సాధారణంగా రాజకీయ పార్టీల నేతల మధ్య వాదోపవాదాలు విమర్శలు జరుగుతూ ఉంటాయి. రాజకీయ పార్టీల నేతలపై అదీ ముఖ్యంగా ముఖ్యమంత్రి లాంటి పొజిషన్లో ఉన్న నేతలపై రాజకీయాలకు సంబంధం లేని వారు కామెంట్లు చేయరు. అలా చేస్తే ఎదురయ్యే పరిస్థితులపై వారికి స్పష్టమైన అవగాహన ఉంటుంది. కానీ అనూహ్యంగా బాలీవుడ్ సింగర్ అద్నాన్ సమీ నేరుగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. జగన్ సెపరేటిస్ట్ అని మండిపడ్డారు. అలాంటి వారి తీరు వల్లే 1947 ఘటన అంటే దేశ విభజన జరిగిందన్నట్లుగా ఘాటుగా వ్యాఖ్యానించారు. దీంతో ఒక్క సారిగా దుమారం ప్రారంభమయింది. ఏపీలో నుంచి వైసీపీ వ్యతిరేకులు సమీకి మద్దతు పలుకుతూండగా సహజంగా వైసీపీ సపోర్టర్లు తిట్టి పోస్తున్నారు. అయితే ఈ ట్వీట్ అంశం ఒక్క ఏపీలోనే కాదు దేశం మొత్తం చర్చ జరుగుతోంది. చివరికి అటూ ఇటూ తిరిగి అద్నాన్ సమీ జాతీయతపైనా చర్చ జరుగుతోంది. అసలు ఇక్కడ తప్పెవరు చేశారు?
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చినందుకు అభినందిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో తెలుగు ఫ్లాగ్ అనే మాట వాడారు. ఆర్ఆర్ఆర్ కూడా ఓ తెలుగు సినిమా. ఇదే ఉద్దేశంతో సీఎం జగన్ ట్వీట్ చేసి ఉంటారు. కానీ బాలీవుడ్ సింగర్ అద్నాన్ సమీ మాత్రం సీఎం జగన్ అభినందనల్లో సేపరేటిజం చూశారు. విమర్శిస్తూ ట్వీట్ చేశారు. అద్నాన్ సమీ సీఎం జగన్ ట్వీట్‌పై చేసిన కామెంట్ పై సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వచ్చాయి. అయితే ఎక్కువ మంది అద్నాన్ సమీ అభిప్రాయం తప్పు అనే వ్యక్తం చేశారు. భారత దేశం భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశమని గుర్తు చేశారు. అద్నాన్ సమీ కామెంట్‌పై తెలుగు రాష్ట్రాల్లోని వైఎస్ఆర్సీపీ అభిమానులు ఆయనకు గట్టి కౌంటర్ ఇచ్చారు. మంత్రి విడదల రజనీతో పాటు సలహాదారు రాజీవ్ కృష్ణ కూడా స్పందించారు. వీరికి అద్నాన్ సమీ కౌంటర్ ఇచ్చారు. అయితే అద్నాన్ సమీ ఇచ్చిన ప్రతీ రిప్లస్ సెన్సిబుల్ గానే ఉంది. ఆయన తన వాదన గట్టిగా వినిపిస్తున్నారు. సంగీతానికి ప్రాంతాలు ఉండవని అంటున్నారు.
