సిన్సియారిటీని ఏ ప్రభుత్వమూ భరించలేదు. అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా నిజాయితీకి నిలువుటద్దాన్ని అని చెప్పుకునే మరో పార్టీ ప్రభుత్వమైనా. ముక్కుసూటిగా మాట్లాడేవారంటే భయం. నిక్కచ్చిగా వ్యవహరించేవారంటే కోపం. అధికారులు నిజాయితీకి నిలువుటద్దాల్లా ఉండాలని, ప్రతీదీ రూల్స్ ప్రకారం చేయాలని ఏ ప్రభుత్వమూ కోరుకోదు. అందుకే ఈ వ్యవస్థ ఎప్పటికీ బాగుపడదు. సిన్సియర్‌గా ఉందామని నిజాయితీగా సేవలు అందిద్దామన్న సంకల్పంతో సర్వీసులోకి అడుగుపెట్టేవారు కూడా తర్వాత తమ ఆలోచన మార్చుకుంటున్నారు. కాకుల గుంపులో కలిసిపోతున్నారు. కానీ మనసును చంపుకోలేని కొందరు తామిలాగే ఉంటానంటున్నారు. ఎన్ని ఇబ్బందులొచ్చినా చచ్చేదాకా మేం ఇంతేనంటున్నారు.
మీరెక్కడికైనా వేసుకోండి. నేనుమాత్రం మారను. మారనంతే అనే అతికొద్దిమంది అధికారుల్లో అశోక్‌ఖేమ్కా ముందుంటారు. ఓ అధికారి పేరు దేశవ్యాప్తంగా అందరినోళ్లలో నానుతోంది అంటేనే ఆయనెంత ప్రత్యేకమో అర్ధమైపోతుంది. 30 ఏళ్ల సర్వీసులో మహా అయితే ఆరేడు ట్రాన్స్ఫర్లు ఉంటాయి. కానీ అశోక్‌ఖేమ్కా ఈమధ్యే 56వసారి బదిలీ అయ్యారు. అంటే సగటున ఏడెనిమిది నెలలకోసారి ఆయన సామాను సర్దేసుకుంటున్నారన్నమాటే! ఏ ఐఏఎస్‌కి ఇంతలా స్థానభ్రంశం కలిగిస్తున్నారంటేనే ఆయన్ని చూసి ప్రభుత్వాలు ఎంతగా భయపడిపోతున్నాయో తెలిసిపోతుంది. ఎందుకంటే ఆయన రూల్బుక్నుంచి ఇంచ్ కూడా పక్కకు జరగరు. అన్నీ పారదర్శకంగా జరగాలంటారు. పిచ్చిమాలోకం. అలా ఎలా కుదురుతుంది. అన్నీ కరెక్ట్‌గా ఉంటే అయినవాళ్లకు పనులెలా అవుతాయి? పర్సెంటేజీలు ఎలా ముడతాయి? అందుకే ఆయనంటే ప్రభుత్వాలకు అంత ఇరిటేషన్.
అశోక్‌ఖేమ్కా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గరు. అక్రమార్కులకు అస్సలు అవకాశం ఇవ్వరు. సర్కారు సొమ్ముని కాజేసేవాళ్ల ఆటలు సాగకుండా కాపలా కుక్కలా ఉండాలనుకుంటారు. బదిలీ అయినప్పుడల్లా ఆయన నిజాయితీకి కొందరు శాల్యూట్ చెప్పడమే కానీ ఆయనకోసం పోరాడలేరు. ఆయన బదిలీల్ని అడ్డుకోలేరు. వారినికి రెండు మూడు ఫైళ్లకు మించిరాని సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో కూడా ఆయన్ని తట్టుకోలేకపోతున్నారంటే లోపం ఎక్కడున్నట్లు? చివరికి ఈగలు తోలుకునే ఆర్కైవ్స్ శాఖ నుంచి కూడా నాలుగుసార్లు బదిలీ చేశారంటే ఆయన నీడను కూడా భరించలేకపోతున్నారన్నమాట! విసుగుపుట్టి ఆయనే రాజీనామా చేసి వెళ్లిపోతారంటే ఆ పనిచేయరు అశోక్‌ఖేమ్కా. ఎందుకంటే ఆయనేమీ అక్రమదారుల్లో అవినీతి సొమ్ము మూటగట్టుకోలేదు. ఎక్కడేసినా ఆ బాధ్యతని పవిత్రంగా చూస్తారు. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాన్ని ఉన్నత విద్యాశాఖలో విలీనం చేయటంతో నాకు పనిలేకుండా పోయిందని అశోక్ఖేమ్కాలాంటి సిన్సియర్ ఐఏఎస్ సర్కారుకు లేఖరాయాల్సి రావడం ఈ వ్యవస్థ దౌర్భాగ్యం. వారానికి కనీసం 40 గంటల పనైనా ఉండాలని చీఫ్ సెక్రటరీకి లేఖరాశాక ఆయన్ని ఇంకో పనిలేని శాఖకు బదిలీచేసింది హర్యానా సర్కారు. పాపం శమించుగాక!