ఆస్కార్ అవార్డు అనేది సినిమా వాళ్లకు ఒక కల. ప్రతిఏటా జరిగే ఆస్కార్ వేడుకల్లో పాల్గొనడమే అవార్డుగా భావిస్తారు చాలామంది. అవార్డు రాకపోయినా ఫరవాలేదు కనీసం నామినేట్ అయితే అదే పదివేలు అనుకునేవారు కూడా ఉన్నారు. ఈ ఏడాది మార్చి 12న జరగబోయే 95వ అస్కార్ వేడుకలకు సంబంధించిన సందడి ఇప్పటినుంచే మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా 301 సినిమాలు ఈ ఏడాది ఆస్కార్ పురస్కారాల కోసం పోటీ పడుతున్నాయి. వాటిలో పది భారతీయ సినిమాలు కూడా నామినేషన్ రేసులో ఉన్నాయి. మొదటి జాబితాలో తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్తో పాటు గుజరాతీ సినిమా చెల్లో షో, మరాఠీ నుంచి మీ వసంతరావ్, తుజ్యా సాథీ కహా హై, తమిళ్ సినిమా ఇరవిన్ నిళల్ ఆస్కార్ నామినేషన్ షార్ట్ లిస్టులో ఉన్నాయి. ఇక ఆస్కార్ అవార్డులకు పోటీపడేందుకు అవకాశం ఉన్న 301 చిత్రాల్లోని మిగతా జాబితాను ఆస్కార్ కమిటీ తాజాగా విడుదల చేసింది.
వాటిలో ఇండియా నుంచి హిందీ సినిమాలు కశ్మీర్ ఫైల్స్, గంగూబాయి కతియావాడి, కన్నడ సినిమాలు కాంతారా, విక్రాంత్ రోణ, తమిళ్ సినిమా రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ చోటు దక్కించుకున్నాయి. ఈ పది సినిమాల్లో గుజరాతీ సినిమా ఛెల్లో షో ఆస్కార్ ను నామినేషన్స్ కోసం పంపిస్తున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. మిగతా తొమ్మిది సినిమాలు ఓపెన్ కేటగిరీలో నిలిచాయి. ఇకపోతే ఆర్ఆర్ఆర్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్, ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో షార్ట్ లిస్టు జాబితాలో నిలిచింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు విభాగాల్లో కాంతారా పోటీ పడుతోంది. వీటితో పాటు విక్రమ్ రోణ, గంగూబాయి కతియావాడి, కశ్మీర్‌ఫైల్స్ ఉత్తమ చిత్రం కేటగిరీలో చోటు సంపాదించుకున్నాయి. తుది జాబితాలో చోట దక్కించుకునే సినిమాలపై ఓటింగ్ ప్రారంభమైంది. తుది నామినేషన్ల లిస్టును ఈ నెల 24వ తేదీన ప్రకటిస్తారు. ఆ జాబితాలో ఒక్కటైనా భారతీయ సినిమా ఉండాలని అందులోనే మన తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.