బీసీసీఐ ఎందుకలా చేస్తోంది. దేశానికి ప్రాతినిథ్యం వహించే ఆటగాళ్ల విషయంలో సెలెక్టర్లకు ఎందుకంత పక్షపాత ధోరణి. శ్రీలంకతో తొలి వన్డేలో టీమిండియా గెలిచింది కాబట్టి సరిపోయింది లేకపోతే ఈపాటికే సెలక్షన్ కమిటీ దుమ్ముదులిపేసేవాళ్లు క్రికెట్ ఫ్యాన్స్. సెలెక్టర్ల వ్యవహార శైలిపై ఈ మధ్యకాలంలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను బెంచ్‌పైన కూర్చోబెడుతున్నారు. విశ్రాంతి పేరుతో కొందరిని పక్కనబెడుతున్నారు. ఫామ్‌లో లేని ఆటగాళ్లను తీసుకొచ్చి ఆడిస్తున్నారు. గతంలో పంత్ ఫెయిల్యూర్ అయినా అతన్ని కొనసాగిస్తూ శాంసన్‌ను పక్కనబెట్టడం విమర్శలకు తావిచ్చింది. కొంతకాలంగా కేఎల్ రాహుల్ ఆశించిన మేర రాణించలేకపోయినా జట్టులోకి తీసుకోవడాన్ని వెంకటేశ్ ప్రసాద్ లాంటి సీనియర్లు తప్పుబడుతున్నారు కూడా.
శ్రీలంకతో తొలి వన్డేకు ఎంపిక చేసిన భారత తుది జట్టుపై ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అభిమానులే కాదు మాజీ క్రికెటర్లు విశ్లేషకులు సైతం టీమిండియా మేనేజ్ మెంట్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. టీ 20 సిరీస్‌లో అదరగొట్టిన స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు యువ ఓపెనర్ ఇషాన్ కిషన్, మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను వన్డేలకు ఎంపిక చేయలేదు. రెడ్ హాట్ ఫామ్‌లో ఉన్న ఈ ముగ్గురి ఆటగాళ్లను బెంచ్‌పై కూర్చోబెట్టడాన్ని సహించలేకపోయారు. ఇదేం టీమ్ సెలెక్షన్ అంటూ ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. రోహిత్ శర్మ, బీసీసీఐ, హ్యాష్ ట్యాగ్‌లు ట్విటర్‌లో ట్రెండింగ్‌లో నిలిచాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలోనూ ఫామ్‌లో ఉన్న సమయంలో విరాట్‌ను విశ్రాంతి పేరుతో పక్కనబెట్టారు. టీమ్ సెలక్షన్‌లో ప్రతీసారి వివక్ష కనిపిస్తోంది. ఫస్ట్ వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈపాటికే సోషల్ మీడియాలో విమర్శల పర్వం నడిచేది.
శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో సెంచరీతో చెలరేగి ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు సూర్యకుమార్ యాదవ్. తనకే సాధ్యమైన 360 ఆటతో శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. అలాంటి సూర్యను పక్కనపెట్టడం ప్రతీ ఒక్కరినీ షాక్‌కు గురిచేసింది. బంగ్లాదేశ్ పర్యటనలో ఓపెనర్‌గా బరిలోకి దిగి డబుల్ సెంచరీ బాదిన ఇషాన్ కిషన్‌కు టీమ్‌మేనేజ్‌మెంట్ మొండిచెయ్యే చూపించింది. శుభ్‌మన్ గిల్‌ను సాకుగా చూపిస్తూ ఇషాన్ కిషన్‌పై వేటు వేసింది. వాస్తవానికి కేఎల్ రాహుల్ కోసమే ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌ను పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా నిలకడలేమి ఫామ్‌తో టీమిండియా ఓటములకు కారణమవుతున్న కేఎల్ రాహుల్‌కు అవకాశాలు ఇవ్వడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మలే కేఎల్ రాహుల్‌కు అనవసర ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఇటీవల కాలంలో సంజూ శాంసన్‌లాంటి ప్లేయర్‌ను పక్కనబెట్టి విమర్శలు ఎదుర్కొన్న సెలెక్టర్లు శ్రీలంకతో టీ 20 సిరీస్‌కు తీసుకున్నారు. ఆడిన ఒక్క మ్యాచ్‌లో అతను విఫలం కావడంతో సునీల్ గవాస్కర్ లాంటి ఆటగాళ్లు అమావాస్య, పౌర్ణమికి వచ్చే అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోకపోతే ఎలా అని తిట్టిపోశారు. ఆ తర్వాత చూస్తే గాయం పేరుతో సంజూ ఇంటి బాట పట్టాడు. సంజూ ఆడిన ఒక్క మ్యాచ్‌లో రాణించకపోతేనే విమర్శలు గుప్పించారు. కానీ కొంతమంది ఆటగాళ్లు ఏదో ఒక్క మ్యాచ్‌లో రాణిస్తే వారికి సుస్థిర స్థానం కల్పిస్తున్నారు. క్రికెట్‌లో ఇదేం రాజకీయమో క్రీడాభిమానులకు అంతుబట్టడం లేదు.
వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. గతేడాది కాలంగా బెంచ్‌కే పరిమితం అవుతున్న ఈ మణికట్టు స్పిన్నర్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నా పట్టించుకోవడం లేదు. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పెర్ఫామెన్స్ ఇచ్చినా మరుసటి మ్యాచ్‌కే పక్కనపెట్టారు. తాజా మ్యాచ్‌కు పరిగణలోకి తీసుకోలేదు. టీమిండియాను ఆ దేవుడే కాపాడాలని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. రెండు ప్రపంచకప్‌లు కోల్పోయినా బుద్ది రావడం లేదంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు.