రాజ‌కుటుంబం డార్క్ సీక్రెట్స్‌.. హ్యారీ పుస్త‌కం హాట్‌కేక్‌

By KTV Telugu On 12 January, 2023
image

రాచ‌రికాన్ని వ‌ద్ద‌నుకున్నాడు. రాజ‌కుటుంబాన్ని వీడి సామాన్యుడిలా బ‌తుకుతున్నాడు. బ్రిట‌న్ రాజ‌కుటుంబ నేప‌థ్యం ఉన్న వ్య‌క్తి అంత‌రంగాన్ని ఆవిష్క‌రిస్తే అంద‌రికీ ఆస‌క్తే. ఆ పుస్త‌కంలో ఏముందోన‌ని బ్రిట‌న్ ప్ర‌జ‌లు పోటీలు ప‌డి చ‌దువుతున్నారు. బ్రిట‌న్ రాయ‌ల్ ఫ్యామిలీకి చెందిన ప్రిన్స్‌ హ్యారీ రాసిన స్వీయ జీవిత చరిత్ర పుస్తకం స్పేర్ యూకేలో హాట్‌కేకులా అమ్ముడుపోతోంది. విడుదలైన మొద‌టిరోజే ఏకంగా 4  లక్షల కాపీలు సేల్ అయ్యాయి. బ్రిటన్‌లో ఇప్పటిదాకా అత్యంత వేగంగా అమ్ముడవుతున్న నాన్ ఫిక్షన్‌ పుస్తకంగా హ్యారీ రాసిన స్పేర్ కొత్త రికార్డు సృష్టిస్తోంది.

ప్రిన్స్ హ్యారీ పుస్త‌కాన్ని అఫీషియ‌ల్‌గా లాంచ్ చేసేందుకు బ్రిట‌న్‌లోని బుక్‌షాప్స్ అర్ధ‌రాత్రి త‌ర్వాత ప్ర‌త్యేకంతా తెరుచుకోవ‌డం ఓ సంచ‌ల‌నం. సూప‌ర్‌స్టార్ కొత్త సిన్మా టికెట్ల‌కోసం థియేట‌ర్ల ద‌గ్గ‌ర క్యూ క‌ట్టిన‌ట్లు హ్యారీ పుస్త‌కాన్ని అందుకునేందుకు పుస్త‌క‌ప్రియులు బారులు తీరారు. హార్డ్‌కాపీతో పాటు ఈ-బుక్‌, ఆడియో ఫార్మాట్‌లలో హ్యారీ రాసిన స్పేర్ అందుబాటులోకి వచ్చింది. పుస్త‌కం రేటు 28 పౌండ్లు (రూ. 2,774) అయినా మొదటి రోజు చాలా దుకాణాలు సగం రేటుకే అమ్మాయి. సాధారణంగా హ్యారీ పోటర్‌ లాంటి ఫిక్షనల్‌ పుస్తకాల‌కు మొద‌టిరోజు భారీ డిమాండ్‌ ఉంటుంది. కానీ ఓ నాన్‌ ఫిక్షనల్ పుస్త‌కానికి ఇంత గిరాకీ తొలిసార‌ని విక్రేత‌లు చెబుతున్నారు.

బ్రిటన్ రాజ కుటుంబ సభ్యుడిగా త‌న అనుభ‌వాల‌తో ప్రిన్స్ హ్యారీ ‘స్పేర్’ పేరిట స్వీయ జీవిత చరిత్రను రాశారు. ఇందులో ఆయన వెల్లడించిన కొన్ని విషయాలు సంచలనంగా మారాయి. బాల్యంలో హ్యారీకి తన సోదరుడితో ఉన్న బంధం గురించిన మరో విషయం ఈ పుస్త‌కంతో వెలుగులోకి వచ్చింది. త‌న‌కంటే రెండేళ్ల పెద్ద‌వాడైన విల్లీ (ప్రిన్స్ విలియ‌మ్‌) బ్రిట‌న్ రాజ సింహాసనానికి వారసుడ‌ని హ్యారీ చెప్పుకున్నారు. నేను స్పేర్‌(అదనం)న‌ని, విలియ‌మ్ నీడ‌న‌ని రాసుకున్నాడు. ప్లాన్‌ ఏ పనిచేయనప్పుడు ప్లాన్ బీగా త‌న‌ను వాడ‌తార‌ని, విల్లీకి జరగరానిది ఏదైనా జరిగితే అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు త‌న‌ను ఈ లోకంలోకి తీసుకొచ్చార‌ని ప్రిన్స్ హ్యారీ ఆ పుస్త‌కంలో రాసుకున్నాడు.

ప్రిన్స్ హ్యారీ పుస్త‌కంలో రాయ‌ల్ ఫ్యామిలీలో త‌న‌కు ఎదురైన అనుభ‌వాలు, అవ‌మానాలు ‘స్పేర్’తో సంచ‌లనంగా మారాయి. తండ్రి కింగ్‌ ఛార్లెస్‌, సవతి తల్లి కెమిల్లా, అన్నయ్య ప్రిన్స్‌ విలియ‌మ్ అంద‌రి వ్య‌వ‌హార‌శైలి గురించీ హ్యారీ పుస్త‌కంలో రాశాడు. తన భార్య మేఘన్‌ మెర్కెల్‌ను రాజకుటుంబం ఎంత క్షోభ పెట్టిందో చెప్పుకున్నాడు. త‌న 20 ఏళ్ల వయస్సులో తండ్రి చెప్పిన మాటల గురించి ఎవరో అంటుంటే విన్నానంటూ వాటికి య‌థాత‌థంగా అక్ష‌ర‌రూపం ఇచ్చాడు హ్యారీ. అవి నేను పుట్టినప్పుడు అమ్మతో నాన్న చెప్పిన మాటలు. ‘అద్భుతం.. నువ్వు నాకు వారసుడు, స్పేర్‌ని ఇచ్చావు. నేను నా పని పూర్తి చేశాను’ అన్న‌ది ఆ మాటల సారాంశం.

రాజ‌కుటుంబ‌మే వ‌ద్ద‌నుకుని బ‌య‌టికొచ్చిన హ్యారీ ఇన్నాళ్ల‌కు త‌న జీవిత‌చ‌రిత్ర‌ను ప్ర‌జ‌ల్లో పెట్టాడంటే డ‌బ్బుకోసం కాదు. సామాన్యుడిలా ఆలోచించినందుకు రాజ‌సౌధం నుంచి వెలేయ‌బ‌డ్డ హ్యారీ గుండెల్లో ఎన్నో బ‌డ‌బాగ్నులు ర‌గులుతున్నాయి. అందులోంచి పొంగిన ఆవేద‌న‌లో ఈ పుస‌క్తం ఓ అంకం మాత్ర‌మే. రాజ‌కోట ర‌హ‌స్యాలు మున్ముందు ఇంకెన్ని బ‌య‌టికి వ‌స్తాయో!