వైసీపీ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో కొంతకాలంగా వివాదాస్పదంగా మారిన జీవో 1ను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉందన్న న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జీవో 1 ను వ్యతిరేకిస్తూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వేసిన పిటీషన్ పై విచారణ జరిపిన కోర్టు ఈనెల 23 వరకు దాన్ని సస్పెండ్ చేసింది. తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు కందుకూరు, గుంటూరు సభల్లో జరిగిన తొక్కిసలాట కారణంగా 11 మంది మృత్యువాత పడ్డారు. ఈ కారణంగా సర్కార్ రహదారులపై రోడ్ షోలు, సభలు, సమావేశాలు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అనుమతితో సభల నిర్వహణకు వీలుగా జీవో జారీ చేసారు. అయితే ప్రతిపక్షాల గొంతు నొక్కే ఉద్దేశంతోనే ప్రభుత్వం కుట్రపూరితంగా జీవో 1 తీసుకొచ్చిందని పిటిషన్లో పేర్కొన్నారు.
సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లకుండా ప్రతిపక్షాలను అడ్డుకోవడానికే ప్రభుత్వం జీవో 1 తీసుకొచ్చిందని పిటీషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇవన్నీ రాజకీయ పరమైన వాదనలే అని అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. సభలు సమావేశాలను నిషేధించలేదని నిబంధనల మేర సమావేశాలు నిర్వహించుకోవాలని జీవోలో ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈనెల 20న జీవో నెంబర్ 1పై దాఖలు చేసిన పిటీషన్ పై మరోసారి ఇరువైపులా వాదనలను కోర్టు విననుంది. అనంతరం ఈ ఉత్తర్వులను పూర్తి స్థాయిలో అమలు చేస్తుందా లేక ప్రభుత్వ వాదనలతో ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో1పై కొంతకాలంగా రచ్చ నడుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన సమయంలో ఈ జీవో కారణంగా చూపుతూ ముందుగా నిర్ణయించిన సభలకు అనుమతి నిరాకరించారు. దాంతో చంద్రబాబు సీరియస్ అయ్యారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో బ్రిటిష్ చట్టాలకు అనుగుణంగా ఉందని అసంబద్దంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసారు. పాదయాత్రగాగా కుప్పం గ్రామాల్లో పర్యటించారు. కుప్పంలో పోలీసులు చంద్రబాబును అడ్డుకోవటాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా తప్పుబట్టారు. నేరుగా చంద్రబాబుకు ఇంటికి వెళ్లి సంఘీభావం కూడా ప్రకటించారు. జీవో నెంబర్ 1 ఉపసంహరించుకొనే వరకూ పోరాటం చేయాలని నిర్ణయించారు. మిగిలిన పార్టీలను కలుపుకొని వెళ్లాలని డిసైడ్ అయ్యారు.
ప్రభుత్వం మాత్రం ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించే ఉద్దేశంతో జారీ చేసిన ఉత్తర్వులుగా పేర్కొంది. వైసీపీతో సహా ప్రతీ రాజకీయ పార్టీకి వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే రాజమహేంద్రవరం సీఎం పర్యటన సందర్భంగా రోడ్లు బ్లాక్ చేశారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. జీవో 1 అమల్లోకి వచ్చాక నందిగామ, విజయనగరంలో వైసీపీ నేతలు రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహించారనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వానికి ఓ రూలు ప్రతిపక్షాలకు మరో రూలు అమలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే జీవోను రద్దు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. కోర్టు ఆదేశాలతోనైనా తీరు మార్చుకోవాలని ప్రభుత్వానికి కౌంటర్ ఇస్తున్నారు.