంగా తెలంగాణలోనే తిరుగుతున్నాయి. క్రిస్మస్ అవగానే ఆరు రాష్ట్రాల్లో కాసిన్ సెల్స్ నియమిస్తామని ప్రకటించారు. అతీ గతీ లేదు. ఏపీ నుంచి ఎన్నికల్లో ఎెప్పుడూ గెలవని నేతల్ని చేర్చుకుని భారీగా పబ్లిసిటీకి ప్లాన్ చేశారు కానీ ఏపీలో అడుగు పెట్టే ప్లాన్లు ఇంత వరకూ రెడీ చేయలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభను కూడా తెలంగాణలోనే నిర్వహిస్తున్నారు. అయితే ఢిల్లీ లేకపోతే ఉత్తరప్రదేశ్ అని గతంలో బీఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేశాయి. కానీ మళ్లీ తెలంగాణకే ఎందుకు పరిమితమవుతున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభను నిర్వహిస్తే దేశం మొత్తం ఎలా పట్టించుకుంటుంది.
గతంలో ఢిల్లీలో బహిరంగసభ పెడతారని పార్టీ గురించి విధి విధానాల గురించి ప్రకటిస్తారని చెప్పుకున్నారు. తర్వాత ప్రెస్ మీట్ పెడతారని చెప్పుకున్నారు. అలాంటిది కూడా ఏమీ జరగలేదు. ఇప్పుడు కేసీఆర్ జిల్లాల పర్యటనల్లో భాగంగానే ఖమ్మంలో నిర్వహించబోయే బహిరంగసభనే బీఆర్ఎస్ ఆవిర్భావ సభగా ప్రకటించేశారు. ఈ నెల 18న బుధవారం ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగసభ నిర్వహించనున్నది. బీఆర్ఎస్గా మారిన తర్వాత పార్టీ నిర్వహిస్తున్న తొలి సభ ఇది. ఆవిర్భావ సభ అయినందున ఇతర రాష్ట్రాలకు చెందిన ముగ్గురు ముఖ్యమంత్రుల్ని ఆహ్వానించారు. ఇద్దరు ఆప్ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్‌మాన్, మరో లెఫ్ట్ పార్టీ సీఎం విజయన్ ను ఆహ్వానించారు. యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కూడా వచ్చే చాన్స్ ఉంది.
తెలంగాణ ఉద్యమానికి టీఆర్ఎస్ పార్టీకి బలమైన అండగా నిలిచిన బహిరంగ సభల మాదిరిగానే బీఆర్ఎస్ కూడా బహిరంగ సభ ద్వారానే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ సభ ద్వారా దేశ రైతాంగానికి రాజకీయ పక్షాలకు స్పష్టమైన సందేశం ఇస్తామని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే జాతీయ పార్టీ సభను తెలంగాణలో పెట్టి ప్రచారం చేసుకుంటే ఎవరు పట్టించుకుంటారన్న వాదన ఉంది. కేసీఆర్ ఇప్పుడు తెలంగాణలో బలప్రదర్శన చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణలో ఎంత భారీ సభ పెట్టినా అతి తెలంగాణకు పరిమితమవుతుందని అదే ఢిల్లీలోనే యూపీలోనో పెడితేనే జాతీయ పార్టీగా గుర్తింపు ఉంటుందని అంటున్నారు.
