టీడీపీతో పొత్తుకు పవన్ గ్రీన్ సిగ్నల్

By KTV Telugu On 13 January, 2023
image

శ్రీకాకుళం జిల్లా రణస్థలం జనసేన యువశక్తి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై జనసేన అధినేత క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో చెడ్డోడిని ఎదుర్కొనేందుకు శత్రువుతోనైనా చేతులు కలపాల్సిందేనంటున్నారు. అంటే తన ప్రధాన శత్రువు జగన్ అని చెప్పకనే చెప్పారు. టీడీపీతో పొత్తు ఉంటుందని పరోక్షంగా తేల్చేశారు. అయితే ఎక్కడా గౌరవం తగ్గకుండా ఉంటే పొత్తుకు ఓకే అన్న పవన్ లేదంటే ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పారు. ఇక్కడ పవన్ మరో ఆసక్తికర కామెంట్ చేశారు. ఒంటరిగా పోటీ చేసి వీరమరణం పొందాల్సిన అవసరం లేదంటూ తన బేలతనాన్ని బయటపెట్టుకున్నారు. అంతేకాదు తనను ఆదరిస్తున్న జనసైనికుల మీద నమ్మకం లేదంటూ పవన్ చేసిన కామెంట్స్‌ పార్టీలోనే చర్చనీయాంశంగా మారాయి. సొంత పార్టీ నేతల మీద నమ్మకం లేకనే ఇతర పార్టీలతో పొత్తు తప్పడం లేదనే విషయాన్ని జనసేనాని చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో కాపులంతా వైసీపీ వెంట నిలిచారు. కొన్ని చోట్ల పవన్‌ను ఆదరించే వారు కూడా జగన్‌కే ఓటు గుద్దారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎన్నికలొచ్చినప్పుడు వైసీపీకి ఓటు వేస్తూ తనను సీఎం సీఎం అని అరిస్తే ఎలా సీఎం అవుతానంటూ పలు వేదికల్లో పవన్ అసహనం వ్యక్తం చేశారు కూడా.

బలం సరిపోతుందనుకుంటే ఒంటరిగానే పోటీ చేస్తాం. ఆ నమ్మకం మీరిస్తారా అని పార్టీ కార్యకర్తలనుద్దేశించి పవన్ ప్రసంగించిన తీరు తన అమాయకత్వాన్ని చాటుకున్నట్టుగా ఉందంటున్నారు విశ్లేషకులు. పవన్ పార్ట్ టైమ్ పొలిటీషియన్ అని బాబుకు కష్టం వచ్చినప్పుడే బయటకు వస్తారని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. అందుకు తగ్గట్లే పవన్ వ్యవహారశైలి కూడా ఉందనే విమర్శలు ఉన్నాయి. అప్పుడప్పుడూ టూరిస్టులా వచ్చి పోతే పార్టీకి ఓట్లు ఎలా పడతాయ్? నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలపై పోరాడితేనే ప్రజల మనన్ననలు పొందగలుగుతామనే విషయాన్ని పవన్ తెలుసుకోలేకపోతే ఎలా? అనే ప్రశ్నలు జనసేనలోనే ఉత్పన్నమవుతున్నాయి. వాస్తవానికి పవన్ ఎప్పుడు వచ్చినా పెద్ద సంఖ్యలో జనం వచ్చి ఆదరిస్తున్నారు. ఇక, జనసేనాని రాష్ట్రంలోనే ఉంటూ ప్రజాసమస్యలపై తరచూ దృష్టి కేంద్రీకరిస్తే జనసైనికుల్లో పోరాడే బలం మరింత రెట్టింపు అవుతుంది. కానీ అదేమీ చేయకుండా కార్యకర్తలు సపోర్ట్ చేయడం లేదు ఓట్లు వేయడం లేదంటూ పార్టీ అధినేతగా మాట్లాడాల్సిన మాటలు కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక ఈ సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. అదే స్థాయిలో చర్చనీయాంశమౌతోన్నాయి. జనసేన పార్టీని స్థాపించిన మొదట్లో కనిపించిన ఫైర్ ఇప్పుడు లేదనే మాట వినిపిస్తోంది. యువతకు స్ఫూర్తిప్రదాతగా చెప్పుకొనే స్వామి వివేకానందుడి జయంతి నాడు అదే యువతను పార్టీ వైపు ఆకర్షితులను చేయడానికి ఉద్దేశించిన సభలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విమర్శలకు దిగారు. మేమే పాలింటాలి ఎవర్నీ రానివ్వమంటూ వైసీపీ వాళ్లు బెదిరిస్తున్నారని అలాంటి వెధవలకు భయపడేవాణ్ని కాదంటూ పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీని సైకో పార్టీగా అభివర్ణించిన జనసేనాని జగన్ అసాంఘిక శక్తి అంటూ మండిపడ్డారు. మంత్రి రోజాను డైమండ్ రాణితో పోల్చిన పవన్ మరోసారి చెప్పుల ప్రస్తావన తీసుకొచ్చారు. తనను ఇంకోసారి ప్యాకేజీ స్టార్ అని ఎవరైనా అంటే వీర మహిళ చెప్పు తీసుకుని కొడతానని హెచ్చరించారు. వారాహితో వస్తాం ఎవడాపుతాడో చూస్తాం అంటూ వైసీపీ నేతలకు సవాల్‌ విసిరారు.

