జగన్‌ టార్గెట్‌గా వీరసింహారెడ్డి వీరవిహారం

By KTV Telugu On 12 January, 2023
image

ఏపీలో వైసీపీ టీడీపీ మధ్య పొలిటికల్ వార్ బాలయ్య సినిమాతో మరింత వేడెక్కనుంది. జగన్ సర్కార్ టార్గెట్‌గా వీరసింహారెడ్డి రెచ్చిపోయారు. రెండ్రోజుల ముందే అభిమానులకు పండుగ తీసుకొచ్చారు బాలకృష్ణ. సంక్రాంతికి తన ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించారు. జగన్ సర్కార్ పాలనను ఎండగడుతూ బాలయ్య తన సినిమాలో విసిరిన పంచ్‌ డైలాగులు ఏపీ రాజకీయాలను హీటెక్కించాయి. బాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్స్ టీడీపీ కార్యకర్తలతో పాటు వైసీపీ వ్యతిరేకులందరికీ పండగ చేసేలా ఉన్నాయి. బాలయ్య కొత్త సినిమా అంటే కచ్చితంగా పంచ్ డైలాగుల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అందులోనూ ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ బాగా పెరిగింది. టీడీపీ, వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ మంటలో కాస్త పెట్రోల్ పోశారు వీరసింహారెడ్డి. వైరి వర్గం ఉలిక్కిపడేలా బాలయ్య అభిమానుల ఆశల్ని అంచనాల్ని నిజం చేశారు డైరెక్టర్ గోపిచంద్ మలినేని.

ప్రస్తుతం ఏపీలో చోటు చేసుకున్న పలు పరిణామాల్ని, ఏపీ ఎలా నష్టపోయిందన్న అంశాల్ని టచ్ చేస్తూ బాలయ్య డైలాగ్ వార్ సాగిపోయింది. రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో సాగుతున్న విధ్వంసం దాడులు కొత్త పరిశ్రమలు రాకపోవడం, ఉన్నవి కూడా రాష్ట్రం వీడి వెళ్లిపోవడం ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు తొలిసారి జగన్ అధికారంలోకి రావడం, అధికారం అండతో తీసుకుంటున్న నిర్ణయాలపై వీరసింహారెడ్డిలో పలు సీన్లలో బాలయ్య తీవ్ర పదజాలంతో పంచ్ లు విసిరారు. సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందోమో కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు మార్చలేరు అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగ్ ప్రభుత్వానికి గట్టి కౌంటర్ ఇచ్చినట్లు ఉంది. గతంలో సీఎం జగన్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అప్పట్లో అది సినీ రాజకీయంగా పెద్ద రచ్చ అయ్యింది. అభివృద్ధి ఎక్కడ అంటూ సాగిన ప్రశ్న, ప్రజలు ఎన్నుకున్న వెధవలు, గౌరవించడం మన బాధ్యత అంటూ సాగిన పంచులతో వైసీపీని ఇండైరెక్ట్‌గా కొట్టారు. అలాగే పదవి చూసుకొని నీకు పొగరేమో, బై బర్త్ నా డీఎన్ఏ కే పొగరు ఎక్కువ అనే డైలాగ్ పక్కాగా జగన్‌ను టార్గెట్ చేసినట్టే ఉంది. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సమస్యను బాలయ్య తన సినిమాలో హైలెట్ చేశారు. కట్టడం అభివృద్ధి, కూల్చటం అభివృద్ధి కాదు అంటూ ఇలా అనేక విషయాలను నాన్ స్టాప్ డైలాగులతో వైసీపీకి గురిపెట్టారు.

సంక్రాంతి హీరోగా బాలయ్యకు ఘన చరిత్ర ఉంది. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు. ఇక సింహ సెంటిమెంట్ కూడా యాడ్ కావడంతో వీరసింహారెడ్డిపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. థియేటర్లలో బాలయ్య పంచు డైలాగులను అభిమానులు ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. వైసీపీ బ్యాచ్ మాత్రం సినిమా చూడవద్దు. ఆ పార్టీని బాలయ్య, డైరెక్టర్ గోపిచంద్ గట్టిగా వేసుకొన్నారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఫస్టాఫ్ మాస్‌గా కొనసాగింది. సెకండాఫ్‌లో యాక్షన్ బ్లాక్స్‌లో వైసీపీని టార్గెట్ చేయడమే పెట్టుకొన్నాడు. పొలిటికల్ డైలాగ్స్ పేలిపోయాయి. తమన్ బీజీఎం హైలెట్. సీనియర్ బాలయ్య వన్ మ్యాన్ షో. బీ,సీ సెంటర్లో ఇక కుమ్ముడే అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ సినిమాకి బుర్రా సాయిమాధవ్ మాటలు రాశారు. గతంలో కూడా బాలయ్య సినిమాలకు ఆయన పంచ్ డైలాగురు రాశారు. అవి కూడా బాగా పేలాయి. ఇప్పుడు వీరసింహారెడ్డికి కూడా ఆయన అదిరిపోయే డైలాగులు రాశారని అంటున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ డైలాగుల గురించే చర్చ నడుస్తోంది.