అయితే కేసీఆర్ లక్ష్యం వేరన్న వాదన బీఆర్ఎస్లో ఎక్కువగా వినిపిస్తోంది. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ బలపడాలంటే ముందుగా తెలంగాణలో అధికారాన్ని నిలబెట్టుకోవాలి. తెలంగాణ ప్రజలు తనకు అండగా ఉంటేనే దేశ రాజకీయాలలో ప్రభావం చూపడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్న కేసీఆర్ ఈ క్రమంలోనే వరుసగా ఏ జిల్లాలో పర్యటనకు వెళ్లినా ఇదే తరహాలో ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలంతా టిఆర్ఎస్ పార్టీ వైపు బలంగా నిలబడాలని ఆయన కోరుతున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న భావనతోనే కేసీఆర్ ముందు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఇది వచ్చే ఎన్నికల్లో కెసిఆర్ పార్టీని గెలిపించాలన్న ఆయన భావన అర్థమయ్యేలా చేస్తుందని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారం మళ్లీ కట్టబెడితేనే దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించే అవకాశం ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నట్టుగా ఆయన ఇటీవలే చేస్తున్న వ్యాఖ్యల ఆధారంగా అర్థమవుతుంది.
ఇంట గెలిస్తేనే రచ్చ గెలిచే అవకాశం రాజకీయాల్లో ఉంటుంది. గతంలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ములాయంసింగ్ యాదవ్, లాలూప్రసాద్ యాదవ్, దేవగౌడ, ఎన్టీఆర్, చంద్రబాబు, కరుణానిధి లాంటి నాయకులు ఇంట గెలిచిన తర్వాతే జాతీయ రాజకీయాలను ప్రభావితం చేశారు. సొంత రాష్ట్రాల్లో ఓడిపోయి వారు సాధించిందేమీ లేదు. కేసీఆర్ రెండు సార్లు తెలంగాణ నుంచి గెలిచి సీఎం అయ్యారు కాబట్టి ప్రాధాన్యం లభిస్తోంది. ఆయన మాటలకు విలువ లభిస్తోంది. మూడో సారి కూడా ముఖ్యమంత్రి అయితే తిరుగు ఉండదు. దేశ వ్యాప్తంగా మంచి ఇమేజ్ వస్తుంది. కానీ అధికారం కోల్పోతే మాత్రం మాజీ సీఎంలలో ఆయన ఒకరిగా మిగిలిపోతారు. అంతే కాదు అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరగాల్సిన పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బతినడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తేనే ఆరు నెలల తర్వాత వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధంచడానికి అడ్వాంటేజ్ లభిస్తుంది. అంటే ఇప్పుడు కేసీఆర్ పూర్తి స్థాయిలో తెలంగాణపై దృష్టి సారించాల్సిన సమయమని చెప్పుకోవచ్చు.
తెలంగాణ బిడ్డ ఢిల్లీ పీఠానికి గురి పెడుతున్నాడు. మద్దతివ్వరా అనేది కేసీఆర్ ప్రచార వ్యూహం కావొచ్చు. ఢిల్లీలో మోదీని కేసీఆర్ గురి పెడుతున్నారు. దేశాన్ని మారుస్తున్నా అంటున్నారు. జాతీయ పార్టీ పెడుతున్నారు. ఓ తెలంగాణ బిడ్డ ఇలా దేశంలో సంచలనం సృష్టించడానికి వెళ్తే సొంత ప్రజలు మద్దతివ్వరా అనే ఓ ఎమోషనల్ అప్పీల్ ప్రజలకు చేసే రాజకీయం ఇందులో ఉంది. నవ్వేటోడి ముందు జారిపడేలా చేయవద్దు అని కేసీఆర్ ఎక్కువగా చెబుతూంటారు. ఇలాంటి వ్యూహంతోనే తనను ఓడించి తెలంగాణ పరువు తీయవద్దని. మనం జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించబోతున్నామని ప్రజల మైండ్ సెట్ మార్చే వ్యూహం ఈ ప్లాన్‌లో ఉందని రాజకీయ సమీకరణాలు లెక్కలన్నీ వేసుకున్న తర్వాత స్పష్టత వస్తుంది. అందుకే తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచే వరకూ జాతీయస్థాయి నేతల ఇమేజ్ ను కూడా కేసీఆర్ తెలంగాణలో ఉపయోగించుకుంటారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నారు. ప్రస్తుతానికి కమిటీలను నియమించినా రాజకీయం మాత్రం తెలంగాణలోనే చేయనున్నారు.