జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడి నివాసానికి వెళ్లి కలవడం మూడు గంటల పాటు భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో కాక రేపిందనే చెప్పాలి.
కొద్ది వారాల క్రితం పవన్ కళ్యాణ్ ఉన్న హోటల్ కు చంద్రబాబు నాయుడు వెళ్లి పవన్ ను పరామర్శించే పేరిట జనసేనకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నా అప్పుడే జనసేన-టిడిపిలు పొత్తుల కోసం ఇలా కంగారు పడాల్సిన అవసరం ఏంటో అర్ధం కావడం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇక జనసేన-టిడిపిల భేటీపై సహజంగానే ఏపీలో పాలక పక్షమైన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు కొంచెం అతిగానే స్పందించినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే జనసేన అనేది ఓ రాజకీయ పార్టీ. టిడిపి అనేది మరో రాజకీయ పార్టీ. ఆ రెండు పార్టీలు ఎందుకోసం కలిసినా అది వారి సొంత వ్యవహారమే తప్ప అందులో మూడో పార్టీకి సంబంధం లేదు. మరి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఎందుకు కంగారు పడిందో అర్ధం కావడం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు.
పవన్-చంద్రబాబు భేటీ అయిన మరుక్షణం నుంచే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ మంత్రులు ఇద్దరి భేటీపై రక రకాల వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి పండక్కి గంగిరెద్దు ప్రతీ ఇంటికీ వెళ్లినట్లే పవన్ చంద్రబాబు దగ్గరకు వెళ్లారన్నారు. సంక్రాంతి వస్తోంది కదా పండగ మామూలు కోసమో ప్యాకేజీ కోసమో వెళ్లారని అన్నారు. నిజానికి ఇంత ఉలిక్కి పడాల్సిన అవసరం ఏమొచ్చిందన్నదే ప్రశ్న. ఒక పక్క జనసేన-టిడిపిలే కాదు ఎన్ని పార్టీలు కలిసి కట్టుగా పొత్తులు పెట్టుకుని వచ్చినా తాము 175కి 175 స్థానాలూ గెలుస్తామని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ ధీమా నిజంగానే మనస్ఫూర్తిగానే ఉంటే పవన్-బాబుల కలయిక తో అంత ఆగమేఘాల మీద స్పందించాల్సిన అవసరం ఏమిటి? దీనర్ధం ఏంటంటే జనసేన-టిడిపిలు పొత్తు పెట్టుకుంటే ఎంతో కొంత మేర వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు నష్టం వాటిల్లుతుందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోందని అనుకోవాలి. అదే లేకపోతే పవన్ బాబులు కలిసినా మాట్లాడుకున్నా లేదంటే పాటలు పాడుకుని డ్యూయెట్లు వేసుకున్నా పాలక పక్ష నేతలు పట్టించుకోనే కూడదు. అయినా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ మంత్రులు ఇతర నేతలు పవన్ పైనా చంద్రబాబు పైనా ఇద్దరి భేటీ పైనా వారి పొత్తు ఆలోచనలపైనా రక రకాలుగా మాట్లాడారూ అంటే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నాయకత్వంలో ఏదో కంగారు మొదలైందనే అనుకోవాలి.
పవన్ కళ్యాణ్ పార్టీకి 2019 ఎన్నికల్లో 6 శాతం ఓట్లు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో మరో రెండు మూడు శాతం ఓట్లు పెరగచ్చు. లేదా టిడిపితో పొత్తు పెట్టుకుంటే ఓ శాతం తగ్గనూ వచ్చు. ఏం జరుగుతుందో ముందే ఊహించలేం. జనసేనకు వచ్చే ఆపాటి ఓట్లతో అది సీట్లు సాధించలేకపోవచ్చు. అధికారంలోకి రాలేకపోవచ్చు. కానీ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల విజయావకాశాలనే కొన్ని నియోజక వర్గాల్లో నిర్దేశించే స్థితిలో జనసేన ఉంటుందన్నది రాజకీయ పండితుల అంచనా. అది ఎన్ని నియోజక వర్గాల్లో అన్నది ఇప్పుడే చెప్పలేం. 2019 ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస పార్టీకి 50 శాతానికి పైనే ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత గత మూడున్నరేళ్లుగా జరిగిన వివిధ స్థానిక సంస్థల ఎన్నికలు, ఉప ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఓటు శాతం విపరీతంగా పెరిగింది. కొన్ని చోట్ల 80 శాతానికి పైనే వచ్చాయి. 2024 ఎన్నికల్లోనూ ఇదే స్థాయిలో పడతాయా అంటే గ్యారంటీ ఇవ్వలేం.కొంత కాలంగా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రశ్నిస్తున్నారు. 175కి 175 నియోజకవర్గాల్లోనూ గెలవగలమన్న ధీమా వ్యక్తం చేసిన పార్టీ మరి పవన్ – బాబులు కొంత సేపు మాట్లాడుకుంటేనే ఎందుకు ఉలిక్కి పడిందో చెప్పాలని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు.
విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ బిజెపితో పొత్తులో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి-జనసేన-బిజెపిలు పొత్తు పెట్టుకుంటే బాగుంఉటందని పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పినట్లు సమాచారం. టిడిపితో పొత్తుకు నరేంద్ర మోదీ ససేమిరా అన్నారని వినిపిస్తోంది. అయితే పవన్ మాత్రం చంద్రబాబు తో కలిసే ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు అర్ధం అవుతోంది. అందుకే ఇపుడు ఆయన చంద్రబాబును కలిశారని అంటున్నారు. బిజెపిని కాదని టిడిపితోనే పోవాలని పవన్ అనుకోవడంలో రాజకీయ పరిణితే ఉందని అనుకోవాలి. ఎందుకంటే ఏపీలో బిజెపికి 2 శాతం ఓట్లు కూడా లేవు. మరి 2024 ఎన్నికల్లో కనీసం కొన్ని స్థానాల్లో అయినా జనసేన అభ్యర్ధులను గెలిపించుకుని అసెంబ్లీలో హల్ చల్ చేయాలని పంతంగా ఉన్న పవన్ కళ్యాణ్ బిజెపితో కలిసి వెళ్తే తన కలను నెరవేర్చుకోలేరు. అదే టిడిపితో పొత్తు పెట్టుకుని తమ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న చోట ఆ నియోజక వర్గాలను తమకి కేటాయించేలా చేసుకుంటే కొద్ది మంది అయినా జనసేన ఎమ్మెల్యేలుగా మెరిసే అవకాశాలు ఉంటాయన్నది పవన్ వ్యూహంగా కనిపిస్తోంది.
అయితే ఈ ఇద్దరి భేటీని ప్రశ్నిస్తోన్న వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం జనసేన-టిడిపిలు పొత్తు పెట్టుకుంటే ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరో ముందే ప్రకటించాలంటున్నారు. పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలని కాపులు ఆకాంక్షిస్తారు. అందులో అతిశయోక్తి లేదు. కానీ చంద్రబాబు నాయుణ్ని ముఖ్యమంత్రిని చేయడం కోసం కాపులంతా ఒక్కతాటిపైకి వచ్చి ఎందుకు శ్రమించాలని వై.ఆఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి చెందిన కాపు నేతలు నిలదీస్తున్నారు. అలా ప్రశ్నించడం ద్వారా కాపు సామాజిక వర్గానికి చెందిన మేథావుల్లో పవన్ వైఖరిపై చర్చ మొదలు పెట్టించాలన్నది పాలక పక్ష వ్యూహం కావచ్చు. పవన్ -బాబు అయితే కలిశారు. మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారో ఎవరికీ తెలీదు. పొత్తుల గురించి ఏం మాట్లాడుకున్నారు? జనసేనకు ఎన్ని స్థానాలు కేటాయిస్తారు? ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరు? అన్న అంశాలపై మాట్లాడుకున్నారో లేదో పవన్ కానీ బాబు కానీ చెబితేనే తెలుస్తుంది. దానికి చాలా సమయం ఉందని ఇద్దరు నేతలూ మీడియాతో చెప్పారు. సో జనసేన-టిడిపి అయితే కలిసి పొత్తు పెట్టుకోవడం ఇంచుమించు ఖాయమని ఈ భేటీ తేల్చిందంటున్నారు రాజకీయ పండితులు.