అంతేకాదు రాజశేఖర్ రెడ్డినే ఎదుర్కొన్నవాడిని జగన్ ఓ లెక్క కాదు అనే రేంజ్‌లో పవన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వైఎస్సార్‌ను పంచెలూడదీసి కొట్టమని చెప్పానని తర్వాత వారి మనుషులు తనపై దాడులు చేసి తన కుటుంబాన్ని బెదిరించారని పవన్ చెప్పుకొచ్చారు. చంద్రబాబుతో భేటీకి సంబంధించి జనసేనాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో తనను నిర్బంధించినప్పుడు కలిసి సంఘీభావం తెలిపారు గనుకే తాను ఆయనకు సంఘీభావం తెలిపానంటూ చెప్పడం గమనార్హం. ఏటా రూ.25 కోట్ల పన్ను కట్టే సత్తా ఉన్నవాణ్ని చంద్రబాబుతో తాను బేరసారాలు ఆడడమేంటని వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. సంబరాల రాంబాబు ఐటీ మంత్రుల శాఖల పనితీరుతో పాటు వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వననే విషయాలను చంద్రబాబుతో చర్చించానంటూ సెటైర్లు వేశారు పవన్ కళ్యాణ్. జగన్‌ మూడుముక్కల ముఖ్యమంత్రి అయితే ఆయనకో ఢంకా పలాసు సలహాదారు సజ్జల అంటూ ఎద్దేవా చేశారు. డీజీపీ ఖైదీ నంబర్‌ 6093కు సెల్యూట్ కొడుతున్నారని ముఖ్యమంత్రికి కాదని విమర్శించారు.

మొత్తంగా చూస్తే తన సభలకు వచ్చిన వారు కూడా తనకు ఓటు వేయరనే నమ్మకం పవన్ కళ్యాణ్ లో బలంగా నాటుకు పోయినట్లు కనిపించింది. ఆ కారణంతోనే చివరికి ప్రజలపైన కూడా విశ్వాసాన్ని కోల్పోయిన పరిస్థితికి వచ్చాడని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. జనాలను నమ్ముకుని రాజకీయాల్లోకి వస్తే, వాళ్లే తనను మధ్యలో వదిలేశారంటూ పవన్ ప్రజలను నిందించిన తీరు హాస్యాస్పదంగా ఉందంటున్నారు విశ్లేషకులు. ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన పవన్ నిరంతరం వాళ్ల విశ్వాసాన్ని పొందగలిగేలా వ్యవహరించాల్సి ఉంటుందే తప్ప అసహనం వ్యక్తం చేయడంలో అర్థం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనసైనికుల కన్నా బాబునే ఎక్కువగా నమ్ముకొని పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోరాటం చేసి వీరమరణం పొందాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ చెప్పడం చూస్తుంటే తెలుగుదేశం పార్టీలాగే ఆయన కూడా పొత్తుల కోసం తాపత్రయ పడుతున్నారని తేలిపోయింది.