తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ను ఉన్న పళంగా అప్పీల్‌కు కూడా చాన్స్ లేకుండా ఏపీ క్యాడర్‌కు మార్పు చేయడం ఇప్పుడు అటు రాజకీయవర్గాల్లోనే కాదు ఇటు అధికారవర్గాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల ఏడాది. ఏం జరిగినా రాజకీయం లేదని అనుకోలేం. ఎందుకంటే అధికార రాజకీయం ఎప్పుడూ దుర్వినియోగమవుతూనే ఉంది. కానీ ఇప్పుడు అది సరికొత్త శిఖరాలకు చేరుతోంది. ఇలా అని బాధపడుతూ కూర్చుంటే రాజకీయ పార్టీలు విలువైన సమయం కోల్పోతాయి. ఎదుర్కోవడమే మిగిలింది. ఇప్పుడు సోమేష్ కుమార్ ఉదంతంతో బీజేపీ బీఆర్ఎస్కు ఊహించని సవాల్ విసిరింది. ఈ సవాల్ ను బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సమర్థంగా తిప్పి కొట్టకపోతే ఎన్నికలకు రాక ముందే చేతులెత్తేయాల్సి వస్తుంది. ఇంతకూ ఆ సవాల్ ఏమిటి ? బీజేపీ మాస్టర్ ప్లాన్ ఏమిటి ? దీనికి కేసీఆర్ వద్ద విరుగుడు ఉందా ?
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించినప్పటి నుండి అధికారుల కేటాయింపు సమస్య ఉంది. అప్పట్లో సోమేష్ కుమార్‌తో పాటు పలువురు అధికారుల్ని ఏపీకి కేటాయించారు. చాలా మంది క్యాట్‌కు వెళ్లి నిలుపుదల ఉత్తర్వులు తెచ్చుకుని తెలంగాణలోనే కొనసాగుతున్నారు. అలాంటి వారిలో సీఎస్ సోమేష్ కుమార్ ఒకరు. ఇప్పుడు దాదాపుగా ఎనిమిదేళ్ల తర్వాత ఆయనను ఏపీకి పంపుతూ ఉత్తర్వులు ఇచ్చేశాయి. ఉదయం హైకోర్టు తీర్పు రావడం సాయంత్రానికి డీవోపీటీ ఆర్డర్స్ ఇవ్వడం తర్వాత ఒక్క రోజులోనే ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశించడం చకచకా జరిగిపోయాయి. ఇంత కాలం సైలెంట్‌గా ఉండి ఇప్పుడే ఎందుకు ఇవి జరిగాయని ఒక్క సారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే అసలు బీజేపీ మాస్టర్ ప్లాన్ అర్థమయ్యే అవకాశం ఉంది.
ఏ అధికార పార్టీకి అయినా ఎన్నికల్లో ఆ అధికారం అడ్వాంటేజ్ లా ఉంటుంది. సుదీర్ఘ కాలం పరిపాలిస్తున్న బీఆర్ఎస్కు ఈ విషయంలో స్పెషల్ అడ్వాంటేజ్ ఉంటుంది. తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీకి కూడా కేంద్రంలో ఈ అధికార అడ్వాంటేజ్ ఉంది. అంటే తెలంగాణలో రెండు పవర్ ఫుల్ పార్టీల మధ్య పోరు జరుగుతోంది. ఇలాంటి సమయంలో అధికారం అనే అడ్వాంటేజ్ ఎవరికి ఎక్కువ ఉంటే ఎన్నికల్లోనూ వారికే అడ్వాంటేజ్. ఈ విషయంలో బీజేపీ ముందుగానే రాజకీయ వ్యూహాలను అమలు చేయడం ప్రారంభించిందని సోమేష్ కుమార్ ఉదంతంతో స్పష్టమవుతోందని అనుకోవచ్చు. ఇందులో ప్రధానమైనది బీఆర్ఎస్కు అధికార పార్టీ అనే అడ్వాంటేజ్ లేకుండా చేయడం.