ఈ అంశంపై సోషల్ మీడియాలో ఇంకా వాదోవవాదాలు జరుగుతున్నాయి. దానికి సమీ కౌంటర్ ఇస్తున్నారు. చాలా మంది అద్నాన్ సమీ జాతీయతపైనా ప్రశ్నిస్తున్నారు. నిజానికి అద్నాన్ సమీ పాకిస్థాన్ జాతీయుడు. అక్కడి పౌరసత్వం వదులుకుని ఇండియాలో స్థిరపడ్డారు. భారత ప్రభుత్వం పౌరసత్వం కూడా ఇచ్చింది. స్వతహాగా భాతీయుడి కాని అద్నాన్ సమీ. తన దేశభక్తిని ప్రదర్శించుకోవడం కోసమే ఇలా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని టార్గెట్ చేసుకున్నారని కొంత మంది విమర్శలు గుప్పిస్తున్నారు. అద్నాన్ సమీ మామూలుగా అయితే స్పందించే వారు కాదు. కానీ ఆర్ఆర్అర్ సినిమా పాటకు సంగీతానికి సంబంధించినది కాబట్టి ఆ సంగీతానికి ప్రాంతీయత ఆపాదించారనే ఆయన స్పందించి ఉంటారని బాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అద్నాన్ సమీ చేసిన ట్వీట్ విషయంలో దేశ వ్యాప్త చర్చ జరుగుతోంది. సంగీతానికి ప్రాంతీయ ఉండదు కానీ అది తెలుగు పాట అని చెప్పుకుంటే ఎందుకు అభ్యంతరం అనే వాదన ఎక్కువగా వినిపిస్తోంది. ఇటీవలి కాలంలో బాలీవుడ్ సినిమాల్లో దక్షిణాది ప్రాధాన్యత పెరిగింది. బహుశా ఈ కోపం ఈర్ష్య కారణంగా బాలీవుడ్ కన్నా దక్షిణాది సినిమాలకు ఎక్కువ గుర్తింపు వస్తున్న కారణంగా ఇలాంటి మాటలు మాట్లాడి ఉంటారన్న వాదన కూడా ఉంది. ఇంత కాలం భారతీయ సినిమా అంటే బాలీవుడ్ సినిమా అనే చెబుతారు. భారతీయ సినిమా కేటగరిలో ఎప్పుడూ దక్షిణాది సినిమాలు రావు. కానీ ఇంత కాలం ఎవరూ ఈ అంశంపై మాట్లాడలేదు. కానీ ఇప్పుడు అంతర్జాతీయంగా దక్షిణాది సినిమాలు గుర్తింపు తెచ్చుకుంటూడే సరికి వాటికి భారతీయ సినిమా అనే ముద్రే వేయాలని తెలుగు లేదా తమిళ్ అనే ముద్ర వేయవద్దన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. అందులో భాగంగానే అద్నాన్ సమీ ట్వీట్ పుట్టుకొచ్చిందని నమ్ముతున్నారు.
కారణం ఏదైనా ఆర్ఆర్అర్ అంతర్జాతీయగా వెళ్లినప్పుడు భారతీయ సినిమానే. అయితే భారతీయుల ప్రతిభకు సజీవ సాక్ష్యమే. భారత్ కాదు ఏపీ లేదా తెలుగు అని చెప్పుకోవడం కూడా తప్పే. ఇండియాలో అయితే ఇది తెలుగు నుంచి వచ్చిన పాన్ ఇండియా మూవీ అని చెప్పుకోవచ్చు. కానీ అంతర్జాతీయంగా అయితే తెలుగు అని కాకుండా ఇండియానే ప్రమోట్ చేయాలి. నిజానికి ఆర్ఆర్ఆర్ టీం అదే చేసింది. కానీ సీఎం జగన్ మాత్రం అభినందనల విషయంలో తెలుగు ఫ్లాగ్ అనే పదం వాడారు. ఆయన అలా వాడటానికి సినిమా యూనిట్‌కు సంబంధం లేదు. ఆయన సీఎం కాబట్టి అలా వేరు చేయకూడదని అద్నాన్ సమీ వాదన. రెండు వర్గాల వాదనలను చూస్తే ఎవరినీ తప్పు పట్టలేం. ఈ టాపిక్‌లో రెండు వర్గాల వాదనలకూ వెయిట్ ఉందని అర్థం చేసుకోవచ్చు.