8 ఏళ్లకు కేంద్రానికి తెలంగాణ గుర్తొచ్చిందా? రాజకీయం కోసమే ఆవిర్భావమా ?

By KTV Telugu On 2 June, 2022
image

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై ప్రధాని నరేంద్రమోదీ ఎప్పుడూ విమర్శలు చేస్తూనే ఉంటారు.  సాక్షాత్తూ పార్లమెంట్‌లోనే తలుపులు మూసి రాష్ట్ర విభజన చేశారని.. చెబుతూ ఉంటారు. పార్లమెంటు సాక్షిగా ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మాన్ని, తెలంగాణను ప్రధాని మోదీ అవమానించారని అనేక సార్లు టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూనే ఉంటారు. కానీ మోదీ మాత్రం తాను చెప్పే మాటల్ని ఎప్పటికప్పుడు వల్లే వేస్తూనే ఉంటారు.  దానికి తగ్గట్లుగానే కేంద్ర ప్రభుత్వం ఇంత వరకూ అధికారికంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్ని నిర్వహించలేదు. కానీ తొలి సారి ఆ పని చేస్తోంది. ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్ని నిర్వహిస్తోంది.

ఢిల్లీలో ప్రతీ ఏడాది తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో  ఆవిర్భావ వేడుకలు !

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ప్రతీ ఏడాది ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుంది. తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన వారికి సన్మానం చేస్తుంది. గత ఏడాది వరకూ  బీజేపీ నేతలకు ఈ సన్మానం అందేది. ఈ సారి కూడా తెలంగాణ భవన్  ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తోంది. తెలంగాణలో రాజకీయంగా సున్నితమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణ ఏర్పాటు విషయంపై ప్రధాని మోదీ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం చేశారు. నిరసనలు కూడా చేపట్టారు. ఈ క్రమంలో ఈ సారి బీజేపీ నేతలకు ఆహ్వానం అందే అవకాశం లేదు. అయితే తెలంగాణ ఏర్పాటు ఉత్సవాల్ని మాత్రం ఘనంగా నిర్వహిస్తున్నారు.

ఈ సారి కేంద్రం కూడా చేస్తోంది!

బీజేపీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లయింది. ఏడేళ్ల పాటు తెలంగాణ ఆవిర్భవాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం తొలిసారిగా అధికారికంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. కిషన్ రెడ్డి చూసుకుంటున్న పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగే అధికారిక తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ కల్చరల్ సెంటర్‌లో  ఈ కార్యక్రమం జరుగుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ప్రకారం తెలంగాణను ఏర్పాటు చేశాం కాబట్టి అంబేద్కర్ భవన్‌లో నిర్వహిస్తున్నామని కేంద్రం చెబుతోంది.  తెలంగాణ సింగర్  హేమచంద్ర సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. మంచి విందు కూడా ఏర్పాటు చేశారు. సహజంగా ఢిల్లీ కాబట్టి కేంద్రం ఎక్కువ మందిని పిలిచి హడావుడి చేయడం ఖాయంగానే కనిపిస్తోంది.

రాజకీయం కోసమే ఆవిర్భావ వేడకులు !

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సమయంలో ఎప్పుడూ లేని విధంగా  కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించడం ఆసక్తికరంగా మారింది.  ఈ సారి రాజకీయం మారింది. అందుకే బీజేపీ నేతలు సొంతంగా ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించాలని ప్లాన్ చేశారు. పార్టీ పరంగా అయితే ప్రాధాన్యత ఉండదని.. నేరుగా కేంద్ర ప్రభుత్వ ఖాతాలోనే వేడుక నిర్వహిస్తున్నారు.  కానీ ఎక్కువ మంది తెలంగాణ వాదులు మాత్రం ఇంత కాలం ఎందుకు నిర్వహించలేదన్న ప్రశ్న వినిపిస్తున్నారు. దీనికి బీజేపీ నేతలు సమాధానం చెప్పాల్సి ఉంది.

మోదీ పదే పదే చేస్తున్న వ్యాఖ్యలకు వివరణ ఇస్తారా ?

తెలంగాణ విభజన అన్యాయం అన్నట్లుగా మోదీ తరచూ చేస్తున్న ప్రకటనలకు బీజేపీ నేతలు వివరణ ఇవ్వాలన్న డిమాండ్లు టీఆర్ఎస్ నుంచే కాదు..  ఇతర పార్టీల్లోని తెలంగాణ వాదుల నుంచీ వస్తున్నాయి. దీనిపై ఆవిర్భావ దినోత్సవంలో స్పందిస్తే.. తెలంగాణ సమాజంలో అనుమానాలు తొలగిపోతాయి. లేకపోతే.. బీజేపీని అనుమానాస్పదంగానే చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.