గత ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఏర్పడిన పరిస్థితి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక సీఎస్‌ను మార్చేసి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు చాన్సిచ్చింది. అయన మొత్తం ఎన్నికల నిర్వహణను హైజాక్ చేసేశారు. తర్వాత జరిగిన కథేమిటో అందరికీ తెలుసు. అయితే తెలంగాణలో బీజేపీ అక్కడి వరకూ ఎదురు చూడటం లేదు. అలా చేస్తే కేసీఆర్ చేయగలిగే రాజకీయం ఏమిటో బీజేపీకి తెలుసు కాబట్టి ముందుగానే రంగంలోకి దిగారని అనుకోవచ్చు. ఎన్నికల నోటిఫికేషన్ రాకుండానే ఎన్నికల సంఘం చేతికి అధికారం పోకుండా చీఫ్ సెక్రటరీని గెంటివేసినంత పని చేశారు. అదీ కూడా ఇతర ఐఏఎస్ లు టెన్షన్ పడే రేంజ్లో ఈ పరిణామం చోటు చేసుకుంది.
తెలంగాణలో ఏపీ క్యాడర్ కు కేటాయించినప్పటికీ కొనసాగుతున్న సివిల్ సర్వీస్ అధికారులు ఉన్నారు. క్యాట్ కు వెళ్లి ఆదేశాలు తెచ్చుకుని ఉంటున్నారు. ఇలాంటి వారు కీలక పొజిషన్లలో ఉన్నారు. ఇప్పుడు సోమేష్ కుమార్ వ్యవహారంతో వారంతా టెన్షన్ పడక తప్పదు. సీనియర్ సివిల్ సర్వీస్ అధికారులు ప్రభుత్వానికి మద్దతుగా ఉంటున్నారని కొద్ది రోజులుగా తెలంగాణ బీజేపీ విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలో సోమేష్ పై వేటు వేయడం ద్వారా ఇతర అధికారులకు స్పష్టమైన సందేశాన్ని బీజేపీ పంపినట్లయింది. ఐపీఎస్ అధికారులు కూడా అలాంటి వారు ఉన్నారు. ఇటీవల కొత్త డీజీపీగా నియమితులైన అంజనీ కుమార్ కూడా ఏపీ క్యాడర్ అధికారి. ఆయనకూ టెన్షన్ లేకుండా ఉంటుందా? డీజీపీ పోస్టు నుంచి ఆయనను ఏపీ క్యాడర్ కు తరలిస్తే ఎలాంటి సిట్యూయేషన్ అనుభవించాలో అంజనీకుమార్ కుతెలియకుండా ఉంటుందా?
ఖచ్చితంగా ఇలాంటి ఆందోళన కోసమే బీజేపీ ప్రయత్నిస్తోంది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులు సీబీఐ విచారణ ఎదుర్కొనే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు డీజీపీ కూడా ఏపీ క్యాడర్ వివాదంలో ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో అసలు ఎన్నికలకు ఇంకా పది నెలల వరకూ సమయం ఉండాగనే అధికార యంత్రాంగానికి బీజేపీ డైరక్ట్ హెచ్చరికలు పంపినట్లయింది.
అటు ఐపీఎస్ అధికారులు ఇటు ఐఏఎస్ అధికారులను బీజేపీ ఫిక్స్ చేసినట్లయింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఫేవర్‌గా ఉండటానికి సివిల్ సర్వీస్ అధికారులు సిద్ధపడకపోతే ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు అలాంటి సవాలే ఎదురవబోతోంది. సోమేష్ కుమార్ అనే ఒక్క షాట్‌తో మొత్తం అధికార యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకునేందుకు బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసింది. ఇప్పుడు దీనికి కేసీఆర్ కౌంటర్ ఇవ్వాల్సి ఉంది. లేకపోతే అధికార వర్గం పూర్తిగా వన్ సైడ్ అయిపోతారు. అది చాలా డేంజర్.